పామును ఆజ్ఞాపించాడు

ఒకరోజు శ్యామా చిటికెనవేలుమీద పాము కాటేసింది. ఆ బాధ భరించలేక చనిపోతానేమో అనుకున్నాడు. విఠోబా గుడిలో పాము కాటుకు వైద్యం చేస్తారని తెలిసి స్నేహితులు అక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు.

Updated : 27 May 2022 17:23 IST

కరోజు శ్యామా చిటికెనవేలుమీద పాము కాటేసింది. ఆ బాధ భరించలేక చనిపోతానేమో అనుకున్నాడు. విఠోబా గుడిలో పాము కాటుకు వైద్యం చేస్తారని తెలిసి స్నేహితులు అక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు. శ్యామా మాత్రం తనకు సాయే విఠోబా అని ఆయన వద్దకు పరుగెట్టాడు. బాబా అతణ్ణి చూడగానే ఈసడించుకొని ‘ఓరి పిరికి పురోహితుడా! ఈ మెట్లు ఎక్కొద్దు! వినకుండా ఎక్కావంటే ఏమవుతుందో చూడు! ఇక్కణ్ణించి వెళ్లు! త్వరగా వెళ్లు’ అంటూ  బెదిరించాడు. బాబా అలా కోప్పడటంతో బాబాను సర్వంగా భావించే శ్యామా బాధపడ్డాడు, నిరాశ చెందాడు. సాయే తరిమేస్తే తానెక్కడకి పోవాలి?- అనుకున్నాడు.

కొంతసేపటికి బాబా యథాస్థితికి వచ్చి, శ్యామా పక్కన కూర్చుని ‘భయపడకు, చింతించకు! ఈ దయార్ద్రఫకీరు నిన్ను రక్షిస్తాడు. ఇంటికెళ్లు. బయటికెక్కడికీ వెళ్లొద్దు. నాపై విశ్వాసం ఉంచు’ అని శ్యామాను ఇంటికి పంపాడు. అంతలోనే తాత్యా పటేలు, దీక్షితులను పంపి శ్యామాను ఇష్టమైనవి తినొచ్చు, ఇంట్లో తిరగొచ్చు. కానీ పడుకోకూడదని చెప్పమన్నాడు. కొన్ని గంటల్లో శ్యామాకు నయమైంది. నిజానికి బాబా కోపం శ్యామా మీద కాదు, సర్పం మీద. విషం పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించొద్దని పామును ఆయన ఆజ్ఞాపించాడు. సాయి ఆగ్రహం వెనుక ఆంతర్యం అది.

- సకలాభక్తుల సుమంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని