వేంకటేశ్వరుని సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనం

ప్రతి నెలా ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అందుకే ఏకాదశిని ‘హరివాసరం’గా కొనియాడతారు. ఇక ధనుర్మాస ఏకాదశి స్వామివారికి మరింత ప్రీతికరం. భక్తజనావళికి శుభప్రదం. రావణుడు పెట్టే బాధలు పడలేక దేవతలు

Updated : 13 Jan 2022 06:06 IST

నేడు వైకుంఠ ఏకాదశి

ప్రతి నెలా ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన రోజు. అందుకే ఏకాదశిని ‘హరివాసరం’గా కొనియాడతారు. ఇక ధనుర్మాస ఏకాదశి స్వామివారికి మరింత ప్రీతికరం. భక్తజనావళికి శుభప్రదం. రావణుడు పెట్టే బాధలు పడలేక దేవతలు చతుర్ముఖ బ్రహ్మను ఆశ్రయించారు. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలంతా వైకుంఠం చేరుకున్నారు. ఆ హరివాసరం దగ్గర దేవతలు తమ విన్నపాలు వినిపించేందుకు వేచి ఉన్నారు. వేదసూక్తాలతో శ్రీహరిని స్తుతించగా లక్ష్మీనాథుని దర్శనభాగ్యం కలిగింది.

కలియుగ వైకుంఠమైన ఏడుకొండలపై శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహిస్తారు. ఆ ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్లు మూసేస్తారు. మరుసటి రోజు తెల్లవారు జామున అంటే వైకుంఠ ఏకాదశి సుప్రభాతం మొదలుకొని ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులూ శ్రీహరి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు. ఈ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమనీ, ఆ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణమనీ పిలుస్తారు. తిరుమల కొండలపై అర్చనలు అందుకుంటున్న శ్రీనివాసుడికి కూడా ధనుర్మాసంలో శుద్ధఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతుంది. ఆ పర్వదినాన ప్రాతఃకాల ఆరాధన పూర్తయిన అనంతరం, శ్రీమలయప్ప స్వామివారు కల్యాణమండపంలో వజ్రకవచాది విశేష తిరువాభరణాలు ధరించి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. శ్రీవారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. మహానైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ప్రసాద వినియోగం జరుగుతుంది. అనంతరం శ్రీనివాసుడు సమస్తపరివారంతో మంగళవాద్యాలతో తిరువీధుల్లో ఉత్సవం జరుపుకొని కల్యాణమండపానికి వేంచేస్తారు. ఈ రోజున సూర్యోదయ వేళకే వైకుంఠ ద్వారం తెరుస్తారు.  

- ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని