ఉల్లిపాయ - గత జన్మలు

‘ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అది ఆరోగ్యపరంగా మాత్రమే’ అనేవారు రమణులవారు. ఆయన తల్లి అళగమ్మ భోజనంలో ఉల్లిపాయ తినేది కాదు. ఓ శిష్యుడు ‘భక్తిమార్గంలో ఉల్లిపాయ ఎందుకు నిషిద్ధమ’ని అడిగాడు.

Published : 10 Feb 2022 00:12 IST

‘ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అది ఆరోగ్యపరంగా మాత్రమే’ అనేవారు రమణులవారు. ఆయన తల్లి అళగమ్మ భోజనంలో ఉల్లిపాయ తినేది కాదు. ఓ శిష్యుడు ‘భక్తిమార్గంలో ఉల్లిపాయ ఎందుకు నిషిద్ధమ’ని అడిగాడు. దానికి రమణులు ‘అది ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు తగిలే పర్వతం కనుక’ అన్నారు. ‘చేతిలో ఇమిడిపోయేది పర్వతమెలా అవుతుంది?’ అశ్చర్యపోయాడు శిష్యుడు. రమణులు ఒక ఉల్లిపాయను అతనికిచ్చి అందులో ఎన్ని పొరలున్నాయో లెక్కపెట్టమన్నారు. తెల్లబోవడం శిష్యుడి వంతైంది. ‘చూశావా ఉల్లి ఘనత!’ అన్నారాయన నవ్వుతూ. ‘అర్థం కాలేదు స్వామీ’ అన్నాడతడు. ‘ఉల్లిపాయలోని పొరలు మన జన్మలోని బంధాలకు సూచిక. ఒక బంధం మరో బంధానికి దారితీస్తుంటుంది. ఇలా బంధాలు పెరుగుతూ పోతే వాటి నుంచి విముక్తి పొందడం కష్టం. ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి పొరా అడ్డుగోడ లాంటిదే. ఉల్లిలోని శీలనం అనే పదార్థం బంధాలను పెంచే లైంగిక ఉత్ప్రేరకం కనుక యోగమార్గంలో వెళ్లాలనుకునేవారు ఉల్లి జోలికి పోకూడదు. ఉల్లి పొరలు భక్తి మార్గపు అవరోధాలే కాదు, అవి కోరికలకు ఆజ్యం పోసి బంధాలను మరింత గట్టిపరిచి మనల్ని బంధించి ముందుకు సాగకుండా నిరోధిస్తాయి. అందుకే దాన్ని పర్వతంతో పోల్చాను’ అంటూ వివరించారు.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని