రాజులక్షణం

మూలికల సేకరణకు వెళ్లిన సాయిని అడవిదొంగలు పట్టుకుని తమ నాయకుడి ముందుంచారు. జోలెలో ఏముందని అడిగాడు రాణా. విలువైందే ఉందన్నాడు సాయి. అదేమిటో చూపమంటే, ‘నేను చూపినా చూడలేవు’ అన్నాడు సాయి.

Updated : 27 May 2022 17:24 IST

మూలికల సేకరణకు వెళ్లిన సాయిని అడవిదొంగలు పట్టుకుని తమ నాయకుడి ముందుంచారు. జోలెలో ఏముందని అడిగాడు రాణా. విలువైందే ఉందన్నాడు సాయి. అదేమిటో చూపమంటే, ‘నేను చూపినా చూడలేవు’ అన్నాడు సాయి. ‘ఈ ప్రాంతానికి రాజునైన నాకే ఎదురు చెప్తావా?’ అన్నాడతడు. ‘అసలైన రాజు వేరే ఉన్నాడు. కళ్లు మూసుకుని చూడు’ అని సాయి చెప్పడంతో ‘అలాగే చూస్తాను. కానీ అతడు కనిపించకపోతే నీ మెడ కోసేస్తా’ అంటూ రాణా కళ్లు మూసుకొని సాయి చెప్పిన రాజును చూసేందుకు ప్రయత్నించాడు. అతడికి చెట్లు, వన్యమృగాలు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ మాటే సాయికి చెప్పి సాయి మెడ మీద గొడ్డలి పెట్టాడు. సాయి నవ్వుతూ ‘నీ అనుచరులు నలుగురే! కానీ అడవితల్లి అనుచరులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావుగా! రాజు బలం ప్రజలే. ఈ ప్రకృతిమాత నీలాగా పన్నులు వేయదు. ప్రజలను బాధపెట్టకపోగా వారి గాయాలను తన వనస్పతులతో నయం చేస్తుంది. భూమికి వర్షాన్ని తెచ్చి మనకి హర్షం కలిగిస్తుంది. బాధిత కుటుంబాల ఉసురు నీకు తగులుతుందే తప్ప అడవితల్లికి కాదు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలేమీ లేని ప్రకృతి మాతే అసలైన రాజు. ఆమె తనవారి కోసం ప్రాణాలను సైతం అర్పిస్తోంది. నువ్వు ప్రజల ప్రాణాలు తీసి సొమ్ము చేసుకుంటున్నావు. నిజమైన రాజు ప్రజలను క్షోభకు గురిచేసి శిక్షించడు. కానీ నువ్వు మొదటి నుంచీ చేస్తున్నదదే’ అనడంతో రాణాకు జ్ఞానోదయమైంది.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని