Kotappakonda: త్రికూట గిరులు

త్రికూటాద్రి మూడు శిఖరాల సమ్మేళనం. ఎటునుంచి చూసినా మూడు శిఖరాలు కన్పించడం కోటప్పకొండ 

Updated : 01 Mar 2022 12:41 IST

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: త్రికూటాద్రి మూడు శిఖరాల సమ్మేళనం. ఎటునుంచి చూసినా మూడు శిఖరాలు కన్పించడం కోటప్పకొండ ప్రత్యేకత. జ్ఞానప్రదాత శ్రీమేధా దక్షిణామూర్తిగా కొలువుదీరిన దివ్యక్షేత్రం. అజ్ఞానాంధకారాన్ని తొలగించి వెలుగును ప్రసాదించే త్రికోటేశ్వరస్వామిగా భాసిల్లుతున్న క్షేత్రం కోటప్పకొండ. కొండపై మూడు శిఖరాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటికి రుద్ర శిఖరం, విష్ణు శిఖరం, బ్రహ్మ శిఖరాలుగా పేరు. మూడు శిఖరాలు ఉన్న కొండ కావడంతో త్రికూటాద్రిగా విరాజిల్లుతోంది. బాలవటువుగా తపస్సు చేసి శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి బ్రహ్మ, విష్ణువులకు ఆయా శిఖరాలపై బ్రహ్మోపదేశం చేసినట్లుగా ఇతిహాసాలు చెబుతున్నాయి. త్రికూటాద్రి అధినాయకుడైన శ్రీమేధా దక్షిణామూర్తి స్వామి త్రికోటేశ్వరుడుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. కోటప్పకొండను త్రికూటాచలంగా, త్రికూటాద్రిగా స్మరించడంతో మోక్షం ప్రాప్తిస్తుందని అగస్త్య మహర్షి పేర్కొన్నట్లు పెద్దలు చెబుతారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని యల్లమంద, కొండకావూరు మధ్యలో కోటప్పకొండ విస్తరించి ఉంది. ఇది 1587 అడుగుల ఎత్తు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. త్రికూటాద్రి చుట్టుకొలత 8 మైళ్లు. త్రికోటేశ్వరస్వామి దేవస్థానం 600 అడుగుల ఎత్తులో ఉండి భక్తుల నిత్యపూజలకు ఆలవాలమైంది. 

రుద్రశిఖరం

దక్షయజ్ఞం అనంతరం విచలిత మనస్కుడై ఈశ్వరుడు బాలవటువుగా మారి తపమాచరించిన కొండపై భాగానికి రుద్రశిఖరమని పేరు. అక్కడే స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఉంది. అందుకే కార్తికమాసం అనంతరం ఆరుద్రోత్సవం రోజున కర్పూర జ్యోతి దర్శనం అక్కడే ఏర్పాటు చేస్తారు. రుద్రశిఖరం పై శ్రీపాతకోటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. నేటికీ ఆలయంలో నిత్యపూజలు కొనసాగుతున్నాయి. లింగాకారంతో పాటు శ్రీమేధా దక్షిణామూర్తి విగ్రహం కూడా అక్కడ ఉంది. 

బ్రహ్మశిఖరం

రుద్రశిఖరంపై నుంచి రుషులకు జ్ఞానబోధ చేసిన శ్రీమేధా దక్షిణామూర్తి బ్రహ్మశిఖరానికి వస్తూ మధ్యలో త్రికోటేశ్వరునిగా వెలిసినట్లు స్థలపురాణం చెబుతోంది. స్వామికి గొల్లభామ ఆనందవల్లి చేసిన సేవలకు ప్రసన్నుడై స్వామి రుద్ర శిఖరం నుంచి బ్రహ్మ శిఖరానికి వచ్చే క్రమంలో అక్కడ కొలువుదీరాడు. మెట్ల మార్గంలో ఉన్న ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే భక్తులు తన సన్నిధికి చేరుకుంటారని స్వామి వరం ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్రహ్మ జ్ఞానబోధ కోసం తపస్సు చేసిన శిఖరం కావడంతో బ్రహ్మ శిఖరంగా పేరు పొందింది. 

విష్ణు శిఖరం

దక్షయజ్ఞంలో పాల్గొన్న రుషులు, దేవతలు అందరూ యజ్ఞధ్వంసం వల్ల కలిగిన పాపం నుంచి విమోచన విష్ణు శిఖరంపై పొందారు. విష్ణువు కూడా అదే శిఖరంపై తపస్సు చేసినట్లు తెలుస్తోంది. శ్రీపాపవిమోచనేశ్వర స్వామి దేవాలయం ఉంది. విష్ణువు తపస్సు చేయడంతో శిఖరానికి విష్ణుశిఖరంగా పేరు వచ్చింది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని