సుజన భావం.. మహేశ్వరతత్వం

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిలోని నిర్మలత్వం, దాక్షిణ్యభావం వెరసి సర్వజనుల సంక్షేమానికి ప్రతీకగా

Updated : 01 Mar 2022 08:15 IST

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిలోని నిర్మలత్వం, దాక్షిణ్యభావం వెరసి సర్వజనుల సంక్షేమానికి ప్రతీకగా తిరునాళ్ల నిలుస్తోంది. మహేశ్వరుని అంతులేని కటాక్షానికి భక్తులు చెల్లించే కృతజ్ఞతకు దృష్టాంతంగా మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో లక్షలాది మంది భక్తులు చేసే శివనామ స్మరణ, భజనలు, జ్ఞానానికి ప్రతీకగా నిలిచే ప్రభలు తిరునాళ్లకు కొత్త శోభ తెస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల ప్రజల ఐకమత్యానికి, ఆధ్యాత్మికతకు, సమష్టితత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. 

తిరునాళ్ల చారిత్రక నేపథ్యం 

మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవం జరిగినట్లు పండితులు చెబుతారు. దేశవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో రాత్రంతా జాగరణ చేయడాన్ని తిరునాళ్లగా పేర్కొంటారు. తిరు అంటే మంగళకరమైన నాడు అంటే రోజు అని అర్థం. వాడుకలో తిరునాడు తిరునాళ్లగా మారినట్లు పలు కథనాల ద్వారా తెలుస్తోంది. 17వ శతాబ్దంలో పినపాడుకు చెందిన వీరశైవ మంత్రోపాసకులు ఏలేశ్వరం అయ్యవారు దక్షిణామూర్తి స్వామి సూచన మేరకు యంత్ర ప్రతిష్ఠ చేశారు. తద్వారా స్వామిని సేవించుకుంటే లభించే ఫలంపై విశ్వాసం పెరిగి కొండకు వచ్చి భక్తులు పూజలు చేయించుకోవడం అధికమైంది. ఈనేపథ్యంలో పల్నాటిసీమలో అతిపెద్ద శైవక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా తిరునాళ్ల  జరపాలని సంకల్పించిన జమీందార్లు అనేక వసతులు కల్పించి ఉత్సవాలకు ఆర్థిక భద్రతగా భూములను మాన్యాలుగా స్వామికి సమర్పించుకుని తరించారు. అప్పటి నుంచి తిరునాళ్ల జరపడం ఆనవాయితీగా వస్తోంది. 

నాలుగు రోజులపాటు వేడుక

మహాశివరాత్రి పర్వదినాల్లో నిర్వహించే తిరునాళ్ల నాలుగు రోజుల పాటు సాగుతోంది. ఏకాదశి రోజున నరసరావుపేట పురపాలక సంఘం నిర్మించే ప్రభ కోటప్పకొండకు తరలివెళ్లడంతో ఇది ప్రారంభమవుతుంది. ఆరోజు నుంచి త్రికోటేశ్వరుని దర్శనానికి భక్తుల రాక మొదలవుతుంది. బాలప్రభలు, మొక్కుబడి ప్రభలతో భక్తులు కొండకు చేరి స్వామిని సేవించుకుంటారు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో చేసే మహారుద్రాభిషేకం తర్వాత దర్శనంతో తిరునాళ్ల ముగుస్తుంది. పూర్వం పల్నాడు ప్రాంతంలోని ప్రజల ప్రధానవృత్తి వ్యవసాయం. కేవలం వర్షాధారంగానే పంటలు పండించుకునేవారు. పశువులే సంపదగా ఉండే కాలం. సంక్రాంతి తర్వాత పంటలు ఇంటికి చేరి ప్రజలు అందరూ సంతోషంగా ఉండేకాలం. చేసిన శ్రమకు దేవుని కటాక్షంతో ఫలితం దక్కిందన్న భావనతో మహాశివరాత్రి రోజుల్లో త్రికోటేశ్వరుని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకునే వారు. పండించిన ధాన్యం తెచ్చి పొంగలి వండి నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా ఈశ్వరుని వాహనమైన నందీశ్వర రూపమైన ఎద్దులను అలంకరించి కొండకు తెచ్చి గిరి ప్రదక్షిణ చేయడం శ్రమైక జీవన సౌందర్యానికి అద్దం పడుతుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని