కాకులు వాలని కోటప్ప క్షేత్రం

గుంటూరు జిల్లా నరసరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. స్థల పురాణాన్ని అనుసరించి.. ఓ గొల్లభామ ప్రతిరోజూ శివుడికి ప్రసాదంగా అన్నం పెరుగు తీసుకెళ్లేది. ఒకరోజు ఎప్పట్లాగే చల్లకుండ తీసుకొని

Published : 10 Feb 2022 00:12 IST

గుంటూరు జిల్లా నరసరావుపేటకి దగ్గరలో ఉన్న కోటప్పకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. స్థల పురాణాన్ని అనుసరించి.. ఓ గొల్లభామ ప్రతిరోజూ శివుడికి ప్రసాదంగా అన్నం పెరుగు తీసుకెళ్లేది. ఒకరోజు ఎప్పట్లాగే చల్లకుండ తీసుకొని వెళ్తుంటే కాకులు మూకుమ్మడిగా రావడంతో ఆమె కంగారుపడింది. కుండ కాస్తా పగిలిపోవడంతో ‘అయ్యో నా స్వామి ప్రసాదాన్ని ఈ కాకులు నేలపాలు చేశాయి’ అంటూ గొల్లభామ బాధపడింది. అప్పుడు పరమశివుడు వృద్ధ బ్రాహ్మడిగా వచ్చి ఇకపై ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదంటూ ఆమెకు అభయమిచ్చాడు. ఇప్పటికీ కొండ కింది భాగంలో కాకులుంటాయి గానీ కొండమీద ఒక్క కాకి కూడా కనిపించదు.

మరో కథనాన్ని అనుసరించి కోటప్ప కొండకు దగ్గరలో ఉన్న కొండకావురు గ్రామంలో సుందుడనే యాదవుడికి ఆనందవల్లి (గొల్లభామ) అనే అందమైన అమ్మాయి పుట్టింది. ఆమె శివ భక్తురాలు. రోజూ కొండ ఎక్కి పూజలు చేసేది. చివరికి వైరాగ్య భావన కలిగి భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు జంగమదేవరగా దర్శనమిచ్చి జీవితంపై ఆశ కలిగేలా ఆశీర్వదించాడు. ‘రోజూ కొండ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నావు.. నేనే నీ ఇంటికి వస్తాను. నీ వెంట వస్తాను. నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు’ అన్నాడు. అలాగేనని ఇంటిబాట పట్టింది. కానీ కొన్ని మెట్లు దిగాక అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసింది. ఆమె వెనుతిరిగిన క్షణం శివుడు గుహలోకి వెళ్లిపోయి లింగరూపుడయ్యాడు. ఆమె దేవునిలో ఐక్యమయ్యింది. గుడి దగ్గరలో కట్టిన గొల్లభామ ఆలయం ఇప్పటికీ ఉంది.

- జూపూడి శ్రీలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని