Kotappakonda: త్రికోటేశ్వరుని ‘ప్రభ’వం

కోటప్పకొండ అంటే ప్రభలదే వైభవం. అవి లేకపోతే అక్కడ సందడే లేదు. అంత శోభాయమానంగా వీటిని నిర్మిస్తున్నారు. 

Updated : 01 Mar 2022 12:42 IST

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : కోటప్పకొండ అంటే ప్రభలదే వైభవం. అవి లేకపోతే అక్కడ సందడే లేదు. అంత శోభాయమానంగా వీటిని నిర్మిస్తున్నారు. ఒక్కో దాని నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్లలో అతి గొప్ప అంశం ప్రభలే. పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని ఏటా ఇలా ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వస్తారు. ప్రతిదాని వెంట ఊరంతా తరలివస్తుంది. ఇంతటి చరిత్ర ఉన్న ప్రభల వైభవం వందల ఏళ్ల నాటి నుంచి ఉంది.

కోటి ఒక్క ప్రభ కడితే కోటయ్య   కొండ దిగి వస్తాడని..

కోటి ఒక్క ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడనే నమ్మకంతో ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా వీటి నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మహా శివరాత్రి రోజు కోటప్పకొండ వద్ద వరుసలో ఠీవిగా నిలబడ్డ ప్రభల వైభవం మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల్లో కాంతులీనుతూ విద్యుత్తు ప్రభల ప్రత్యేకత కొండకు వచ్చే భక్తుల హృదయాల్లో స్థిరంగా నిలుస్తుంది. చిలకలూరిపేట మండలంలోని కావూరు, కమ్మవారిపాలెం, మద్దిరాల, యడవల్లి, గోవిందపురం, బొప్పూడి, నాదెండ్ల మండలంలోని అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, పురుషోత్తమపట్నం నుంచి 5 విద్యుత్తు, 5 సాధారణ ప్రభలు కొండకు తరలివస్తున్నాయి. కోటప్పకొండలోని త్రికోటేశ్వర ఆలయం శతాబ్దాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నట్లు చరిత్ర చెబుతోంది. వందల సంవత్సరాల నుంచి చెక్క ప్రభలతో కోటయ్యకు మొక్కులు తీర్చుకుంటున్న చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ప్రస్తుతం విద్యుత్తు ప్రభలను నిర్మించి కోటప్పకొండకు తరలి వస్తున్నారు.  

నెల ముందు నుంచే సందడి

ప్రభలు నిర్మించే అన్ని గ్రామాల్లో నెల ముందు నుంచే పనులు ప్రారంభిస్తారు. ప్రభకు సంబంధించిన ఇరుసులు, రాతిచక్రాలు, డొలుపులు, కమ్ములు ముందుగా సిద్ధం చేసుకుంటారు. వీటిని బిగించిన అనంతరం క్రేన్‌ సాయంతో ఏర్పాటు చేసిన రాతి చక్రాల బండి మీదకు ప్రభను చేర్చి కొండకు తరలించేందుకు సిద్ధం చేస్తారు. ప్రభ కొండకు బయలుదేరే ముందు గ్రామంలో, కొండకు వెళ్లిన తర్వాత తిరునాళ్ల రోజు, తిరిగి గ్రామానికి వచ్చిన తర్వాత మరోసారి పండగ వాతావరణంలో ప్రభ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమాల్లో ఊరివారు ఎక్కడ ఉన్నా గ్రామానికి చేరుకుంటారు. ఐకమత్యంతో ఊరంతా హరహర చేదుకో కోటయ్య అంటూ ప్రభతో నడుస్తూ కోటప్పకొండకు చేరుకుంటారు.

ఒక్కొక్క నిర్మాణానికి రూ.25 లక్షలు ఖర్చు

కోటప్పకొండ తిరునాళ్లకు నిర్మిస్తున్న ప్రభల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 80 నుంచి 90 అడుగుల ఎత్తు ఉండే ఒక్కో ప్రభకు విద్యుత్తు దీపాల ఏర్పాటు, జనరేటర్‌ తదితర సౌకర్యాలు మూడు సార్లు ఏర్పాటు చేసినందుకు రూ.11 లక్షలు, పాట కచేరికి రూ.5 లక్షలు, భోజనాలకు రూ.3 లక్షలు, ప్రభ నిర్మాణం నుంచి తిరిగి వచ్చేవరకు మరో రూ.6 లక్షల ఖర్చు ఉంటుంది. ఇది ఏటా పెరుగుతున్నా కోటయ్యస్వామి మీద భక్తి ప్రపత్తులతో ప్రభలు నిర్మిస్తూనే ఉన్నారు.

కావూరు ప్రభ ప్రత్యేకం

చిలకలూరిపేట మండలం కావూరు గ్రామస్థులు వందేళ్ల ముందు నుంచే చెక్క ప్రభను నిర్మించి కొండకు తరలించేవారు. అయితే 76 ఏళ్లుగా విద్యుత్తు ప్రభను నిర్మించి కోటప్పకొండకు తరలిస్తున్నారు. రాష్ట్రంలోనే ఈ ప్రభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కొండ వద్ద రాజావారు ఈ ప్రభ నిలిపేందుకు ప్రత్యేక స్థలం ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా 50 ఏళ్లు ప్రభ నిర్మిస్తున్న సందర్భంగా అక్కడ ప్రత్యేక శిలాశాసనం కూడా వేశారు. గ్రామంలో కూడా ప్రభను, బండిని నిలిపేందుకు ప్రత్యేక గదులను కూడా నిర్మించారు. ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన మొదటి మహానాడులో కావూరు గ్రామస్థులు అక్కడ తమ ప్రభను నిర్మించి ప్రత్యేకత చాటారు. ప్రభ నిర్మాణాన్ని ఏటా గ్రామంలో ఉన్న ఆరు ముఠాలలో ఒక ముఠా చేపడుతుంది. కేతినేని, మద్దాలి, కోడె, రామలింగం, మేండ్రు, నాయుడు ముఠాలు ఏటా ప్రభ బాధ్యతను తీసుకుంటాయి. ఈ ఏడాది రామలింగం ముఠా నిర్మిస్తోంది. ఈ ముఠాలో ఉన్న రైతులకు 312 ఎకరాల భూములు ఉన్నాయి. ప్రతి ఎకరాకు రూ.6,500 వేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కావూరు ప్రభకు విశిష్ట చరిత్ర ఉంది.

ఒకే చోట పది ప్రభలు 

ఒకేచోట పది ప్రభలు నిర్మించే ప్రాంతంగా పురుషోత్తమపట్నం చరిత్రలో పేరు లిఖించుకుంది. వందల ఏళ్లుగా ప్రభలు నిర్మించే ఆనవాయితీ ఇక్కడ ఉంది. దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ మంచి గుర్తింపు తీసుకు   వస్తున్నారు. 

125 ఏళ్లుగా ఇక్కడ  ప్రభలను ఏర్పాటు చేసి కొండకు తరలిస్తున్నారు. పురుషోత్తమపట్నంలో ప్రభ పండగ అంటే దేశ, విదేశాల్లో ఉన్న బంధువులు సైతం తరలివస్తారు. ఇక్కడ ప్రభలన్నీ సిద్ధమైన తర్వాత ఈ ప్రాంతమంతా వెలుగులమయంగా మారుతుంది.  

ఎవరి ప్రత్యేకత వారిదే.. : మద్దిరాల, కమ్మవారిపాలెం, యడవల్లి, గోవిందపురం, బొప్పూడి, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం, నరసరావుపేట మండలంలోని గురవాయపాలెం, యలమంద, నరసరావుపేట పట్టణం నుంచి కూడా బాల ప్రభలు, చెక్కలతో చేసిన ప్రభలు పెద్దఎత్తున కోటయ్యస్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు నిర్మిస్తారు.

సమష్టితత్వానికి ప్రతీక

ప్రభల నిర్మాణం సమష్టితత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రభ తరలింపు సమయంలో వచ్చే ఆటంకాలు ఎక్కువగానే ఉంటాయి. మధ్యలో ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం జరుగుతుంటాయి. అయితే ప్రభకు ఇరువైపులా పంబతాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ ఊరంతా ప్రభ వెంట ఉంటారు. దీనికోసమే గ్రామస్థులు ఎక్కడ ఉన్నా శివరాత్రి మూడు రోజులపాటు ఊరిలోనే ఉండిపోతారు. ఈ ఐక్యతే ఏటా ఖర్చుకు వెరవకుండా కోటయ్య స్వామికి క్రమం తప్పకుండా ప్రభలు నిర్మించేలా ముందుకు నడిపిస్తోంది.  - మాలెంపాటి నాగేశ్వరరావు, కమ్మవారిపాలెం 

  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని