మనసు పెట్టే పరుగులు

సంఘరక్షితుడు అనే వ్యక్తి, తన మేనల్లుడితో కలిసి బుద్ధుని ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒకసారి మేనల్లుడికి ఓ పెద్దాయన రెండు వస్త్రాలు బహూకరించాడు. వాటిలో ఒకటి మేనమామకు ఇవ్వబోతే ఆయన వద్దన్నాడు.

Published : 10 Feb 2022 00:38 IST

సంఘరక్షితుడు అనే వ్యక్తి, తన మేనల్లుడితో కలిసి బుద్ధుని ఆశ్రమంలో ఉంటున్నాడు. ఒకసారి మేనల్లుడికి ఓ పెద్దాయన రెండు వస్త్రాలు బహూకరించాడు. వాటిలో ఒకటి మేనమామకు ఇవ్వబోతే ఆయన వద్దన్నాడు. అతనికది అవమానంగా తోచింది. ‘నేను ఇస్తే కాదంటాడా? మామకు శాస్తి చేస్తాను. ఈ రెండు వస్త్రాలతో రెండు మేకలు కొంటాను. అవి విస్తరించి పెద్ద మేకల మంద అవుతుంది. అప్పుడు పెళ్లి చేసుకుంటాను. భార్యాబిడ్డలతో మామను చూడటానికి వెళ్తాను. నా భార్య చేతిలో ఉన్న బిడ్డ కింద పడతాడు. నేను కోపంపట్టలేక భార్యను కొడతాను. అప్పుడు మామ అడ్డు వస్తాడు. నాకు మరింత కోపం వచ్చి..’ అనుకుంటూ చేతిలో ఉన్న వస్త్రాన్ని కోపంగా విసిరాడు. అది మేమామకు తగలడంతో బాధపడ్డాడాయన. ఆ వైఖరి చూసి తోటివారు యువకుణ్ణి బుద్ధుని వద్దకు తీసికెళ్లారు.

‘మనసు వింతైనది. ఒకసారి సంకల్పిస్తుంది, మరోసారి వికల్పిస్తుంది. భవిష్యత్తుకి పరుగులు పెట్టి గాలిమేడలు కడుతుంది. లేదా గతానికి వెళ్లి జరిగిపోయిన వాటిని నెమరేస్తుంది. ఈ ఆలోచనలతోనే మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. ఆ స్థితిలో ఏం చేస్తున్నామో తెలియదు. మనసు కదలికలను కనిపెడుతూ దాన్ని వర్తమానంలోనే ఉంచితే రాగద్వేషాలు నశిస్తాయి. అప్పుడు మనసు గతానికి గానీ భవిష్యత్తుకి గానీ పరుగులు పెట్టదని గ్రహించు’ అన్నాడు.

సిగ్గుపడ్డ మేనల్లుడు వినయంగా తల పంకించాడు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని