ప్రేమ... జీవనవేదం

జయదేవుడికి భార్య పద్మావతి అంటే అనంత ప్రేమ. ఆమెకీ అంతే. అది తెలిసిన రాజుకు వారి ప్రేమను పరీక్షించాలనిపించింది. ఒకరోజు జయదేవుణ్ణి వెంటబెట్టుకుని వేటకు వెళ్లాడు. అక్కడి నుంచి ‘నీ భర్తను క్రూరమృగం బలిగొంది’ అంటూ పద్మావతికి కబురు పంపాడు.

Published : 10 Feb 2022 00:12 IST

జయదేవుడికి భార్య పద్మావతి అంటే అనంత ప్రేమ. ఆమెకీ అంతే. అది తెలిసిన రాజుకు వారి ప్రేమను పరీక్షించాలనిపించింది. ఒకరోజు జయదేవుణ్ణి వెంటబెట్టుకుని వేటకు వెళ్లాడు. అక్కడి నుంచి ‘నీ భర్తను క్రూరమృగం బలిగొంది’ అంటూ పద్మావతికి కబురు పంపాడు. ఆ వార్త వింటూనే పద్మావతి ప్రాణం వదిలేసింది. సరదాగా చేసిన పని అంత విపత్తుకు కారణమవడంతో రాజు ఖిన్నుడైపోయాడు. జయదేవుడు అధైర్యపడలేదు.... ఇష్టదైవం శ్రీకృష్ణున్ని ప్రార్థించి భార్యను బతికించుకున్నాడు. అనిర్వచనీయ ప్రేమకు ఉదాహరణగా ఈ కథను చెబుతుంటారు.

ప్రేమంటే శారీరక ఆకర్షణలకి అతీతమైన ఎల్లలు లేని ఇష్టం. ఇందులో ఎటువంటి మినహాయింపులు, కొరతలు ఉండవు. తప్పొప్పుల ప్రసక్తి ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉన్నవారిని ఉన్నట్టు ఇష్టపడటం. ఇది పిల్లల పట్ల ఉంటే వాత్సల్యం, పెద్దల పట్ల ఉంటే భక్తి, గౌరవం, సమానుల మధ్య ఉంటే స్నేహం. ఇక స్త్రీపురుషుల మధ్య ఉంటే ప్రేమ. అది సాధారణంగా పెళ్లిగా పరిణమిస్తుంది. ప్రేమ వివాహాలు ఆధునికం ఏమీ కాదు. అనాదిగా ఉన్నవే. నిజమైన, నిష్కల్మషమైన, భౌతిక ఆకర్షణలకి అతీతమైన ప్రేమతో జరిగాయి. అయితే పెళ్లికి ముందు విహారాలు, పెద్దల కన్నుగప్పటం లేదు.

దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి శివుణ్ణి ఇష్టపడింది. తనకు ఇష్టంలేకున్నా తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సతీదేవి యోగాగ్నిలో శరీరం వదిలితే శివుడు దానికి కారణమైన దక్ష యజ్ఞాన్ని ధ్వంసంచేశాడు. సతీదేవే పార్వతిగా జన్మించి మళ్లీ శివుడే తనభర్త కావాలని తపస్సు చేసి మరీ పొందింది. శివుడు కూడా తపస్సు చేశాడు. పెళ్లి చేసుకుని సగం శరీరం ఇచ్చాడు. క్షీరసాగరమథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి అక్కడున్న దేవతలందరినీ కాదని విష్ణువుని వరించింది. ఆయన గుండెల్లో పదిలపరచుకున్నాడు. సావిత్రి తనకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకుంది, తండ్రి అనుమతితో.

శకుంతలాదుష్యంతులది గాంధర్వవివాహం. అంటే, పెద్దలకి చెప్పకుండా చేసుకున్న పెళ్లి. పెంచిన తండ్రి కణ్వుడు తప్పు పట్టలేదు. పైగా వరమిచ్చాడు. శకుంతల కొడుకుకి యుక్తవయసు వచ్చాక భర్త దగ్గరికి వెళ్లటం ధర్మమని శిష్యులని తోడిచ్చి పంపాడు. తాను వెళ్లలేదు, స్వతంత్రించి చేసుకున్న శకుంతలే పరిస్థితిని ఎదుర్కోవాలని. దుష్యంతుడి సభలో శకుంతలకు జరిగింది మామూలు అవమానం కాదు. అయినా ఎదుర్కొంది, నిలదొక్కుకుంది, సాధించింది. పట్టమహిషి స్థానాన్ని ఇచ్చాడతడు. అంతటి తెలివి, పాండిత్యం, ధైర్యం, సమర్థత, నిజాయితీ ఉంటేనే గాంధర్వ వివాహం సఫలమౌతుంది.

రుక్మిణి కృష్ణుడి గుణగణాలను విని వలచింది. అందులో భక్తి కూడా సమ్మిళితమై ఉంది. పరిస్థితి చేయి జారి పోతోందని గుర్తించగానే లేఖతో ప్రేమను తెలియజేసి, తనను చేపట్టడానికి మార్గమూ సూచించింది. రాక్షసవివాహం క్షత్రియులకి తగినదేనని ధైర్యాన్నిచ్చింది. రుక్మిణి సద్గుణాలను విని ఆమె కోసం పలవరిస్తున్న కృష్ణుడు, ఆ మాట మన్నించాడు. పట్టమహిషి స్థానాన్నిచ్చి గౌరవించాడు. ఇద్దరూ అప్పటి వరకు ఒకరినొకరు చూడలేదు. వారిది గుణాల పట్ల ఆకర్షణ మాత్రమే, ఒకే ఆత్మ రెండు శరీరాల్లో ఉన్నట్టు.

సుభద్ర సోదరుడి సహాయంతో తనకు నచ్చిన మేనత్త కుమారుడు అర్జునుణ్ణి రహస్యంగా పెళ్లి చేసుకుంది. చుట్టరికమే కనుక, తర్వాత పెద్దలు అంగీకరించారు. తన కాబోయే భార్య ప్రమద్వర పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్న రురుడు పాములే లేకుండా చేయాలనుకున్నాడు. అతడి ప్రేమ తీవ్రతకి ముచ్చట పడిన ఓ దేవత ప్రమద్వరని బతికించింది.
నలదమయంతుల ప్రేమ కావ్యత్వాన్ని పొందింది. వాళ్లు ఒకరి గుణగణాల గురించి ఒకరు విని ఆకర్షితులయ్యారు. అది హంస దౌత్యంతో ప్రేమగా పరిణమించి పెళ్లిగా ఫలించింది. కలిపురుషుడి ప్రభావంతో విడిపోయినా తిరిగి కలుసుకున్నారు.

ఈ ప్రేమలు జీవనపర్యంతం.. జీవితానంతరం కూడా కొనసాగాయి, పెళ్లిగా పరిణమించాయి. మన పెద్దవాళ్లు పెళ్లిని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంగా పరిగణించలేదు. అది రెండు కుటుంబాలను కలుపుతుంది. ఒకరికొకరు వెన్ను దన్నుగా నిలిస్తే ఆ బంధం పటిష్ఠంగా ఉంటుంది. అభిప్రాయ భేదాలు, సమస్యలు వస్తే పెద్దలు పరిష్కరిస్తారు కనుక అవి తీవ్ర స్థాయికి వెళ్లవు. సంసారం సవ్యంగా సాగిపోతుంది. ప్రేమ మరింత గాఢమవుతుంది. వివాహాన్ని ఒక సంస్కారంగా, క్రతువుగా, పవిత్రబంధంగా భావిస్తారు.

స్త్రీకి నచ్చకపోతే కాదనే అధికారం పూర్వం నుంచీ ఉండేది. బలవంతంగా ఒప్పించేవారు కాదు. అంబ.. తానూ సాళ్వుడూ పరస్పరం ఇష్టపడ్డామని చెప్పగానే భీష్ముడు ఆ ప్రేమను సమ్మతించి, ఆమెను పంపించేశాడు. తాను సూతుణ్ణి వరించనని ద్రౌపది స్వయంవరంలో చెప్పింది. దానికి అందరూ ఆమోదించారు.

పెళ్లి అంటే ప్రేమకి భరతవాక్యం అనే వ్యంగ్యోక్తులు వినపడుతున్నాయి. నిజానికి పెళ్లితో ప్రేమ మరింత బలపడుతుంది. ఇరు కుటుంబాలూ ఏకమై ఆత్మీయతలూ అనురాగాలూ విస్తరించి జీవనలత పూలవనంలా గుబాళిస్తుంది.

- డాక్టర్‌ అనంతలక్ష్మి, ఆధ్యాత్మికవేత్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు