సత్యం ఆదర్శమైతే.. మార్గం అహింసే

దీక్షే స్ఫూర్తి, సంకల్పమే స్వరూపం, అహింసే సిద్ధాంతంగా ప్రపంచ చరిత్రనే ప్రభావితం చేసిన మహాత్ముడికి బలాన్నిచ్చింది సత్యమే. గాంధీని గొప్ప పోరాట యోధుడిగా మలచిందీ... నిలిపిందీ ఆధ్యాత్మికతే! ఆయన ఆయుధాలు సత్యాగ్రహం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ. అణుబాంబుల్ని మించిన ఈ అస్త్రాలను అందించిందీ తాత్వికతే. ఈ క్రమంలో బాపూ పడ్డ మానసిక సంఘర్షణ, చేసిన మేథోమథనం ఆసక్తికరం. అది నేటి, భావి తరాలకూ అనుసరణీయం...

Updated : 30 Sep 2021 05:23 IST

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి
అహింసా దినోత్సవం

దీక్షే స్ఫూర్తి, సంకల్పమే స్వరూపం, అహింసే సిద్ధాంతంగా ప్రపంచ చరిత్రనే ప్రభావితం చేసిన మహాత్ముడికి బలాన్నిచ్చింది సత్యమే. గాంధీని గొప్ప పోరాట యోధుడిగా మలచిందీ... నిలిపిందీ ఆధ్యాత్మికతే! ఆయన ఆయుధాలు సత్యాగ్రహం, నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ. అణుబాంబుల్ని మించిన ఈ అస్త్రాలను అందించిందీ తాత్వికతే. ఈ క్రమంలో బాపూ పడ్డ మానసిక సంఘర్షణ, చేసిన మేథోమథనం ఆసక్తికరం. అది నేటి, భావి తరాలకూ అనుసరణీయం...

1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలపై విస్తృతంగా సాహిత్యం వచ్చింది. అందులో ఎరిక్‌ ఎరిక్సన్‌ ‘గాంధీస్‌ ట్రూత్‌ ఆన్‌ ది ఆరిజిన్స్‌ ఆఫ్‌ మిలిటెంట్‌ నాన్‌ వయొలెన్స్‌’ గొప్ప రచన. ఫ్రాయెడియన్‌ మనోవిశ్లేషణ నిపుణుడిగా ఎరిక్సన్‌ ఈ పుస్తకంలో గాంధీ ఆలోచనల్లో ‘సత్యం’ అంటే ఏమిటి? ఆయన ‘అహింస’ సిద్ధాంతానికీ సత్యానికీ ఉన్న సంబంధం ఏమిటి? అది నిజంగానే యుద్ధాన్ని వ్యతిరేకించే శాంతి మార్గమా?- అనే అంశాలను పరిశీలించాడు.

ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణ అనగానే మానవ సంబంధాల్లో శృంగారం, దానివల్ల కలిగే శాంతి, సంఘర్షణల రూపమనే అభిప్రాయం జనంలో స్థిరపడటాన, పైగా ఈ రచనలో ఒకటి రెండు చోట్ల ఆ ప్రస్తావన ఉండటాన గాంధీ శిష్యులు దీనికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ గాంధీజీ అహింసకు, ఫ్రాయిడ్‌ మనోవిశ్లేషణకూ ఉన్న సారూప్యతను విశ్లేషించాడు ఎరిక్సన్‌.

గాంధీ ‘సత్యం’ ఆదర్శమైతే, దాన్ని అర్థం చేసుకునే లేదా నిలబెట్టే ఏకైక మార్గం ‘అహింస’ అని ప్రతిపాదించాడు. అహింస కేవలం శాంతి వాదం కాదు, తీవ్ర ప్రకంపనలతో కూడిన శక్తివంతమైన మార్గమన్నాడు. బుద్ధుడు అవలంభించ మన్నది కూడా అహింసా సిద్ధాంతమే. పురాణేతిహాసాల్లోని ‘అహింసా పరమో ధర్మః’, ‘సత్యమేవ జయతే’ లాంటి రుషిసూక్తాలు చెప్పేదిదే కదా!

గాంధీ జీవితంలో న్యాయశాస్త్రం చదవడం కోసం లండన్‌లో గడిపిన రెండున్నరేళ్లు, దక్షిణాఫ్రికాలో గడిపిన తొలి పదేళ్లు చాలా కీలకం. తనని తొలిచేస్తున్న భౌతిక, ఆధ్యాత్మిక సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కున్నది ఇక్కడే. పాశ్చాత్య దేశాల చరిత్ర, నాగరికత, పారిశ్రామిక విప్లవానంతర సమాజ వికృత రూపాన్ని అర్థం చేసుకున్నది ఈ సమయంలోనే. అప్పుడే భారత్‌లో బెంగాల్‌ విభజన, ఫలితంగా యువతలో వచ్చిన తీవ్రవాద, హింసావాదాల పట్ల ఆకర్షణ, దక్షిణాఫ్రికాలోనూ దాని సారూప్యాలు గమనించాడు. బోయర్‌ యుద్ధం, జులూ తిరుగుబాటు, దాని అణచివేత, ఐరిష్‌ తిరుగుబాటు, దాన్ని బ్రిటన్‌ ఎదుర్కొనే తీరు- ఇవన్నీ కొత్త ఆలోచనలకు ఆకృతినిచ్చాయి.

1894లో తన ఆధ్యాత్మిక గురువు, జైనమత జ్ఞాని రాజచంద్రబాయితో జరిగిన చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు గాంధీ సైద్ధాంతిక రూపకల్పనలో కీలకం. స్వదేశానికి తిరిగొచ్చాక చంపారణ్‌, అహ్మదాబాద్‌ టెక్స్‌టైల్‌ సమ్మె, ఖేదా ఉద్యమాల్లో సత్యాగ్రహ ప్రయోగం విజయవంతమైనా చౌరీ- చౌరా సంఘటన మళ్లీ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. 1929 తర్వాత ‘భగవంతుడే సత్యం’ అనే ప్రతిపాదనను ‘సత్యమే భగవంతుడు’గా మార్చుకున్నాడు గాంధీ.

సత్యం గొప్పతనం గురించి మనుస్మృతిలో ఇలా ఉంది...
న బ్రూయాత్‌ సత్య మప్రియం ప్రియం చ నానృతం
బ్రూయాత్‌ ఏష ధర్మ స్సనాతనః  
సత్యాన్నే పలకాలి. అది ప్రియమైనదిగా ఉండాలి. సత్యమైనప్పటికీ అప్రియమైన మాటలు, ప్రియం కలిగించేవి అయినా అబద్ధాలు కూడదు. ఇదే సనాతనధర్మం.

పన్నాలాల్‌దాస్‌ గుప్తా ‘రెవల్యూషనరీ గాంధీ’ పుస్తకంలో మార్క్సిస్టుగా గాంధీని ఇలా విశ్లేషించాడు- ‘సత్యాన్ని సత్యం ద్వారానే నిలబెట్టాలనేది మహాత్ముడి వాదన. ఆయన అహింసకు సాయుధ పోరాటాలతో సమానమైన తీవ్రత ఉంది’ అన్నాడు. అలాగే కెనడా విశ్రాంత చరిత్ర ఉపాధ్యాయుడు ఆంథోని పరేల్‌ తన ‘గాంధీస్‌ ఫిలాసఫీ అండ్‌ ది క్వెస్ట్‌ ఫర్‌ హార్మనీ’లో గాంధీజీ ఆధ్యాత్మికతను చర్చించారు. 1893-94ల్లో గాంధీజీ సనాతన హిందూ ధర్మంలోని చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థకామమోక్షాలను ఎలా అర్థం చేసుకుని సమకాల అవసరాలకు అన్వయించాడో ఇందులో వివరించాడు. ఆధునిక రాజకీయాలను, సాంప్రదాయ ధర్మాలను ఎలా సమన్వయం చేయాలన్న విషయంలో గాంధీ పడిన సంఘర్షణను చాలా బాగా చెప్పాడు.

గాంధీజీకి ముందు హింసనూ, యుద్ధాన్ని ఎదుర్కొనే మూడు మార్గాలు- ప్రతిహింస, శాంతి, ఆధ్యాత్మిక మార్గం. గాంధీజీ ప్రశ్నించి, తీవ్రంగా పరిశోధించి, సంఘర్షణకు లోనై కనుక్కున్న నాలుగో మార్గం- ‘సత్యం - అహింస’.
ఇది పారిశ్రామిక విప్లవం తరువాతి దశలో వచ్చిన హింస, శాంతి మార్గాలనూ, పలాయన, ఆధ్యాత్మిక మార్గాలన్నింటినీ తిరస్కరించిన తీవ్రత, గాఢత కలిగిన మార్గం. అందుకే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ కూడా గాంధీజీ అహింసను ‘మిలిటెంట్‌ నాన్‌ వయొలెన్స్‌’ అన్నాడు. పాశ్చాత్య మేధావులు కూడా హింసను వ్యతిరేకించారు. కానీ అది కేవలం శాంతివాదం (పాసిఫిజం). అందులోనూ పలాయన వాదమే ఉంది.

గాంధీజీ తాత్త్వికతను రూపొందించుకునే క్రమంలో చేసిన రచన ‘హింద్‌ స్వరాజ్‌’. పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతాల్లో మాఖియవెల్లీ నుంచి మార్క్స్‌, లెనిన్‌ల దాకా కనిపించే తీవ్రవాదం, హింసా వాదం, వాటి నిరుపయోగతనూ ప్రశ్నించిన పుస్తకమిది.

చరిత్రలో ఏదైనా స్థిరమైన మార్పు వచ్చి ఉంటే అది ప్రేమ ద్వారా వచ్చిందే కానీ హింస ద్వారా కాదని, స్వాతంత్య్రం అంటే పాశ్చాత్య ఆలోచనల ప్రభావం నుంచి కూడా బయటికి రావాలనే ప్రతిపాదనలు ఈ రచనలో కనిపిస్తాయి.

1909లో లండన్‌ నుంచి తిరిగొస్తూ ప్రయాణంలో వేగంగా రాసిన ఈ   పుస్తకం గాంధీజీ అహింస తాత్వికతకు ప్రధాన భూమిక.

జైనుల ప్రాథమిక సూత్రం అహింస. అది మరిన్ని సద్గుణాల దిశగా ప్రేరేపిస్తుందనేది జైనుల నమ్మకం. జైన, వైష్ణవ సాంప్రదాయాల్లో పెరిగిన గాంధీజీ ఆయా ఆచారాలను తన సిద్ధాంతాలకు ప్రాతిపదికగా చేసుకున్నారు.

భగవద్గీతకు గాంధీజీ రాసిన వ్యాఖ్యానంలో ‘ఒకవేళ అర్జునుడు మొత్తం హింసను వ్యతిరేకించి ఉంటే కృష్ణుడు కూడా అందుకు ఒప్పుకునే వాడేమో! కానీ తనవారిని చంపలేనన్న అసంబద్ధ వాదనను మాత్రం కృష్ణుడు అంగీకరించలేక పోయాడు’ అంటాడు.

అహింస బలవంతుడి ఆయుధం. పిరికితనంతో, బలహీనతతో యుద్ధం చేయలేనివాడిది కాదు. ఆశిష్‌ నంది తన ‘ఇంటిమేట్‌ ఎనిమీ’లో ‘గాంధీ అహింసలో- అహింస, నివారించదగిన హింస, అనివార్య హింస’ అనే మూడు సూత్రాలున్నాయి’ అన్నాడు. ఇది అహింసలో ఉన్న సంక్లిష్టత, గాఢత, తీవ్రత.

- డాక్టర్‌ అవధానం రఘుకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని