మౌనదీక్ష.. జ్ఞానభిక్ష..

మౌనానికి మారుపేరు రమణ మహర్షి. ఆత్మనిష్ఠతో ఆధ్యాత్మిక మేరుశిఖరం అనిపించుకున్నారు. కరుణార్ద్ర హృదయంతో సకల జీవరాసులపై వాత్సల్యం కురిపించారు. ఎందరో జిజ్ఞాసువుల సంశయాలను నివృత్తి చేశారు. మహర్షిని స్మరించినంతలో దుఃఖం నుంచి ఉపశమనం కలుగుతుంది, ప్రశాంతత అనుభూతికొస్తుంది.

Updated : 30 Dec 2021 03:43 IST

నేడు రమణ మహర్షి జయంతి

మౌనానికి మారుపేరు రమణ మహర్షి. ఆత్మనిష్ఠతో ఆధ్యాత్మిక మేరుశిఖరం అనిపించుకున్నారు. కరుణార్ద్ర హృదయంతో సకల జీవరాసులపై వాత్సల్యం కురిపించారు. ఎందరో జిజ్ఞాసువుల సంశయాలను నివృత్తి చేశారు. మహర్షిని స్మరించినంతలో దుఃఖం నుంచి ఉపశమనం కలుగుతుంది, ప్రశాంతత అనుభూతికొస్తుంది.

ఇంగ్లండ్‌కు చెందిన పాల్‌బ్రంటన్‌ అనే ఆధ్యాత్మికవేత్త అరుణాచలం సందర్శించారు. కాలాంతరంలో రమణ మహర్షి శిష్యుడిగా మారిపోయారు. ఆయన తొలుత ‘యాభై ఏళ్లకు పైగా ఓ మనిషి ఒకేచోట ఎలా ఉండగలుగుతున్నారు? అంత మౌనం ఎలా పాటిస్తున్నారు?’ అంటూ రమణుల గురించి ఆశ్చర్యపోయారు. అందుకు ఆశ్రమవాసి ఒకరు ‘నిజమే! అనుక్షణం మార్పు కోరుకునే విశ్రాంతి ఎరుగని మనసులకు యాభై సంవత్సరాలు ఒకేచోట ఉండటం దుర్లభమే. కానీ మహర్షి దృష్టిలో అది విశేషం కానేకాదు. విశ్వానికి అయస్కాంతం అనదగ్గ హృదయకేంద్రాన్ని ఆయన అందుకున్నారు. అరుణాచలంలానే స్థిరంగా ఉన్నారు’ అన్నారు. అది అక్షరాలా నిజం. అందుకే మహర్షి మౌనం లానే ఆయన బోధనలూ శక్తివంతం..
వేదవేదాంగాలలో ఉన్నదంతా రమణుల మౌనానికి వచన వ్యాఖ్యానమే! తనను ఆశ్రయించినవారిని రమణులు కొన్నిసార్లు భక్తి సెలయేటిలో స్నానమాచరింప చేస్తే, కొన్నిసార్లు జ్ఞానకడలి తరంగాలలో మునక లేయించేవారు! ‘ఇక్కడికొచ్చి వ్యర్థంగా ఎవరూ తిరిగెళ్లరు. నాస్తికుడు ఆస్తికుడవుతాడు. ఆస్తికుడు భక్తుడవుతాడు. భక్తుడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని విజ్ఞాని అవుతాడు’ అనేవారు మహర్షి. అలా వారు మౌనదీక్షతోనే అనంతం, అమృతోపమానమైన జ్ఞానభిక్ష పెట్టేవారు.

వాడకుండానే విస్తరాకును విసిరేస్తామా?
యోగనాథుడనే యువకుడు సంసార బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలచాడు. రమణులకు చెప్పకుండా ఏమీ చేయని అతడు దుఃఖంతో ఆశ్రమంలో అడుగుపెట్టాడు. అప్పుడు మహర్షి విస్తళ్లు కుడుతున్నారు. యోగనాథుడు ఏమీ చెప్పకుండానే రమణులు అతని అంతరంగం అర్థం చేసుకుని ‘చూశావా! విస్తరికోసం ఎంత శ్రమించాలో! ఆకులు, పుల్లలు తెచ్చి ఒక్కో పుల్లనూ ఎంతో ఓర్పుతో కుట్టాలి. అలా కుట్టిన విస్తరిని వినియోగించాకే కదా పడేయాలి’ అంటూ కళ్లలోకి చూశారు. అంతే అతడి ఆలోచన మారిపోయింది. శరీరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా, వదిలేయటం ధర్మంకాదని తెలుసుకున్నాడు. ఆత్మహత్య మహాపాపమని చెప్పకనే చెప్పారు మహర్షి. విస్తరి ఉదాహరణ తన జీవితానికీ అన్వయించుకున్నారాయన. వారికి చివరి రోజుల్లో సర్కోమా వ్యాధి సోకింది. ఔషధాలతో శరీరానికి ఉపశమనం కలుగుతుందని భక్తులు చెప్పబోతే.. ఎంగిలి విస్తరిని జాగ్రత్త చేయనట్లే శరీరం వచ్చిన పని ముగిసింది కనుక అది శిథిలమైంది, దానిని నిలబెట్టుకునేందుకు ప్రయాస పడనవసరం లేదన్నారు.

దయ లేని ధ్యానమెందుకు?
ఆధ్యాత్మిక సాధనతో మనసును లలితం చేయాలనే వారు మహర్షి. హృదయ లాలిత్యం లేని పారమార్థిక సాధనలతో ఫలితం లేదనేవారు. ఎప్పట్లాగే ఆయనోరోజు గిరి ప్రదక్షిణకు బయల్దేరగా చంటి పాప ఏడుపు వినిపించింది. అక్కడే ధ్యానముద్రలో ఉన్న భక్తుడు స్పందించలేదు. మహర్షి వెళ్లి పాపను ఎత్తుకుని ఊరడిస్తుండగా సాధకుడు లేచి వచ్చాడు. అప్పుడు రమణులు ‘ధ్యానానికి ప్రతిరూపం వాత్సల్యం. చంటిపిల్ల ఆకలి పట్టించుకోకుండా ఏం ధ్యానం చేస్తావయ్యా!’ అంటూ పిల్లల మీద దయను వ్యక్తం చేశారాయన.
మహర్షి బ్రహ్మజ్ఞానంతో ఓలలాడుతున్నా, భక్తుడిగా అరుణాలేశ్వరుడిపై అపార భక్తిప్రపత్తులు చాటుకునేవారు. అందరికీ ఆ భగవంతుడే దిక్కు అనేవారు. ఒకరోజు ఓ శిష్యుడు రమణులతో అరుణగిరిపైకి వెళుతూ ‘నా భార్య చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లెలా బతుకుతారో!’ అన్నాడు. అందుకు రమణ మహర్షి చిరునవ్వు నవ్వి, కొండమీద అప్పుడే పుట్టిన మేకపిల్లలను చూపారు. ‘పిల్లల్ని కని తల్లిమేక చనిపోయింది. వీటికి దిక్కెవరు? అరుణాచలేశ్వరుడే కదా! మనకీ అంతే’ అన్నారు.
‘భగవంతుడు అడిగిందల్లా ఇవ్వడు, అర్హమైందే ఇస్తాడు. నిలబెట్టుకోగలిగిందే నీ దగ్గరుంచుతాడు. ఏదీ అడగకుంటే ఆనందం ఇస్తాడు’ అనేవారు. ఒకరోజు ఓ జమీందారు ‘మీరు పశుపక్ష్యాదుల మీద చూపించే ప్రేమ మా మీద చూపరు’ అన్నాడు. దానికి రమణులు ‘అవును! అవి కోరికలతో రావు. ప్రేమగా వస్తాయి. ఆ ప్రేమ సహజం, సరళం. అందుకే వాటిని చూడగానే ఆనందం కలుగుతుంది. అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది. మీరలా కాదే! కోరికలతోనే వస్తారు’ అన్నారు. మహరి ఆశ్రమం భక్తుల కన్నా జంతుజాలంతోనే నిండిపోయేది. ఓ భక్తురాలు ఆశ్రమం ముంగిట రాతిపొడితో ముగ్గు వేస్తోంటే ‘అమ్మా! బియ్యప్పిండితో ముగ్గువేస్తే చీమలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. రాతిపొడితో వేస్తే అది తిని చీమలు చనిపోతాయి’ అన్నారు. ఆ చిన్నిప్రాణులపై కూడా అంత కరుణ, దయ.

అద్దం లాంటివి శాస్త్రాలు...
ప్రవర్తనలో మార్పు రానప్పుడు పాండిత్యం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదనేవారు మహర్షి. శాస్త్రాలు మన ఆత్మపరిశీలనకే అని పునరుద్ఘాటించేవారు. ఒక భక్తుడు తనకు శాస్త్రజ్ఞానం లేదని దిగులుచెందగా, మహర్షి ‘పాండిత్యం అద్దం లాంటివి. కేవలం చదవటం వల్ల లాభం లేదు. వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలి. అద్దంలో చూస్తూ ముఖానికి గడ్డం చేసుకుంటామే కానీ అద్దంలో ప్రతిబింబానికి కాదుగా’ అన్నారు. విజ్ఞానం కన్నా విచక్షణ గొప్పదనే సందేశం ఇచ్చారు.


తల్లిపై విశేషప్రేమ...

ఒకసారి మహర్షి తల్లి అలఘమ్మకి ఒంట్లో నలతగా ఉంటే శ్రద్ధగా సేవ చేశారు. ‘సంసార దుఃఖాలను నివారించే అరుణాచలేశ్వరా! నీవే శరణం ప్రభూ! నా తల్లి అనారోగ్యాన్ని కుదిర్చేందుకు నీవు గాక ఇంకెవరున్నారు? కాలకాలుడా! ఆరోగ్యాన్ని అనుగ్రహించి మృత్యువు నుంచి రక్షించు!’ అని ప్రార్థించారు.


- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని