Maha Shivaratri 2022: భక్త మందారుడు.. క్వారీ బాలకోటేశ్వరుడు

జిల్లాలో వడ్లమూడి గ్రామంలో జరిగే క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లుకు ఏటా సుమారు 2 లక్షల మంది వస్తారని

Updated : 01 Mar 2022 12:36 IST

న్యూస్‌టుడే, చేబ్రోలు : జిల్లాలో వడ్లమూడి గ్రామంలో జరిగే క్వారీ బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లుకు ఏటా సుమారు 2 లక్షల మంది వస్తారని అంచనా. దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకాదశినాడు లక్ష్మీ గణపతి పూజతో వేడుకలు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయ ఆవరణలో మూడు రోజుల పాటు యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. భక్తులు పొంగళ్లు చేసుకునేందుకు తాత్కాలిక షెడ్లు, గ్యాస్‌ పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

స్థల పురాణం

1905లో గ్రామానికి చెందిన చీమకుర్తి ఎలమంద అనే రైతు పొలం దున్నుతుండగా నాగలికి శివలింగం తగిలింది. దాన్ని బయటకు తీసి, అక్కడే ప్రతిష్ఠించారు. అతనికి స్వామి స్వప్నంలో కన్పించి, తాను బాల కోటేశ్వరస్వామిగా వెలిశానని, గుడి నిర్మించి, తిరునాళ్ల నిర్వహించాలని చెప్పారు. స్థానిక భక్తుల సహకారంతో ఆయన కోవెల నిర్మించి, వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఫాలనేత్రుడ్ని దర్శించి, ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరతాయనేది భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. 

సిద్ధమవుతున్న విద్యుత్తు ప్రభలు

 తిరునాళ్లకు ప్రధాన ఆకర్షణ పరిసర గ్రామాల్లో రూపుదిద్దుకునే విద్యుత్తు ప్రభలే. నారాకోడూరు, గుండవరం, గొడవర్రు, సుద్ధపల్లి, శలపాడు, వడ్లమూడి, చేబ్రోలు, వేజండ్ల గ్రామాల భక్తులు వీటిని నిర్మిస్తారు. ఇవి సుమారు 130 అడుగుల ఎత్తు వరకూ ఉంటాయి. గొడవర్రు గ్రామ ప్రజలు దేవాలయం  తరపున ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకొస్తారు. గత 50 ఏళ్లుగా ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. దీన్ని ధ్వజస్తంభం ఎదురుగా నిలుపుతారు. ఒక్కో విద్యుత్తు ప్రభకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చుపెడతారు.

ఎలా చేరుకోవాలంటే..

విజయవాడ నుంచి 48, గుంటూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. విజయవాడ నుంచి గుంటూరు చేరుకొని, అక్కడి నుంచి నారాకోడూరు మీదుగా తెనాలి వెళ్లే బస్సులు ఎక్కి వడ్లమూడి వద్ద దిగి, ఆలయానికి చేరుకోవాలి. విజయవాడ, గుంటూరు నుంచి రైలు మార్గంలో వేజండ్ల రైల్వేస్టేషన్‌ చేరుకొని, అక్కడి నుంచి సమీపంలోని క్వారీ బాలకోటేశ్వరస్వామి కోవెలకు చేరవచ్చు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని