కరుణాకర శరవణభవ

పార్వతీపరమేశ్వరుల తనయుడు, విఘ్ననాయకుని సోదరుడు, మృత్యుదేవతకు అల్లుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎన్ని పేర్లో! కుమారస్వామి, షుణ్ముఖుడు, గుహుడు, మురుగన్‌, శరవణభవుడు, స్కందుడు, కార్తికేయుడు..

Published : 09 Dec 2021 00:38 IST

నేడు సుబ్రహ్మణ్య షష్ఠి

పార్వతీపరమేశ్వరుల తనయుడు, విఘ్ననాయకుని సోదరుడు, మృత్యుదేవతకు అల్లుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎన్ని పేర్లో! కుమారస్వామి, షుణ్ముఖుడు, గుహుడు, మురుగన్‌, శరవణభవుడు, స్కందుడు, కార్తికేయుడు.. ఇలా ఏ ప్రాంతం వారు ఏ పేరుతో పిలిచినా ఆర్తజన రక్షకుడై అండగా నిలుస్తాడు...

దాక్షాయణి ఆత్మాహుతితో పరమశివుడు ఒంటరిగా మిగిలాడు. క్షణకాలంలో ముల్లోకాల్ని కల్లోలంలో ముంచగలిగే విలయకారుడు విరాగిగా మారాడు. ఈ నేపథ్యంలో ‘అంబ లేని సాంబశివుడి జీవితానికి అర్థం లేదు. మహాశివుడి కొడుకు చేతిలో మాత్రమే తను మరణించాలి’ అని కోరుకున్నాడు తారకాసురుడు. అదెటూ జరిగేపని కాదని మురిసిపోయాడు.

నిజం మరోలా ఉంది. పార్వతి జన్మాంతరాలు దాటిన ప్రణయానికి ప్రతీక. శివ నామమే ఆమె హృదయంలో వినిపించే సుస్వర గీతిక. తీవ్ర తపోనిష్ఠతో పార్వతి పరమేశ్వరుణ్ని పతిగా చేసుకుంది. ఆలుమగల అన్యోన్యతకు ప్రతిఫలంగా తారకాసురుడి వధకు బీజం పడింది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆ లోకకంటకుణ్ని సుబ్రహ్మణ్యుడు వధించాడు. అదే సుబ్రహ్మణ్యషష్ఠి.

ఆకాశవాణి ఇలా ఆశీర్వదించింది

ఒకరోజు సుబ్రహ్మణ్యస్వామిని పరమశివుడు ప్రేమతో లాలిస్తుండగా, ఇంద్రాది దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి వచ్చారు. తారకాసురుణ్ని సంహరించేందుకు కుమారస్వామిని తమతో పంపమని కోరారు. అందుకు శివుడు సమ్మతించడంతో కుమారస్వామిని ముందుంచుకుని దేవతలంతా ఉత్సాహంగా బయల్దేరారు. అప్పుడు ఆకాశవాణి ఇలా ఆశీర్వదించింది..

తదా నభోగతా వాణీ హ్యువాచ పరిసాంత్వతాన్‌

శాంకరించ పురస్కృత్వ సర్వే యూయ ప్రతిష్ఠితాః

ధైత్యాన్విజిత్య సంగ్రామే జయినో హి భవిష్యథ

‘అత్యధిక శక్తి సంపన్నుడైన శివ కుమారుణ్ని నాయకుడిగా చేసుకుని వెళ్తున్నందున యుద్ధంలో తప్పక విజయం లభిస్తుంది’ అనేది దాని భావం. ఇంద్రాది దేవతలు గతంలో తారకాసురుణ్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ వ్యర్థమైనందున ఆకాశవాణి పలుకులతో దేవతల సంతోషం రెట్టింపయ్యింది.

దేవసేనతో వివాహం

దేవసేన మృత్యుదేవత కుమార్తె. ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు ఆమెను తపస్సు చేయమన్నాడు. కుమారస్వామికి దేవసేనతో వివాహం జరిపేందుకు బ్రహ్మ ఈ షష్ఠినాడే ఆమెను వెంట తీసుకొచ్చాడు.

బ్రహ్మణా నోదితా పూర్వం తపఃపరమాశ్రితా

తపసా తేన మహతా కుమారం ప్రతి వై తదా

ఆగతా దుహితా మృత్యోః సేనా నామైక సుందరీ

శివుడి అంగీకారంతో సుబ్రహ్మణ్యుడు దేవసేనను వివాహం చేసుకున్నాడు. అది చూసి శివపార్వతులతోపాటు దేవతలంతా సంతోషించారు.

సేనాధిపతిగా కుమారస్వామి

దేవతలు ఆనందంగా ఉన్న సమయంలో దేవగణానికి సేనాధిపతి లేని లోటు ప్రస్తావనకు వచ్చింది. కుమారస్వామి లాంటి గొప్ప వీరుడు ఉండగా వేరొకరి కోసం వెతకడం ఎందుకని సేనాధిపతిని చేశారు.

తల్లుల మధ్య వివాదం

కుమారస్వామికి జరుగుతున్న వేడుకలు చూసి ఆరుగురు కృత్తికలకు గంగ, పార్వతులతో వివాదం మొదలైంది. వారందరూ సుబ్రహ్మణ్యుడు తమకు మాత్రమే కుమారుడంటూ వాదించడం మొదలుపెట్టారు. అప్పుడు నారదుడు వారి ముందుకొచ్చి దేవతల కార్య నిమిత్తం పార్వతికి పరమేశ్వరుడి వలన ఇతడు జన్మించాడంటూ వివరించి వారి వివాదాన్ని పరిష్కరించాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆ సమయంలో కృత్తికలతో

గుహేనోక్తాస్తదా సర్వా రుషి పత్న్యశ్చ కృత్తికాః

నక్షత్రాణి సమాశ్రిత్య భవద్భిః స్థీయతాం చిరమ్‌

అంటూ మిగతా నక్షత్రాలతో కలిసి ఆకాశంలో చిరస్థాయిగా ఉండమని, వారికి శాశ్వత స్థానాన్ని కల్పించాడు.

తారకాసుర వధ

దేవతా సైన్యంతో యుద్ధరంగానికెళ్లిన సుబ్రహ్మణ్యుడికీ తారకాసురుడికీ ఘోర యుద్ధం జరిగింది. చివరికి అతడి శిరస్సు ఖండించగా దేవతలు, యక్షులు, గంధర్వులు సంతోషంతో పుష్పవృష్టి కురిపించారు.

నీరాజితా తదా దేవైః పార్వతీ శంభునా సహ

కుమారేణ సహైవాథశోమమానా తదా సతీ

విజయుడై నిలిచిన కుమారుణ్ని చూసి శివపార్వతులు మురిసిపోతూ ఆలింగనం చేసుకున్నారు. దేవతలంతా ఆ ముగ్గురినీ సత్కరించారు. సుబ్రహ్మణ్యషష్ఠికి ఇన్ని ప్రత్యేకతలున్నాయి.

పర్వతాలకు వరమిచ్చిన కుమారస్వామి

ఒకరోజు హిమవంతుడు తదితర పర్వత మూర్తులు కార్తికేయుణ్ని సమీపించి అనేక రకాలుగా స్తుతించారు. అందుకు సంతోషించిన సుబ్రహ్మణ్యస్వామి వారికి గొప్ప వరమిచ్చాడు.

పర్వతీయాని తీర్థాని భవిష్యంతి న చాన్యథా

శివాలయాని దివ్యాని దివ్యాన్యాయతనాని

‘ఓ పర్వతాల్లారా! ఇకమీదట పవిత్ర తీర్థాలు మీ నుంచే ఉద్భవిస్తాయి. శివాలయాలు, అందమైన కట్టడాలు మీ మీదనే వెలుస్తాయి. నేను చెబుతోంది నిజం’ అంటూ వారిని సంతోషింపచేశాడు.

ఒకసారి నందీశ్వరుడు ‘ఏయే శిలలతో ఏర్పడిన లింగములు పవిత్రమైనవి?’ అని అడగ్గా...

నీలం ముక్తా ప్రవాళంచ వైడూర్యం చంద్రమేవ చ

గోమేదం పద్మరాగం చ మారతం కాంచనం తథా

రాజతం తామ్రమారం చ తథా నాగమయం

పరమ్‌ రత్నధాతుమయాన్యేవ లింగాని కథితాని

అంటూ జవాబిచ్చాడు కార్తికేయుడు. అంటే నీలం, ముత్యం, ప్రవాళం, వైడూర్యం చంద్రకాంతం, గోమేధికం, పద్మరాగం, మరకతం, బంగారం, వెండి, రాగి, నాగమయం, తదితర రత్నధాతువులతో కూడినవి గొప్ప లింగాలని భావం.

సర్వపాపహరణం షణ్ముఖ దర్శనం

తారకాసురుర వధ తర్వాత ఒకరోజు యముడు ఈశ్వరుడితో ‘పరమేశ్వరా! నీవూ, బ్రహ్మదేవుడూ తీవ్ర తపస్సుకు సంతృప్తి చెందితే.. యజ్ఞాలు, ఉపవాసాలతో విష్ణువు సంతుష్టి చెందుతాడు. నమస్కారాలతో సూర్యుడు, అర్ఘ్యపాద్యాలు అర్పించడంతో వినాయకుడు ఆనందిస్తారు. కానీ కుమారస్వామికి పూజలూ వ్రతాలూ కూడా అక్కర్లేకుండానే కార్తికంలో దర్శించినంతమాత్రాన సర్వ పాపాలు నశిస్తున్నాయి. చనిపోయినవాళ్లంతా స్వర్గానికి వెళ్తున్నారు. అందువల్ల నా విధిని నిర్వర్తించడానికి ఆటంకంగా ఉంది’ అని చెప్పాడు.

దర్శనాచ్ఛ కుమారస్య సర్వే స్వర్గైకసో నరాః

పాపినోపి మహాదేవ జాతా నాస్త్యత్ర సంశయః

అందుకు పరమేశ్వరుడు ‘యమధర్మరాజా! ప్రజలకు వారు పుణ్యాత్ములు అయితేనే తీర్థయాత్రలు చేయాలనే కోరిక, సత్కర్మలు చేయాలనే ఆసక్తి కలుగుతాయి. అలాగే గతంలో మంచిపనులు చేసినవారికే కుమారస్వామి దర్శనమవుతుంది’ అని వివరించాడు.
షణ్ముఖునికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మందిరాలున్నా తమిళనాడులో అత్యధికంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యుని ‘హే స్వామినాథ కరుణాకర దీనబంధో’ అంటూ ప్రార్థిస్తే ఆశలు నెరవేరతాయని, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

- జి.జానకి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని