సమతామూర్తి.. సమున్నతస్ఫూర్తి

అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు. దీనుల కోసం పరితపించిన విశాలహృదయుడు. సిద్ధాంతదశలో ఉన్న వైష్ణవతత్త్వాన్ని, సామాన్యులతోనూ ఆచరింపచేసిన ఆచార్యుడు రామానుజాచార్యులు.

Updated : 27 May 2022 17:19 IST

(ఫిబ్రవరి 2, రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు శ్రీకారం)

అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త. భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు. దీనుల కోసం పరితపించిన విశాలహృదయుడు. సిద్ధాంతదశలో ఉన్న వైష్ణవతత్త్వాన్ని, సామాన్యులతోనూ ఆచరింపచేసిన ఆచార్యుడు రామానుజాచార్యులు.

మిళనాడులోని శ్రీపెరంబుదూరులో జన్మించిన రామానుజాచార్యులు అక్షరాభ్యాసమైన కొన్నాళ్లకే వేదవేదాంగాలు అభ్యసించారు. శ్రీవేంకటేశ్వరుడి పరమభక్తుడు తిరుమల నంబి రామానుజాచార్యులకు మేనమామ. విశిష్టాద్వైతాన్ని, ఆళ్వారుల వైభవాన్ని, భక్తిమార్గాలను మేనల్లుడికి పరిచయం చేసింది వారే! భక్తి, పాండిత్యం, సంస్కరణ తత్వం కలిగిన తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు. అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు. మతం పేరుతో జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేసేవారు.


గురువును మించిన శిష్యుడు

సిడికి పరిమళం అబ్బినట్లు రామానుజుల పాండిత్యానికి, వినయం తోడవటంతో ఉత్తమ శిష్యుడిగా రాణించారు. ఆత్మప్రబోధంతో కొన్నిసార్లు గురువులకు కూడా కనువిప్పు కలిగించారు. ఒకసారి ఆయన గురువు గోష్ఠిపూర్ణ ‘ఓమ్‌ నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి, ‘దీన్ని గోప్యంగా ఉంచాలి! ఎన్నడూ, ఎవరికీ చెప్పకు’ అన్నారు. కానీ ఆ మహామంత్ర జపంతో లభించే ఆధ్యాత్మిక ఫలం కొద్దిమందికే పరిమితం కాకూడదు అనుకున్నారు రామానుజులు. మర్నాడు స్థానికులందరినీ సౌమ్యనారాయణ ఆలయం వద్దకు ఆహ్వానించి, అష్టాక్షరీ మంత్రాన్ని వినిపించారు. గురువు ఉపదేశించిన విజ్ఞానాన్ని దాపరికం లేకుండా ప్రకటించారు. అందుకు గోష్ఠిపూర్ణులు ఆగ్రహించి, ఫలితంగా నరకానికి వెళతావంటూ మందలించారు. దానికి రామానుజులు ‘గురువర్యా! ఇదిగో, ఇంతమంది ఆధ్యాత్మికోన్నతి సాధించారు. నేనిక నరకానికి వెళ్లినా చింతలేదు’ అన్నారు వినయంగా. గురువు పశ్చాత్తాపంతో రామానుజులను ఆలింగనం చేసుకుని, ‘నువ్వు నాకు శిష్యుడివి కాదు, గురువువి!’ అన్నారు.


సంస్కరణలకు శ్రీకారం

మాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని రామానుజులు ఆకాంక్షించారు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు. అలాగే తిరుమల ఆనందనిలయంలో వైఖానస ఆగమం ప్రకారం ఆచార వ్యవహారాలు, పూజాదికాలు రూపొందించింది కూడా రామానుజాచార్యులే! వారు నిర్దేశించిన ప్రకారమే శ్రీవారి ఉపచారాలు, ఉత్సవాలు నేటికీ నిర్వహిస్తున్నారు.


భక్తిఉద్యమాలపై భాగవతోత్తముడి ప్రభావం

దేశంలో అంకురించిన ఎన్నో భక్తిఉద్యమాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగవతోత్తముడైన రామానుజాచార్యుల ప్రభావం కనిపిస్తుంది. భగవంతుడి తత్త్వాన్ని తనదైన శైలిలో వర్ణిస్తూ విశ్వమంతా వ్యాప్తిచేశారు. సమత్వం, సోదరభావం లేకుండా ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం కాదన్నారు. ‘తప్పులు చేయని వారుండరు, ఇతరుల దోషాలను ఎత్తిచూపే అధికారం ఎవరికీ లేదు. అందరినీ ప్రేమిస్తేనే పరమాత్మని ప్రేమించినట్లు’ అంటూ భక్తులను మేల్కొలిపారు.


పదకవితాపితామహుడి పరమగురువు

శ్రీనివాసుడి పరమభక్తుడు, పదకవితాపితామహుడు అయిన అన్నమయ్య తిరుమలలో ఘనముని అనే గురువు వద్ద వైష్ణవమతాన్ని స్వీకరించారు. కానీ వైష్ణవమత ప్రచారకర్త, విశిష్టాద్వైత సిద్ధాంతవేత్త అయిన రామానుజాచార్యులనే పరమగురువుగా భావించారు. ప్రత్యక్షంగా చూడకపోయినా, ఆయన బోధనలనే అనుసరించారు. రామానుజులపై కీర్తనలు కూడా రచించారు. ‘గురుకృప వల్లనే వేద రహస్యాలు తెలుసుకోగలిగాను. అహంకారాన్ని పోగొట్టి శరణాగత తత్త్వాన్ని అలవరచారు’ అంటూ ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును... గతి ఈతడే చూపె ఘన గురు దైవము’ అంటూ సంకీర్తించారు. కలియుగంలో ఆధ్యాత్మికోన్నతికి మార్గాలన్నీ నశించి, అగమ్యగోచరమైన దుస్థితిలో ఘన గురుదైవం రూపంలో రామానుజాచార్యులు నిలిచారని, సక్రమ మార్గాన్ని చూపారని తలచుకున్నారు. తాళ్లపాక అన్నమయ్య కుమారుడు పెదతిరుమలాచార్య కూడా రామానుజాచార్యులపై భక్తిప్రపత్తులతో కీర్తనలు రచించారు. అందులో ‘ఉన్నతోన్నతుడు ఉడయవరు’ అన్న కీర్తన ప్రసిద్ధమైంది. ‘ఉడయవరు’ అంటే ఇహపరాలను సాధించినవాడని భావం.


విశేషంగా గౌరవించిన వివేకానంద

స్వామి వివేకానంద తరచుగా రామానుజాచార్యులను గుర్తుచేసుకుంటూ తన అభిమానాన్ని చాటుకునేవారు. మతాన్ని సామాన్యుల వద్దకు తీసుకువెళ్లిన పరమగురువని ప్రశంసించేవారు. ఓ ప్రసంగంలో ‘రామానుజులు దీనజనులపై ఎనలేని సానుభూతిని ప్రదర్శించారు. అస్పృశ్యులు, పతితులంటూ సమాజం వెలివేసిన వారి కోసం ఆధ్యాత్మిక ధామానికి ద్వారాలను తెరిపించారు. ఆ తర్వాత వచ్చిన ఆచార్యులందరికీ రామానుజులు మార్గదర్శకులుగా నిలిచారు’ అన్నారు.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని