Kotappakonda: అమ్మవారు లేని శైవక్షేత్రం..

దేశంలో ఏ శైవక్షేత్రాన్ని సందర్శించినా పార్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 

Updated : 01 Mar 2022 12:49 IST

ధ్వజస్తంభం ఉండదు.. 

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: దేశంలో ఏ శైవక్షేత్రాన్ని సందర్శించినా పార్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. కానీ కోటప్పకొండపై అమ్మవారు కనిపించరు. కుంకుమార్చనలు, కల్యాణోత్సవాలు అన్ని శివాలయాల్లో జరుగుతుంటాయి. ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా ధ్వజస్తంభ దర్శనం చేసిన తర్వాతే ప్రధాన ఆలయంలో స్వామి వారిని సేవిస్తారు. కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామి దేవస్థానం శైవక్షేత్రమే అయినా వాటన్నింటికి తావులేదు. ఇలా ఉన్న క్షేత్రం త్రికూటాచలం మాత్రమే. అందుకు పెద్ద కథే ఉంది. పరమశివుడు శ్రీమేధాదక్షిణామూర్తి స్వరూపంగా కోటప్పకొండలో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారని వేదపండితులు పేర్కొంటున్నారు. 

బ్రహ్మచారిగా పరమేశ్వరుడు 

దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత సతీవియోగంతో శివుడు లోక సంచారం చేస్తూ త్రికూటాచలానికి చేరుకుని బాలవటువుగా మారారు. 12 ఏళ్ల పాటు తపస్సు చేసి మనఃశాంతి పొందినట్లు ఐతిహ్యం. మూడు శిఖరాల్లో రుద్రశిఖరంపై తపస్సు చేసుకున్న స్వామి భక్తురాలైన ఆనందవల్లికి ఇచ్చిన వరం కారణంగా కొండ దిగి వస్తూ లింగరూపంలో వెలిశారు. స్థలపురాణం ప్రకారం స్వామి బ్రహ్మచారిగానే వెలిశారు. కాబట్టి అమ్మవారు కోటప్పకొండలో ఉండరు. 

ధ్యానముద్రలో శంకరుడు 

దేశంలోని శైవక్షేత్రాల్లో పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా భక్తులను అనుగ్రహించడం పరిపాటి. కోటప్పకొండలో పరమేశ్వరుడు శ్రీమేధాదక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞానప్రదాతగా వెలిశారు. ధ్యానంలో ఉంటూ లోకసంరక్షణకు తపస్సు చేసినట్లు పెద్దలు చెబుతారు. మానవుల్లోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్యోతి స్వరూపునిగా త్రికూటాద్రిపై కొలువు దీరారు. 

ఆనందవల్లి దర్శనం తరువాతే..

త్రికోటేశ్వరస్వామి కర్షక పక్షపాతి. అందుకే ముందుగా పరమభక్తులైన శాలంకయ్య, ఆనందవల్లిలను అనుగ్రహించి మోక్షప్రాప్తి కల్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. యల్లమందకు చెందిన శాలంకయ్యకు తొలిగా యోగి రూపంలో దర్శనమిచ్చారు. తర్వాత కొండకావూరుకు చెందిన ఆనందవల్లి సేవలు స్వీకరించి అనుగ్రహించారు. పాత ఆలయం వెనుక ఉండే  శాలంకయ్య ప్రతిష్ఠించిన శివలింగాన్ని తరువాత తొలగించి అభిషేక మండపంలో ఏర్పాటు చేశారు. ఆనందవల్లిని దర్శించిన తర్వాతే తనను భక్తులు దర్శించుకుంటారన్న వరం సైతం స్వామి ఇచ్చారు. ఈ కారణంగానే మెట్ల మార్గంలోని ఆనందవల్లి ఆలయంలో పూజలు ఆమె వంశీయులే చేస్తారు. నాలుగు తరాల క్రితం వరకూ పుత్రసంతతి వారే ఆనందవల్లి ఆలయ బాధ్యతలు చూశారు. తర్వాత పుత్రసంతానం లేకపోవడంతో భూదేవమ్మ మహిళ సంతతి వారే ప్రస్తుతం ఆనందవల్లిని సేవిస్తున్నారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని