సత్యదర్శనానికి మార్గమేది?

లోకంలో అందరికీ సుఖసౌఖ్యాలతో జీవించాలనే ఉంటుంది. అందుకోసం స్థలాలూ పొలాలూ, ఇళ్లూ వాహనాలూ సంపాదిస్తారు. అయినా వాటితో తృప్తి కలగడంలేదు. మరి అసలైన సుఖశాంతులు ఎందులో ఉన్నాయి, ఎలా పొందాలి?సత్యదర్శనం కానిదే అసలైన సుఖాన్ని, హాయిని అనుభవించడం అసాధ్యం. దాన్నే మోక్షం, ఆత్మ సాక్షాత్కారం అంటారు.

Updated : 27 Jan 2022 03:26 IST

లోకంలో అందరికీ సుఖసౌఖ్యాలతో జీవించాలనే ఉంటుంది. అందుకోసం స్థలాలూ పొలాలూ, ఇళ్లూ వాహనాలూ సంపాదిస్తారు. అయినా వాటితో తృప్తి కలగడంలేదు. మరి అసలైన సుఖశాంతులు ఎందులో ఉన్నాయి, ఎలా పొందాలి?

త్యదర్శనం కానిదే అసలైన సుఖాన్ని, హాయిని అనుభవించడం అసాధ్యం. దాన్నే మోక్షం, ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఎందరో జిజ్ఞాసులు, మహర్షులు సత్యాన్ని దర్శించేందుకు సాధన చేసినా, కొందరికే ఎందుకు సాధ్యమైంది? తక్కినవారికి ఎందుకు కాలేదు? పోనీ వాళ్లేం దర్శించారు? ఆ అనుభవంతో ఏం చెప్పారు- అని నిశితంగా పరిశీలిస్తే అసలు సంగతి అవగతమవుతుంది. కానీ ఆ దిశగా ఆలోచించకుండా వారి తత్వాన్ని వదిలేసి రూపాన్ని ఆరాధిస్తున్నాం. అందువల్లే తత్వం తగ్గింది, తతంగం పెరిగింది.

గౌతమ బుద్ధుడు జ్ఞానోదయానికి ముందు లోకంలో దుఃఖాలను చూసి చలించిపోయాడు. కారణం తెలుసుకోవాలని ఇల్లు వదిలి వెళ్లాడు. గయలోని రావిచెట్టుకింద కోరికలే దుఃఖానికి మూలమని జ్ఞానోదయమయ్యాక ఇక బాధలకు చలించకుండా స్థిమితంగా ఉండిపోయాడు. నమ్మకం, ఓపిక ఉంటేనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యమన్నది షిర్డి సాయిబాబా బోధ. ఏ సాధనా లేకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన రమణ మహర్షి, సద్గురు సుబ్రహ్మణ్యం, యు.జి.కృష్ణమూర్తి తదితర మహాత్ములూ ఉన్నారు.

నేనెవరిని? అనే ప్రశ్నలో ‘నేను’ పుట్టుక స్థానం తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారమని రమణ భగవాన్‌ ఉద్బోధించారు. దైవం కంటే భిన్నంగా ఏదీ లేదు. నేనూ దైవమేనన్న అనుభవమే మోక్షమన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం. యూజీ దృష్టిలో తత్వం అంటే వివేకం మీద ప్రేమా కాదు, భ్రాంతి నుంచి దూరమవడమూ కాదు, తత్వశాస్త్రానికి సంబంధించిన అన్ని ప్రశ్నలూ మటుమాయం అవడమేనంటారు.

‘మహర్షులు సాధనచేసి జ్ఞానాన్ని సంపాదించారు. సాధన చేయలేదు కనుక మనకు అలాంటి జ్ఞానం కలగలేదు’ అనుకుంటున్నాం. నిజానికి సాధన చేసినంతలో ఆత్మసాక్షాత్కారం కలగదు. సాధన పరిణామం ఏమంటే, దేవుణ్ణి చూడాలనే కాంక్షతో మొదలై, చూసేదంతా దేవుడే అని ముగుస్తుంది. అందువల్ల సత్యదర్శనానికి సాధన అవసరంలేదు. దానికి కేవలం ఎరుకతో కూడిన జ్ఞప్తిని కలిగి ఉంటే చాలు.

ఈ సకల చరాచర సృష్టికీ కారణభూతుడు దేవుడని తెలిసినా, ఆ సంగతి మరచిపోయి సుఖదుఃఖాలన్నింటికీ మనమే కారణమని భ్రమపడుతున్నాం. లోకంలో దేనికీ మనం కర్తలు కామని, సర్వం చేయించేది భగవంతుడేనని సదా జ్ఞప్తి ఉంచుకోవడమే ఎరుక.

శ్రీకృష్ణుని విశ్వరూపం అనేది ఎప్పుడూ ఉంది. దానిని ఒకసారి చూపడంగానీ, ఉపసంహరించుకోవడంగానీ ఉండదు. అర్జునుడు విశ్వరూపాన్ని చూడగలిగే దృష్టిని పొందినప్పుడు దర్శించాడు. విశ్వరూపం అనేది ఎప్పుడూ ఉంది. చూడాల్సింది, ఉపసంహరించుకోవాల్సింది మనమే. కనుక సత్యదర్శనానికి మనం ఎలాంటి సాధన చేయనవసరంలేదు. ఎరుక ఉంటే చాలు. దాని వల్లే మహర్షులు స్థిమితంగా ఉండిపోయారు. మరి మనకు ఆ ఎరుక ఉన్నట్లు ఎలా తెలుస్తుందంటే... స్థిమితమే దానికి ప్రమాణం. ఎప్పుడైతే ఆ జ్ఞప్తిని కలిగి ఉంటామో లోకంలో సుఖదుఃఖాలేవీ మనసుకు అంటవు. అన్నింటినీ సమదృష్టితో చూడగలుగుతాం. ‘లోకంలో దేనికది సహజంగా, సంపూర్ణంగా ఉంది’ అని అర్థం చేసుకుని, ఎరుకతో ఉండటమే సత్యదర్శనానికి అసలైన మార్గం.

- దేవీప్రసాద్‌ ఒబ్బు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని