వందే జగద్గురుమ్‌

తలచినంతనే వశమయ్యే భక్తవత్సలుడు అడిగినంతలో కరుణించే దయామయుడు నిర్గుణుడు నిర్వికారుడు ఆర్తజనరక్షకుడు అసురులకూ వరాలిచ్చే భోళాశంకరుడు సత్యస్వరూపుడు ఆనందతాండవుడు ఆలిని తనలో ఇముడ్చుకున్న అర్ధనారీశ్వరుడు

Published : 24 Feb 2022 00:25 IST

మార్చి 1 మహా శివరాత్రి

తలచినంతనే వశమయ్యే భక్తవత్సలుడు అడిగినంతలో కరుణించే దయామయుడు నిర్గుణుడు నిర్వికారుడు ఆర్తజనరక్షకుడు అసురులకూ వరాలిచ్చే భోళాశంకరుడు సత్యస్వరూపుడు ఆనందతాండవుడు ఆలిని తనలో ఇముడ్చుకున్న అర్ధనారీశ్వరుడు

దేశమంతటా జరుపుకునే పర్వదినం మహాశివరాత్రి. అన్ని పండుగలూ పగటితో ముగిస్తే ఇది రాత్రి కూడా కొనసాగుతుంది. అందుకే పండుగ పేరులోనూ రాత్రి ఉంది. మాఘమాస బహుళ చతుర్దశి శివరాత్రి. చతుర్దశి అర్ధరాత్రి లోపు ముగిసి అమావాస్య ప్రవేశిస్తే ముందురోజే శివరాత్రి జరుపుకోవాలన్నది నియమం.

బ్రహ్మ, విష్ణువులకు మహేశ్వరుడు ‘శివతత్త్వం’ ఉపదేశించిన సమయమే శివరాత్రి. నిరాకారుడైన ఈశ్వరుడు తనకు తానే రూపాన్ని సృష్టించుకున్నాడు. అదే లింగరూపం. లింగమంటే చిహ్నం, మంగళం, కల్యాణం, శ్రేయస్సు అనే అర్థాలున్నాయి. సమస్త జగత్తు దేనిలో లీనమై ఉందో అదే శివలింగం.

‘శివ’ అంటే పరమేశ్వరుడు. ‘శివా’ అంటే పార్వతి. ఇలా అయ్యవారిలో అమ్మవారు ఇమిడి ఉన్నారు. అంబికతో కలిసి సాంబశివుడై దర్శనమిస్తాడు. ఈ విశ్వం పంచభూతాత్మకమయం. మహా శివుడు విశ్వమంతటా తానే వ్యాప్తమై ఉన్నాడనేందుకు నిదర్శనంగా కంచిలో పృథ్విలింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, శ్రీకాళహస్తిలో వాయు లింగం, చిదంబరంలో ఆకాశ లింగమై దర్శనం ఇస్తున్నాడు. లింగార్చనతో సర్వపాపాలూ హరించి సకల భోగాలూ ప్రాప్తిస్తాయట.

మోక్షప్రదాత

దేవతాగణం శక్తి, యుక్తి, బలం, విద్య, ధనం మొదలైనవన్నీ ఇవ్వ గలదు. కానీ లయకర్త అయిన మహేశ్వరుడు మాత్రమే మోక్షం ప్రసాదించగలడు. అందుకే మహా శివరాత్రి నాడు నిద్ర మాని జాగరణ చేస్తూ ‘మనసును ఆవరించిన అవిద్య, అజ్ఞానం, అహంకారాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించమంటారు.

శివరాత్ర మహోరాత్రం నిరాహారో జితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం యథాబలమవంచకః
యత్ఫలం మహాపూజయాం వర్షమేక నిరంతరం
తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చనాత్‌

శివరాత్రినాడు ఉపవాసదీక్షతో ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ భక్తిశ్రద్ధలతో లింగాన్ని పూజిస్తే ఏడాదిపాటు పరమేశ్వరుణ్ణి పూజించినంత ఫలితం ప్రాప్తిస్తుంది. భక్తవశంకరుడైన శివుడు భక్తుల కష్టాలను తీరుస్తాడంటూ పురాణేతిహాసాల్లో కథనాలున్నాయి. భక్త కన్నప్ప నేత్రాలు అర్పించి శివసాయుజ్యం పొందాడు. అర్జునుడు శ్రీకాళహస్తి దర్శించి భరద్వాజముని ద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుసు కున్నట్టుగా స్కందపురాణంలో ఉంది. బ్రహ్మ, విష్ణువులతో సహా దేవతా గణమంతా అర్చించే శివలింగాన్ని అర్చించడం వల్ల దుఃఖాలన్నీ తొలగి బుద్ధి వికసిస్తుందంటారు.

అద్భుతం శివతత్వం

సుఖాలు పంచుకోవడానికి అందరూ వస్తారు. కానీ దుఃఖాన్ని పంచుకోవ డానికి ఎవరూ ముందుకు రారు. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని తీసుకోవడానికి ఏ ఒక్కరూ రాలేదు. శివుడు ముందుకొచ్చి తన చేయి సాచి ఆ విషాన్ని అరచేతిలోకి తీసుకుని పార్వతి వంక చూశాడు. ఆమెకి పతి శక్తిసామర్థ్యాలు బాగా తెలుసు. అది లోకహితం కోసమేననీ తెలుసు. అందుకే సేవించమని తలూపింది. వెంటనే నోట వేసుకుని దాన్ని కంఠంలోనే ఉంచేసుకున్నాడు. అది అమాయకత్వం కాదు. తల్లిదండ్రుల లక్షణం. తామెంత కష్టపడినా బిడ్డలు హాయిగా జీవించాలన్న అవ్యాజప్రేమ.

అనంతుడు, అక్షయుడు

శంకరుని శాశ్వతత్త్వాన్ని కీర్తించాడు కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఆయన ఆది, అంతం లేనివాడు. దీనజన రక్షకుడు. ఇంకాస్త ఉద్వేగంగా చెప్పాలంటే భక్తులకు బానిస. వాళ్లేం చేసినా సహిస్తాడు. ఎలాంటి కోరికలు కోరినా తీరుస్తాడు. నిబంధనలూ అభ్యంతరాలు ఏమీ ఉండవు.

శివతత్త్వాన్ని శంకరాచార్యులవారు ఎంత చక్కగా చెప్పారో! ఆకాశం జటాజూటంగా(వ్యోమకేశుడు) దిక్కులే వస్త్రాలైన (దిక్‌+అంబరుడు) దిగంబరుడుగా, చంద్రుడే సిగపువ్వుగా, స్థిరమైన ఆనందమే స్వరూపంగా ఉంటావంటూ కీర్తించారు. అంతేకాదు, మహేశ్వరుడిది మహా మృదువైన స్వభావమన్నారు. ఆ వినయమే భక్తపరాధీనుడిగా మార్చేసింది. భక్తుడు పడుకుని కీర్తన చేస్తే కూర్చుని వింటాడు. కూర్చుని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానంచేస్తే ఆనందతాండవం చేస్తాడన్నారు ఆదిశంకరుడు. భక్తుడిపట్ల భగవానుడికే అంత వినయం ఉంటే.. మరి భక్తులు దైవంపట్ల ఎంత విధేయులై ఉండాలో కదా!

శివుడు కేవలం శ్మశానవాసి కాదు, మహాశ్మశానవాసి. అంటే పితృవనం అనే వల్లకాడు కాదు.. మన హృదయాల్లో నివసిస్తూ.. అజ్ఞానం, అహంకారం, దుర్బుద్ధి అనే పాపాలను దహించేస్తాడు. ఆ పరమశివుని త్రికరణశుద్ధిగా పూజించడమే సిసలైన నీరాజనం.

- మామడూరు శంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని