మార్గశిర మహాలక్ష్మి

విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి ఆలయం ప్రశస్తమైంది. దీనికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు

Published : 09 Dec 2021 00:38 IST

విశాఖపట్నం బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి ఆలయం ప్రశస్తమైంది. దీనికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు పాండవులతో ‘ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని అనుగ్రహం పొందండి! అప్పుడిక మీ అజ్ఞాతవాసం జయప్రదంగా ముగుస్తుంది’ అని చెప్పాడు. పాండవులు అలాగే చేశారు.

సాగరతీరం కావడంతో కెరటాల తాకిడికి విగ్రహం భూమిలో కూరుకుపోయింది. అనంతర కాలంలో కులోత్తుంగ చోళుడు కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకుని వస్తూ దారిలో ఈ ప్రాంతంలో విశ్రమించాడు. ఓ శిలా ప్రతిమ పైకి లేచి తనకు కోవెల కడితే ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తానంది. రాజు విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. అక్కడ రెండుగా చీలిన గుట్టలపై బురుజులు నిర్మించడంతో బురుజుపేటగా పిలుస్తున్నారు.

ఒక కథనం ప్రకారం.. తురుష్కుల భయంతో అమ్మవారి విగ్రహాన్ని బావిలో నిక్షిప్తం చేశారు. ఓ శివభక్తుడు ఆ మార్గం గుండా కాశీ వెళ్తుండగా బావిలోనున్న అమ్మవారు తనను వెలికి తీయమంది. అతడు ఉపేక్షించడంతో దేవి ఆయుధాన్ని విసరబోయింది. అతడి ప్రార్థన విన్న శివుడు అమ్మవారి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. అందుకే ఈ అమ్మవారికి వామహస్తం లేదు.

మరో కథనాన్ని అనుసరించి.. 1912లో ప్రజలు బావిలోంచి విగ్రహం తీసి  నెలకొల్పారు. రహదారి విస్తరణలో బురుజుల్ని తొలగించి విగ్రహాన్ని పక్కన పడేశారు. 1917లో విశాఖలో ప్లేగు ప్రబలినపుడు, అమ్మవారికి జరిగిన అపచారమే అందుకు కారణమనుకున్నారు. 1918లో అప్పటి జిల్లా కలెక్టర్‌ వెర్నన్‌ అమ్మవారికి అరుగు నిర్మించి నిలిపాడు. దేవికి మండపం ఉంది గానీ గర్భగుడి ప్రత్యేకంగా లేదు. పైకప్పు ఉండదు. తలుపులుండవు. ఇనుపచట్రం మాత్రం ఉంటుంది. అమ్మవారు మార్గశిర మాసంలో బావిలోంచి బయటకు వచ్చినందున ఈ నెలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

- డి.భారతీదేవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు