ఆమే సర్వం.. ఆమే సకలం

ఊరి మధ్యలో రామాలయమో శివాలయమో ఉన్నట్టే ఊరి చివర పోచమ్మ, మైసమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ ఆలయాలుంటాయి. ఇంతకీ ఈ చిన్నచిన్న గుళ్లు ఎలా వెలిశాయో గ్రామదేవతల విశిష్టతేంటో చూద్దాం... ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామస్తులను, పంటచేలను అన్ని రకాల ఉపద్రవాల నుంచి రక్షించే దేవతలే గ్రామదేవతలు.

Updated : 16 Sep 2021 05:02 IST

ఊరి మధ్యలో రామాలయమో శివాలయమో ఉన్నట్టే ఊరి చివర పోచమ్మ, మైసమ్మ, గంగానమ్మ, పోలేరమ్మ ఆలయాలుంటాయి. ఇంతకీ ఈ చిన్నచిన్న గుళ్లు ఎలా వెలిశాయో గ్రామదేవతల విశిష్టతేంటో చూద్దాం...

ఊరి పొలిమేరల్లో ఉండి గ్రామస్తులను, పంటచేలను అన్ని రకాల ఉపద్రవాల నుంచి రక్షించే దేవతలే గ్రామదేవతలు. 

స్త్రియో దేవాః స్త్రియః ప్రాణాస్త్రియశ్చైవ విభూషణ్‌!

స్త్రీ ద్వేషోనైవ కర్తవ్యోవిశేషాత్‌ పూజనం మహత్‌!

స్త్రీ మయశ్చ జగత్సర్వం తదాత్మానంచ భావయేత్‌!

అనే శ్లోకాన్ని బట్టి- శక్తికి ప్రతిరూపం స్త్రీ. బిడ్డలను సాకే సహనం ఆమె సొంతం. కనుకనే గ్రామ రక్షణకుగాను ఊరి పొలిమేరల్లో గ్రామ దేవతలు వెలశారు. మాతకు పర్యాయ పదాలైన అమ్మ, అంబ, అవ్వ పేర్లను కాళి, చండి, కాత్యాయని, భైరవి, భారతి ఇత్యాదులకు చేర్చారు. ప్రకృతిలోని ‘ప్ర’,‘కృ’,‘తి’ అనే మూడక్షరాలు వరుసగా సత్వ, రజో, తమోగుణాలను సూచిస్తాయి. ‘ఈ త్రిగుణాలే సరస్వతి, లక్ష్మి, పార్వతిదేవి రూపాలు. వీటి అంశావతారాలే గ్రామ దేవతలు’ అని దేవీ భాగవతం వివరించింది.

కళ్లెదురుగా కంచి కామాక్షి

సర్వ సమానత్వ భావనే గ్రామదేవతల ముఖ్య ఉద్దేశం. వైదిక పరంగా దేవి ఆరాధనకు నియమనిష్ఠలు పాటించాలి. అర్చనలు జరగాలి. అవి అందరికీ వీలవదు కనుక గ్రామ దేవతలు వెలశారు. అలాగే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ లాంటి అమ్మవార్లను అనుకున్నదే తడవుగా దర్శించడం అందరికీ, అన్నిసార్లూ సాధ్యం కాదని ఊళ్లోనే దేవతా మూర్తిని ఏర్పరిచి, ఆమెలో జగన్మాతను చూసుకుని తృప్తిచెందుతున్నారనేది పెద్దల విశ్లేషణ. అలా కామాక్షి కామమ్మ, చండి చెన్నమ్మ, పార్వతి పారమ్మ, లక్ష్మీదేవి లచ్చమ్మ అయ్యారు. ప్రాంతం, భాష, ఉచ్చారణల వల్ల పేర్లు రూపాంతరం చెందాయి. ఈ దేవతలను, ఏ పద్ధతి లోనైనా పూజించ వచ్చు. ఏ కులంవారైనా పూజారులుగా వ్యవహరించవచ్చు.

పోతరాజు ఏమవుతాడు?

గ్రామదేవతలకు అన్నివిధాలా అండదండలు అందించేవాడు పోతరాజు లేదా పోతురాజు. అమ్మ, అమ్మవారు, తల్లి లాంటి పేర్లతో ఏడుగురు దేవతలు ఉన్నారు. ఆ సప్త మాతృకలకు సోదరుడు పోతరాజు. పురాణ కథ ప్రకారం- శివపార్వతులకు కుమారులు కలిగాక ఒకరోజు విహారానికెళ్లారు. అక్కడ పార్వతి ఓ కొలనులోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు. ఇదేమిటన్న పార్వతికి వారి జన్మ రహస్యాన్ని శివుడు తెలియజేశాడు. అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసికెళ్దామనుకుంటే శివుడు వారించి ‘వీరిది స్వతంత్ర ప్రవృత్తి. మనమాట వినరు, ఇక్కడే ఉంచుదాం’ అని, ఒక గణాన్ని సృష్టించి, పోతరాజని పేరుపెట్టి, వారి రక్షణార్థం నిలిపాడు. ఆ ఏడుగురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.

ఆ పేర్లు ఎలా వచ్చాయి?

గ్రామదేవతల పేర్లు పరిశీలిస్తే- పొలిమేరలో ఉండి కాపాడుతుందని ‘పొలిమేరమ్మ’.. క్రమంగా ‘పోలేరమ్మ’ అయింది. ఎల్ల(సరిహద్దు)లో ఉండే అమ్మ ‘ఎల్లమ్మ’, చల్లగా చూసే తల్లి ‘శీతలాంబ’, బతుకుకి అవసరమైనవన్నీ సమకూర్చే తల్లి బతుకమ్మ. పోషించే తల్లి ‘పోష+అమ్మ=పోషమ్మ.. పోచమ్మ’. కష్టాలను పోచలా (గడ్డిపరక) తీసి పడేస్తుంది కనుక ఆ పేరొచ్చిందని కూడా కొందరంటారు. ప్రాణాధారమైన ప్రకృతి వనరులను దేవతలుగా ఆరాధిస్తూ, వాటిపట్ల కృతజ్ఞత తెలిపే క్రమంలో గంగానమ్మ (జల వనరైన గంగానది) అగ్నికి మారుపేరుతో అగ్గమ్మ, బూడిదని(బుగ్గి) విభూతిగా భావించే తల్లి బుగ్గమ్మ, ఆకాశమంత ఎత్తులో వున్నందున కొండమ్మ అంటూ పూజిస్తారు. సూర్యచంద్రులకు ప్రతీకగా సూరీడమ్మ, చంద్రమ్మ దేవతలున్నారు.

పైరు పేర్లతోనూ పూజలు..

రైతులకు ఆధారం, ఆరాధనీయం అయిన పంటలతో ఏర్పడిందే పంటలమ్మ. ఆయా ప్రాంతాల్లో పండే పంటల పేర్లతో కొలుస్తున్నారు.. గోగునార పండే ప్రాంతంలో ‘గోగులమ్మ’, జొన్నలు పండే చోట ‘జొన్నాళమ్మ’, నూకలు అంటే వరితో నూకాళమ్మ.. నూకాలమ్మ, కుంకుళ్లు విస్తారంగా పండే చోట కుంకుళ్లమ్మగా పూజిస్తారు. అన్నంపెట్టిన తల్లిని అన్నమ్మగా ఆరాధిస్తూ జాతర చేయడం తెలిసిందే.

పాముకూ పూజలే

సుబ్రహ్మణ్య స్వరూపంగా ‘పుట్టమ్మ’ ‘నాగేశ్వరమ్మ’ ‘నాగమ్మ’ ‘నాగులమ్మ’ అంటూ ఆరాధిస్తారు. దిబ్బ అంటే మట్టిగట్టు. దాని మీదున్నది దిబ్బమ్మ. అలాగే పాము+అమ్మ=పాపమ్మ. పాపాలను పోగొట్టే తల్లి కూడా. కోటను కాపాడే దేవత కోటమ్మ- ఇలా అనేక నామాలతో గ్రామ దేవతలు ఉన్నారు. మా ఊర్లు అన్నిటికీ అమ్మ ‘మావూర్లమ్మ’ వ్యవహారికంలో ‘మావుళ్లమ్మ’, తలపులలో నిలిచే అమ్మ ‘తలపులమ్మ’ క్రమంగా ‘తలుపులమ్మ’ అయింది.

ఆరాధనా విధానాలు

గ్రామదేవతలకు చిన్నగుడి నిర్మించి, దేవి ప్రతిరూపంగా చెక్క లేదా రాతి రూపాన్ని నిలుపుతారు. పండుగరోజుల్లో ఘటా(కుండ) రూపంలో దేవతను తీసుకొచ్చి గద్దెమీద నిలిపి, మొక్కులు, ముడుపులు చెల్లించి, ఉత్సవం చేస్తారు.


వేప తల్లి

అమ్మవారు, గ్రామ్య పలుకుబడితో ‘అమ్మోరు’గా మారింది. కొన్ని గ్రామాల్లో ఒకరికంటే ఎక్కువ అమ్మవార్లను కొలిచే సంప్రదాయమూ ఉంది. అందువల్ల పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి, బుచ్చమ్మ తల్లి.. లాంటి వివిధ పేర్లతో ఆరాధిస్తున్నారు. అలాగే వేపచెట్టు అమ్మవారి ప్రతిరూపం అంటారు. ‘వేస్తే వేపకొమ్మ తీస్తే అసిరమ్మ’ అనే నానుడి అలా వచ్చిందే. అమ్మవారి ప్రతిరూపంగా నిలిపిన వేపను ఆరాధన తర్వాత కదల్చడానికి భయపడతారు. వేపను అక్కడే ఉంచాలనేది దీని అంతరార్థం. గ్రామ దేవతల పూజల్లో వేపమండలను తోరణాలుగా కడతారు. వాటిలో ఉన్న ఔషధగుణాలు గాలిలో వ్యాపించి ఆరోగ్యాన్ని ఇస్తాయనేది ఆంతర్యం.


- అయ్యగారి శ్రీనివాసరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని