Updated : 31 Mar 2022 04:45 IST

వారణాసి.. పుణ్యక్షేత్రాల దివ్యరాశి

వరుణ, అసి నదుల నడుమ ప్రవహించే గంగానది తీరాన వెలసిన పుణ్యక్షేత్రమే వారణాసి. కాశీ, బెనారస్‌ అనే పేర్లూ ఉన్నాయి. కాశీ భారతీయుల ఆత్మ. మన ఆధ్మాతిక రాజధాని. పావనగంగ, విశాలాక్షి, వారాహిమాత, విశ్వనాథ, కాలభైరవుల దర్శనాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు.

శానాః సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం’ అని వేదంలో చెప్పినట్లు సర్వవిద్యలకు నాథుడైన విశ్వనాథుని నిలయమిది. ఇప్పటికీ సనాతన విద్యలకు కాశీ కేంద్రంగా ఉంది.

కాశి శివలింగకోటుల గన్నతల్లి

కాశి కైవల్యఫలసవ కల్పవల్లి

గంగగారాబు నెచ్చెలికత్తె కాశి

సురనరోరగ దైత్య సంస్తువ్యకాశి

అంటూ కాశీ క్షేత్రాన్ని స్తుతించాడు శ్రీనాథుడు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధింకురు గంగానది సాక్షాత్తు బ్రహ్మస్వరూపమేనని పురాణాలు వర్ణించాయి.

కలౌవిశ్వేశ్వరం దేవః కాలౌ వారాణసీˆ పురే,
కలౌ భాగీరథీ గంగా దానం కలియుగే మహత్‌

పవిత్ర నదీ స్నానంతో పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. ఉత్తరవాహిని అయిన కాశీగంగ, తీర్థరాజమైన త్రివేణీగంగ విశేషించి చెప్పుకోదగినవి. కాశీని దర్శించుకుని విశ్వనాథుని సేవిస్తే చాలు జన్మ తరిస్తుందన్నారు పండితులు.

కాశీ విశ్వనాథ ఆలయంలోని జ్యోతిర్లింగం ఎంతో విశిష్టమైంది. దీన్ని శివుని నివాసస్థలంగా పరిగణిస్తారు. కైలాసంపై తపస్సు చేసి, కాశీలో గృహస్థుడిగా జీవిస్తానని మహాదేవుడే స్వయంగా చెప్పాడు.

పంచక్రోశ యాత్ర

‘పార్వతీ! ప్రతి ఏడాది ఉత్తర, దక్షిణాయనాల్లో పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర చేస్తాను’ అని శివుడు పార్వతితో చెప్పాడట. కాశీ కాలభైరవ ఆలయ సమీపంలో మధ్యేశ్వర లింగం ఉంది. అక్కడి నుంచి పశ్చిమ దిశలోని దేహాలీ వినాయకుని వరకు సూత్రం పట్టుకుని, దాన్ని అర్ధవ్యాసంగా చేసి మండలాకారంగా చుడితే ఆ పరిధిలో ఉన్న క్షేత్రం ‘పంచక్రోశాత్మక కాశీ. ఈ యాత్రతో పది జన్మల్లో చేసిన పాపాలు హరిస్తాయని నమ్మకం. ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, మాసాల్లో పంచక్రోశ యాత్ర చేయటం మంచిది. ఈ యాత్రను వారంరోజుల పాటు చేయాలి. కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణ మాతను దర్శించడంతో యాత్ర ముగుస్తుంది.  

- భూపతి కోనేరి రావు, ఈనాడు, లఖ్‌నవూ


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని