Kotappakonda: త్రికూటాచలం.. మహాక్షేత్రం

కోటప్పకొండలోని త్రికోటేశ్వర ఆలయం 1700 ఏళ్లుగా భక్తులకు కల్పతరువుగా వెలుగొందుతోంది. ఎన్నో ప్రత్యేకతలున్న 

Updated : 01 Mar 2022 12:38 IST

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: కోటప్పకొండలోని త్రికోటేశ్వర ఆలయం 1700 ఏళ్లుగా భక్తులకు కల్పతరువుగా వెలుగొందుతోంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ పవిత్ర శైవక్షేత్ర అభివృద్ధికి ఎందరో భక్తులు, పాలకులు, నేతలు కృషి చేసి ధన్యజీవులయ్యారు. జమీందారు వంశస్థులు సోపాన మార్గాన్ని నిర్మించి భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించారు. 1985 తర్వాత ఘాట్‌రోడ్డు నిర్మాణం ఆలయ జీర్ణోద్ధరణ పనులతో దేవస్థాన రూపురేఖలు మారాయి. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక, పర్యావరణ క్షేత్రంగా రూపుదిద్దుకుంది. 

ఘాట్‌రోడ్డు నిర్మాణానికి పుష్కరం 

కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు సోపానమార్గం ఒక్కటే ఉండేది. 757 మెట్లెక్కి స్వామిని దర్శించుకోవడం వృద్ధులు, మహిళలు, పిల్లలకు కష్టమైన నేపథ్యంలో  అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ కోడెల చొరవతో ఘాట్‌రోడ్డు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. పర్యావరణ, అటవీశాఖల అనుమతులు వచ్చాక 1986 ఏప్రిల్‌ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు శంకుస్థాపన చేశారు. 4.5 కి.మీ. ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1989లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో పనులు నిలిచిపోయాయి. 1994 తర్వాత పనులు తిరిగి ప్రారంభించారు. 1998 నాటికి ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తయింది. 

భగీరథ ప్రయత్నం ఆలయ జీర్ణోద్ధరణ 

శతాబ్దాల క్రితం నాటి త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలన్న సంకల్పాన్ని జగద్గురువు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి అనుగ్రహించి ఆశీర్వచనం చేశారు. దీంతో జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. ఇందుకు రూ.70 లక్షలు వ్యయం చేశారు. మూడు నెలల్లో కొత్త ఆలయాన్ని నిర్మించారు. 1999లో మహాశివరాత్రి నాటికి భక్తులకు కొత్త ఆలయాన్ని అందించారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకలకు హాజరై ఏడంతస్తుల గాలిగోపురాన్ని ప్రారంభించారు. 

నిర్మాణంలో ప్రత్యేకతలు 

ఆలయ నిర్మాణంలో ఆసక్తికర అంశాలున్నాయి. ఆలయాన్ని మూడు విభాగాలుగా నిర్మించారు. అవి గర్భగుడి, నక్షత్ర మండపం, గాలిగోపురం. రోజుకు 700 మంది కార్మికులు విరామమెరగక పని చేసి తరించారు. గర్భగుడి నిర్మాణానికి అవసరమైన రాయి గురిజేపల్లి క్వారీ నుంచి తెప్పించారు. సత్తెనపల్లికి చెందిన ముస్లిం కుటుంబాలు రాతి స్తంభాలు, రాళ్లు సిద్ధం చేశాయి. చివరలో రాళ్లు చాలకపోతే పురుషోత్తమపట్నానికి చెందిన ముస్లింలు రాళ్లను అందించి ఆలయ నిర్మాణానికి సహకరించారు.

మౌంట్‌ అబూ శైలిలో ధ్యాన మందిరం 

శ్రీమేధా దక్షిణామూర్తిని ధ్యానించేందుకు ప్రత్యేకంగా మందిరం ఉండాలన్న ఆలోచనతో నిర్మాణం చేశారు. రాజస్థాన్‌లోని మౌంట్‌అబూలో బ్రహ్మకుమారిల కేంద్రం ఉంది. ప్రశాంతతకు, ధ్యానం చేసేందుకు అనువైన ప్రాంతం కావడంతో మనిషి జీవితం, ఆలోచనల్లో సైతం సకారాత్మక మార్పు వస్తుంది. అదే శైలిలో కోటప్పకొండలో మందిరం ఏర్పాటుకు  సంకల్పించారు. షడ్భుజి ఆకారంలో ధ్యాన మందిరం నిర్మించడంతో ప్రశాంతంగా ధ్యానం చేసుకునే అవకాశం సాధకులకు అందుబాటులోకి వచ్చింది. 

ఆహ్లాదం కోసం.. 

జీర్ణోద్ధరణ చేసిన తర్వాత మొదటి వార్షికోత్సవం నాటికి భక్తులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. క్యూలైన్లు, తితిదే సహకారంతో అతిథి గృహాలు నిర్మించారు. ఘాట్‌రోడ్డులో పిల్లలరాజ్యం పేరిట పార్కు, పర్యావరణ పరిరక్షణ కేంద్రంలో ఆక్వేరియం, జింకల పార్కు, పలు రకాల పక్షులు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేందుకు టాయ్‌ట్రైన్‌ను తెప్పించి అందుబాటులోకి ఉంచారు. 

ఆలయం ముందు మండపం

కాంగ్రెస్‌ హయాంలో అప్పటి మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి రూ.30లక్షల వ్యయంతో ఆలయం ముందు మండపాన్ని నిర్మించారు. ఇందుకు అవసరమైన నిధులు కాసు కుటుంబం సమకూర్చింది. వీరి హయాంలోనే కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్లకు ప్రభుత్వం రాష్ట్ర పండగ హోదాను ఇచ్చింది.  

మేధా దక్షిణామూర్తి ఆలయానికి రూపు

త్రికోటేశ్వర స్వామి అసలు రూపమైన శ్రీమేధా దక్షిణామూర్తి ఆలయ నిర్మాణం చేయాలన్న జగద్గురువు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆదేశాలతో నల్లపాటి కుటుంబం ముందుకు వచ్చింది. పారిశ్రామికవేత్త నల్లపాటి వెంకటరత్తయ్య రూ.40లక్షల నిధులు సమకూర్చారు. దీంతో జ్ఞానప్రదాత అయిన స్వామిని విగ్రహ రూపంలో పూజించడంతో పాటు చిన్నారుల అక్షరాభ్యాసాలు చేయించుకునేందుకు వీలు కలిగింది. 

తాజాగా అభివృద్ధి పనులు 

కోటప్పకొండపై పలు అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టారు. మెట్ల మార్గంలో షెడ్లను నిర్మించారు. రూ.3.19 లక్షల వ్యయంతో నందీశ్వరుని రాతి విగ్రహం, మండపం, శ్రీమేధా దక్షిణామూర్తి 36 అడుగుల సిమెంట్‌ విగ్రహ నిర్మాణ పనులు చేపట్టారు. చిలకలూరిపేటకు చెందిన ఒక దాత సహకారంతో అన్నదానానికి అవసరమైన భవనం, భక్తులకు విశ్రాంతి భవనాల నిర్మాణం సాగుతోంది. ఇందుకు దేవస్థానం కూడా  రూ.2కోట్లు వ్యయం చేస్తోంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని