పూజలందుకోవయ్య ప్రహ్లాదరాయా

మంత్రాలయ రాఘవేంద్రస్వామి 350వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు ఆగస్టు 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. 21న ధ్వజారోహణం, 22న ప్రత్యేక పూజలు, 23న పూర్వారాధన, 24న మధ్యారాధన, 25న మహారథోత్సవం, 27న సర్వసమర్పణోత్సవం ఘనంగా జరగనున్నాయి.

Updated : 19 Aug 2021 01:49 IST

మంత్రాలయ రాఘవేంద్రస్వామి 350వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు ఆగస్టు 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. 21న ధ్వజారోహణం, 22న ప్రత్యేక పూజలు, 23న పూర్వారాధన, 24న మధ్యారాధన, 25న మహారథోత్సవం, 27న సర్వసమర్పణోత్సవం ఘనంగా జరగనున్నాయి.

రాఘవేంద్రస్వామి కృతయుగంలో ప్రహ్లాదరాయలుగా, ద్వాపరయుగంలో బాహ్లీకరాజుగా, కలియుగంలో వ్యాసరాజులు.. రాఘవేంద్రునిగా అవతరించారు. రెండుసార్లు రాజుగా, మరో రెండుసార్లు సన్యాసిగా అవతరించారు. సన్యాసుల నియమాల ప్రకారం ఉత్సవాలు, వాహనసేవలు ఉండవు. అయితే స్వామికి భక్తుల సంఖ్య పెరిగిపోతున్నందున ఉత్సవాలు నిర్వహించాలని అప్పటి మఠ పీఠాధిపతి సుశీలేంద్రతీర్థులు భావించారు. పండితులతో చర్చల అనంతరం స్వామి పూర్వ అవతారమైన ప్రహ్లాదరాజులకు చేయవచ్చని నిర్ణ్ణయించి ఉత్సవమూర్తిని తయారుచేయించారు. ఆ విగ్రహంలో స్వామి నాలుగు అవతారాలను ఆవాహనం చేయించారు. నాటి నుంచి ప్రహ్లాదరాయలకు ఉత్సవాలను జరుపుతున్నారు. ఉదయం బృందావనం చెంత నిర్మల్యభిషేకం, పంచామృతాభిషేకం, గంధాది అలంకరణలు, నైవేద్య సమర్పణ, మంగళహారతి  నిర్వహిస్తారు. ఊరేగింపు మాత్రం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల విగ్రహానికి నిర్వహిస్తున్నారు..

నూరేళ్లుగా ఉత్సవాలు..

రాఘవేంద్రస్వామి మఠంలో ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. గతంలో కేవలం స్వామివారి వెండి బృందావనాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించేవారు. ప్రహ్లాదరాయుల ఉత్సవమూర్తి అందుబాటులోకి వచ్చిన తర్వాత స్వామివారికి మహా రథోత్సవం నిర్వహిస్తున్నారు. మొదట్లో స్వామివారికి మహా రథోత్సవాన్ని మఠం మాడవీధుల్లో ఊరేగించేవారు. ప్రస్తుతం పురవీధుల్లోనూ ఊరేగిస్తున్నారు.

ప్రహ్లాదరాజుల కులదైవం మంచాలమ్మ

స్వామి పూర్వ అవతారం ప్రహ్లాదరాజు కాలంలో మంచాల ఆయన ఆధీనంలోని గ్రామం. ఇక్కడ వెలసిన  మాంచాలమ్మ వారి కులదైవం. ద్వాపరంలో మంచాల ప్రాంతంలో అనుసాలుడనే రాజుకీ, అర్జునుడికీ యుద్ధం జరిగిందట. అతడిని ఓడించడం అర్జునుడికి కష్టం కాగా శ్రీకృష్ణుడు ఆ స్థలమహత్యాన్ని తెలుసుకొని తన రథాన్ని కొంత వెనక్కి తీసుకోగా అనుసాలుడు తన రథాన్ని ముందుకు పోనిచ్చాడు. స్థలం వదిలి రాగానే ఓటమి పాలయ్యాడు. కలియుగంలో మంచాల ఆదోని నవాబు ఆధీనంలో ఉండేది. రాఘవేంద్రస్వామి తనకు మంచాల గ్రామం కావాలని కోరగా అది నిరుపయోగమైందని చెప్పాడు రాజు. అదెంతో పవిత్ర స్థలమని స్వామి వివరించడంతో రాజు  ఆ గ్రామాన్ని ఇచ్చేశాడు. అలా రాఘవేంద్రులు క్రీ.శ.1671 శ్రీవిరోధినామ సంవత్సరం శ్రావణ కృష్ణపక్ష విదియనాడు బృందావన ప్రవేశం చేసి, భక్తులకు కొంగు బంగారంగా కొలువయ్యారు.


నిత్యం ఉత్సవమే..

మంత్రాలయంలో ఏకాదశి, శ్రీకృష్ణాష్టమి రోజులు మినహా నిత్యం ఉత్సవమే. ప్రహ్లాదరాయలకు  అభిషేకాలు, అలంకరణలు, నైవేద్యం, పాదపూజ, కనకాభిషేకం, పల్లకి సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం వెండి గజవాహనం, చెక్క, వెండి, బంగారు, నవరత్నరథోత్సవం, ఊంజల్‌ సేవ పూజా క్రతువులు నిర్వహిస్తారు.

- ఈడిగ రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని