Updated : 01 Mar 2022 12:35 IST

Mahashivratri 2022: పరమేశ్వరుడు నివశించిన పెదకాకాని క్షేత్రం

పెదకాకాని, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పది ఆలయాల్లో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానం ఒకటి. ఇక్కడ స్వామి గంగ, భ్రమరాంబ సమేతంగా దర్శనమిస్తారు. అన్నప్రాసన, పుట్టువెంట్రుకలు తీయించడం, చెవిపోగులు కుట్టడం, వివాహాలు, వాహన పూజలకు ఈ గుడి పేరుగాంచింది. సంతానం లేని దంపతులు ఇక్కడ మండల దీక్ష చేపడతారు. అనారోగ్య సమస్యలున్నవారు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రీకాళహస్తి తరువాత రాష్ట్రంలో రాహుకేతు పూజలు ఎక్కువగా జరిగేది ఇక్కడే.

స్థల పురాణం 

మునులతో కలిసి భూవిహారం చేస్తున్న పరమేశ్వరుణ్ని మంగళాద్రి(మంగళగిరి), గర్తపురి(గుంటూరు) నడుమనున్న వనం (ప్రస్తుత కాకాని) ఆకర్షించింది. కొంతకాలం ఇక్కడే ఉండాలని స్వామి భావించారు. మహర్హులు ముక్కంటితో పాటు ఇక్కడే ఉండి, ఆయన్ను సేవిస్తూ గడిపారు. ఆ వనమే అనంతర కాలంలో గ్రామంగా రూపుదిద్దుకుంది. అనేకమంది సిద్ధయోగులు నీలకంఠుడ్ని అర్చించిన కారణంగా దీన్ని ‘సిద్ధయోగ సమాజం’ అని పిలిచేవారు. తర్వాత శంకరుడు ఇక్కడి నుంచి తరలినా, వనంపై ఆపేక్షతో ఇక్కడ ఆయన భ్రమరాంబ సమేతుడై లింగ రూపంలో స్వయంభువుగా వెలిశారు. భరద్వాజ మహర్షి ఇక్కడ యజ్ఞయాగాదులు చేసిన సమయంలో బ్రహ్మదేవుడి కటాక్షం లభించిన కాకాసురుడనే రాక్షసుడు కాకి రూపంలో స్వామి నైవేద్యాన్ని తిన్నందున, నిత్యం త్రినేత్రుణ్ని దర్శించినందున దీనికి ‘కాకాని’ అనే పేరొచ్చింది. క్రీ.శ 1440లో కుటుంబ సమేతంగా శ్రీకృష్ణ దేవరాయలు స్వామిని దర్శించుకొని, కోవెల పునర్నిర్మాణానికి ధనమిచ్చారు. 1911లో ఇదే  గ్రామానికి చెందిన కొల్లిపర వెంకటరత్నం ఆలయాన్ని పునర్నిర్మించారు.

 

కనులపండువగా ఉత్సవాలు 

ప్రతి ఏడాదీ ఇక్కడ ఏడు రోజుల పాటు వేడుకలు జరుపుతారు. మహాశివరాత్రి పండగకు మూడు రోజుల ముందు ఇవి ప్రారంభమవుతాయి. సుప్రభాత సేవలు, పంచహారతులు, సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ఆలయ నిర్మాణ దాతలు కొల్లిపర వంశస్థులు దేవతామూర్తులకు నూతన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. మరుసటి రోజు నందివాహనంపై గ్రామోత్సవం, అనంతరం దివ్య రథోత్సవం, ఆరో రోజు ఆలయం పక్కనే ఉన్న చెరువులో తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు.

సౌకర్యాలతో సిద్ధం

స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూలైన్లు, లోనికి, వెలుపలికి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు, అత్యవసర వైద్యం కోసం ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. తాగునీరు అందుబాటులో ఉంటుంది. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం సిద్ధం చేస్తారు. కొందరు దాతలు భక్తులకు  ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహిస్తారు. గట్టి పోలీసు బందోబస్తు ఉంటుంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని