భక్తి జ్ఞాన ప్రభంజనం

ఆయన ధైర్యానికి ప్రతిరూపం, స్థైర్యానికి చిరునామా. వారి మాట ఒకసారి ప్రేమగా అరటిపండు ఒలిచి నోటికి అందించినట్లుంటే ఇంకోసారి అనుసరించమన్న ఆదేశంతో చురకత్తిలా ఉంటుంది. ఆ రూపమెంత ప్రసన్నమో భావమంత ప్రజ్వలితం.

Updated : 06 Jan 2022 06:18 IST

జనవరి 12 వివేకానంద జయంతి

ఆయన ధైర్యానికి ప్రతిరూపం, స్థైర్యానికి చిరునామా. వారి మాట ఒకసారి ప్రేమగా అరటిపండు ఒలిచి నోటికి అందించినట్లుంటే ఇంకోసారి అనుసరించమన్న ఆదేశంతో చురకత్తిలా ఉంటుంది. ఆ రూపమెంత ప్రసన్నమో భావమంత ప్రజ్వలితం. అటు భక్తి ఇటు జ్ఞానం కలబోసుకుని దేశ ఔన్నత్యాన్ని సర్వత్రా ప్రచారం చేసిన విజ్ఞానసార్వభౌముడు వివేకానందుడు.

తన మీద తనకు ఎంత నమ్మకమో పరమాత్మనూ అంతే బలంగా విశ్వసించారు వివేకానంద. బాల్యంలో నాటుకున్న భక్తిబీజాలు రామకృష్ణ పరమహంస సన్నిధికి చేర్చాయి. ఆ పరమ గురువు సన్నిధిలో సహస్రదళ పద్మమై పరిమళించారు. తన ప్రియశిష్యుడి గురించి ‘తొలుత భక్తుడు. తర్వాతే జ్ఞాని’ అన్నారు పరమహంస. వివేకానంద కూడా తన ప్రజ్ఞ పుస్తక జ్ఞానంతో వచ్చింది కాదని, గురువు రూపంలో పరమాత్ముడి భిక్ష అని చెప్పేవారు. ఆయన ప్రబోధం వెనుక లోతైన పారమార్థికత దాగుండేది.

జగన్మాతను ఏమడగాలి?

వివేకానంద యుక్తవయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా చనిపోయారు. కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది. పట్టభద్రుడైనా వివేకానందకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. పెద్దకొడుకైన అతడే ఇంటికి ఆధారం. తన స్థితిని గురువుకు చెప్పగా, దగ్గర్లోనే ఉన్న కాళీ ఆలయాన్ని చూపించి ‘ఇవాళ మంగళవారం, అమ్మవారిని ఏమి కోరినా అనుగ్రహిస్తుంది. వెళ్లి ప్రార్థించు’ అన్నారు. వివేకానంద మందిరానికి వెళ్లి వచ్చాక రామకృష్ణులు ‘అమ్మ ఏమంది?’ అనడిగారు. ‘అరే! అడగటం మరచిపోయానే’ అన్నారు. మరోసారి వెళ్లినా అదే పరిస్థితి. మూడోసారి వెళ్లొచ్చాక వివేకానంద ఎలాంటి అలజడీ లేకుండా ‘జగన్మాతను డబ్బు అడగటమంటే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది! భక్తి, నిస్వార్థ ప్రేమ, అర్థం చేసుకునే శక్తి ఇమ్మని ప్రార్థించాను’ అన్నారు. అమ్మవారి కృప, గురువుగారి ఆశీస్సుల ఫలంగా అప్పటి నుంచి వారి కుటుంబంలో సాధారణ వసతులకు ఎలాంటి లోటు రాలేదు.

సీతారాములపై అమితభక్తి

బాల్యంలో తల్లి నుంచి విన్న సీతారాముల ఆదర్శం, హనుమంతుడి దాస్యభక్తి వివేకానంద హృదయంలో పాదుకున్నాయి. ఆ భక్తితో పదేళ్ల వయసులోనే ప్రతిమ కొని నిత్యం ధ్యానం చేసేవారు. ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడు, సహనశీలి సీతాదేవిల చిత్తరువు ఆయన మదిలో చెరగని ముద్ర వేసింది. అలాంటి ఆదర్శ జీవితం గడపటమే అత్యుత్తమ లక్ష్యమనిపించేది. ఎక్కడ రామాయణ కాలక్షేపం జరిగినా వివేకానంద హాజరు కావలసిందే! కాలాంతరంలో యాదృచ్ఛికంగా గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా రామమంత్రాన్నే ఉపదేశించటం విశేషం. వివేకానంద విదేశాల్లోనూ తన ప్రసంగాల్లో రాముడి నుంచి ఉడుత వరకు ఎన్నో పాత్రలను ఎన్నోసార్లు గుర్తుచేసేవారు. ముఖ్యంగా సీతమ్మను ఎంతగానో ప్రశంసించేవారు.

సంకల్పం... పూజ

వివేకానంద తన గురువు పేరిట కోల్‌కతాలో రామకృష్ణ మఠం స్థాపించారు. అప్పటిదాకా పరమహంస పూజారిగా ఉన్న దక్షిణేశ్వరంలోనే దుర్గాపూజ నిర్వహించేవారు. అప్పుడు వివేకానంద దుర్గాదేవి స్వయంగా పూజలు అందుకుంటున్నట్లు అనుభూతి చెందేవారు. ఆ అనుభవంతో మఠంలోనూ ఆ ఉత్సవం జరపాలనిపించింది. పూజా విధానం తెలుసుకునేందుకు అష్టావింశతి తత్త్వమనే పుస్తకం తెప్పించారు. సంకల్పం లేకుండా ఏ పూజలూ చేయలేం. ‘ఈ ఫలాన్ని పొందడానికి ఈ దైవాన్ని ఆరాధిస్తున్నాను’ అనుకోవడమే సంకల్పం. ఇది కోరికలు, ఫలితాలతో నిమిత్తం లేని సన్యాసులకు వర్తించదు. కనుకనే వివేకానందకు మఠంలో పూజ చేస్తే ఎవరి పేరిట సంకల్పం చేయాలనే ప్రశ్న తలెత్తింది. వెంటనే గురుపత్ని శారదాదేవి స్ఫురించింది. అప్పటికామె సజీవంగానే ఉన్నందువల్ల ఆమె పేరిట సంకల్పించి దుర్గాపూజ ఆరంభించారు. వివేకానంద నిర్దేశించిన తీరులోనే నేటికీ రామకృష్ణ సంఘంలో పూజాదికాలు జరుగుతున్నాయి.

చారిత్రక ప్రసంగ ప్రారంభంలోనూ...

వివేకానంద. చికాగోలోని సర్వమత సమ్మేళనం వేదికపై మౌనముద్రలో కూర్చున్నారు. ఆయన మనసులో ఏ ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయో! ఏ ఉద్వేగ ప్రవాహాలు పొంగిపొరలుతున్నాయో! నిరంతరం తనను సంరక్షిస్తున్న గురుదేవులను గుర్తుచేసుకున్నారా? తనను దాసుడిగా చేసుకున్న కాళికాదేవిని స్మరిస్తున్నారా? తనను విశ్వసించి ఈ లోకానికి పంపిన దివ్యజనని శారదామాతను తలచుకున్నారా? ఏమో ఎవరు చెప్పగలరు? అలా దీర్ఘాలోచనలో ఉన్న స్వామీజీని వేదికపై ప్రసంగించాల్సిందిగా పలుమార్లు పిలిచారు. కానీ స్వామీజీ ‘ఇప్పుడు కాదు తర్వాత’ అంటూ వెనక్కి తగ్గారు. వాయిదా వేస్తూనే వచ్చారు. గంటలు గడచిపోతున్నాయి. ఇక ప్రసంగించరేమో అనుకుని, ఆయనను పట్టించుకోవటం మానేసిన తరుణంలో లేచారు. సరస్వతీదేవిని తలచుకుని ‘అమెరికా దేశపు సోదర సోదరీమణులారా!’ అంటూ సంబోధించారు. తర్వాత ఏం జరిగిందనేది జగమెరిగిన సత్యం.

మూఢ భక్తికి వ్యతిరేకి

వివేకానంద మూఢభక్తికి వ్యతిరేకి. తనమీద తనకు నమ్మకం లేకుంటే పరమాత్మనూ విశ్వసించలేరు, బలహీనులు భక్తులు కాలేరు అన్నారు. ఓ బలహీన యువకుడు ఆయన్ను కలిసి భగవద్గీత చదవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అతడు మానసికంగానూ దుర్బలుడేనని గుర్తించిన వివేకానంద ‘ముందు మైదానానికి వెళ్లి ఫుట్‌బాల్‌ ఆడు! తర్వాత భగవద్గీత చదువు!’ అన్నారు. శారీరక దారుఢ్యం లేనిదే ధర్మగ్రంథాల సారం వంటబట్టదనేది ఆయన భావన. ‘ఓ జగజ్జననీ, ధీరత్వాన్ని ప్రసాదించు. ఓ శక్తిశాలినీ! బలహీనతలను తొలగించు- అంటూ ప్రార్థించండి’ అనేవారాయన.


ఆంజనేయుడి ఆరాధకులు

వివేకానంద హనుమంతుణ్ని ఉపాసించే వారు. సనాతన ధర్మ పరివ్యాప్తి ఉద్యమంలో తనను మారుతితో పోల్చుకున్నారు. దేహబలం, బుద్ధిబలం, ఆత్మబలం- అనే శక్తుల్ని ఉపయోగించి ఆంజనేయుడు సీతాన్వేషణ లక్ష్యాన్ని చేరుకున్నాడు. సంపూర్ణ వ్యక్తిత్వానికి సమగ్ర ప్రతిరూపమైన ఆంజనేయుడు యువతకు ఆదర్శమనేవారు వివేకానంద.


‘ఒకసారి ఎడారిలో దాహం వేసింది. దూరంగా చెరువులు కనిపించాయి. ఆ నీళ్లలో చెట్ల నీడలు కదలాడాయి. అవి ఎండమావులన్న నిజాన్ని ఎప్పటికో గుర్తించగలిగాను. భగవంతుణ్ని తెలుసుకున్నప్పుడు ఎండమావుల్లాంటి ఈ ప్రపంచం భ్రమ అని అర్థమవుతుంది. తాపత్రయాలు తొలగిపోతాయి. పరమాత్ముడే సత్యం, శాశ్వతం అని స్పష్టమవుతుంది’ అనేవారు వివేకానంద.


- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని