దేవహితం కారుణ్యం

బతుకు, బతకనివ్వు అనేది మన సంప్రదాయం. ప్రేమ కరుణ మన సిద్ధాంతం. ప్రశాంత జీవనమే అంతిమ లక్ష్యం. అందులో భాగంగానే ప్రకృతిని ప్రేమించమని, భూతదయ చూపమని పెద్దలు పదేపదే చెబుతారు. పులిని కాల్చేస్తే లేదా పిచ్చుకను చిదిమేస్తేనే కాదు

Updated : 10 Mar 2022 05:04 IST

బతుకు, బతకనివ్వు అనేది మన సంప్రదాయం. ప్రేమ కరుణ మన సిద్ధాంతం. ప్రశాంత జీవనమే అంతిమ లక్ష్యం. అందులో భాగంగానే ప్రకృతిని ప్రేమించమని, భూతదయ చూపమని పెద్దలు పదేపదే చెబుతారు. పులిని కాల్చేస్తే లేదా పిచ్చుకను చిదిమేస్తేనే కాదు.. వాటి స్వేచ్ఛను హరించినా, మనుగడకు ఇబ్బంది కలిగించినా హింసేనన్నది పండిత సూక్తం. జీవకారుణ్యం భారతీయ తాత్విక చింతనలో అతి ముఖ్యమైన భాగం.
దేవదత్తుడి బాణం తగిలి హంస నేలకూలింది. అది చూసి చలించిన సిద్ధార్థుడు దానికి సపర్యలు చేసి, కోలుకున్న తర్వాత స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించాడు. బౌద్ధమతం ఉద్భవించిందే అహింస, జీవకారుణ్యాలను ప్రచారం చేసేందుకు. అందుకే...
ప్రాణాతి పాత వేరమణి
శిఖ్ఖా పదం సమాధియామి

అన్నారు. ‘జీవిత కాలంలో ఏ ఒక్క జీవి స్వేచ్ఛనూ ఎట్టి పరిస్థితిలో హరించం’ అని బౌద్ధ భిక్షువులు ప్రతిజ్ఞ చేస్తారు.
తనను కాపాడమంటూ శరణార్థిగా వచ్చిన పావురానికి అభయమిచ్చాడు శిబి చక్రవర్తి. దానిని వెంబడిస్తూ వచ్చిన డేగతో పావురాన్ని వదిలిపెట్టమన్నాడు. ‘వేట తమ సహజ లక్షణం, నోటికందిన ఆహారాన్ని తప్పించడం న్యాయం కాదు- అన్న డేగకు      పావురం బరువుకు సరిపడా తన మాంసాన్నిచ్చాడు శిబి. జీవకారుణ్యానికి, త్యాగనిరతికి గొప్ప ఉదాహరణ ఇది.
జీవరాశుల పట్ల ప్రేమ, దయ చూపడమే ఆధ్యాత్మిక సాధన. భారతం ఆరంభమయ్యేదీ, ముగిసేదీ కూడా శునకంతోనే. దుఃఖభారంతో ఒంటరిగా నడుస్తున్న ధర్మరాజును సారమేయుడు అనే దేవతా శునకం అనుసరించింది. తనకు తోడుగా వచ్చిన ఆ కుక్కను స్వర్గానికి తీసుకు వెళ్తానని పట్టుబట్టి దానిపై తన అనురాగాన్నీ, కారుణ్యాన్నీ ప్రదర్శించాడు.
జీవులపట్ల రమణ మహర్షి చూపిన ప్రేమ, దయ వల్లనే రమణాశ్రమంలో జంతువులు,  పక్షులు, సర్పాలు, స్వేచ్ఛగా సంచరించేవి. వాటితో మహర్షి మౌనంగానే సంభాషిస్తూ ప్రేమ చూపే వారు. మూగజీవాలను ‘అతడు, ఆమె’ అనేవారు. రమణాశ్రమంలో కుక్క, ఆవు, కాకి సమాధులు ఆయన అసమాన జీవకారుణ్యానికి తార్కాణాలుగా నేటికీ కనిపిస్తాయి.
ప్రేమను పంచితే, తిరిగి ప్రేమ లభిస్తుంది. ఇది జంతువులకూ వర్తిస్తుంది. వాటికి కాస్తంత తిండి పెడితే, నీళ్లు అందిస్తే మనమీద అపార ప్రేమ చూపుతాయి. అంతులేని వాత్సల్యాన్ని కురిపిస్తాయి. క్రూరమృగాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని అనేక సందర్భాల్లో తేలింది.
ప్రేమ అత్యున్నత ఔషధం. ఆయా జీవుల సహజ లక్షణాలను బట్టి వాటి ఆవాసాలు, ఆహార ప్రవృత్తులు ఉంటాయి. తేనెటీగలు వాలినంతలో పూలు వడలిపోవడాన్ని ఎప్పుడైనా చూశారా? గాలి వీచడం ఆగిపోయి.. పక్షులు ఎగరకుండా చేస్తోందా? కీటకాలను బల్లులు మింగేయటం, వాటిని పాములు స్వాహా చేయడం, వాటిని గద్ద తినడం- ఇలా ప్రకృతిలో ప్రతి జీవికీ నిర్దిష్ట ఆహార నియమాలున్నాయి. కానీ ప్రకృతి నియమాలను ఉల్లంఘించేది అన్నీ తెలిసిన మనుషులే. ఇది కాదనలేని సత్యం.
కొమ్మ మీద క్రౌంచ పక్షుల జంట ఆనందంగా ఉండగా వేటగాడి బాణం తగిలి మగ పక్షి నేలకొరిగింది. అది చూసి ఆడ పక్షి విలపించడంతో అక్కడే చెట్టునీడన సేదతీరుతున్న వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది.
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీస్సమాః
యత్‌ క్రౌంచ మిథునాదేకమ్‌ అవధీః కామ మోహితమ్‌

‘కిరాతకా! కామమోహిత గువ్వల జంటలో ఒకదానిని చంపిన నువ్వు శాశ్వత అపకీర్తిని పొందుతావు’ అంటూ వేటగాడిని శపించాడు.
సీతాదేవి అగ్ని పరీక్ష అనంతరం దేవతలంతా ప్రత్యక్షమయ్యారు. రాముడి ఔన్నత్యాన్ని మెచ్చిన దేవతలు వరం కోరుకోమన్నారు. అప్పుడు రాముడు తనకు సహకరించిన వానరసేనలో ప్రాణాలు కోల్పోయిన వాటిని మరల బతికించమని కోరడమే గాక, కోతులు ఏ ప్రదేశంలో సంచరించినా అక్కడ వృక్షాలు ఫలవంతంగా ఉండేటట్లు చేయమని ప్రార్థించాడు. జీవకారుణ్యాన్ని మించిన సుగుణం ఇంకేముంటుంది?
రావణుడు సీతను ఎత్తుకునివెళ్లడం చూసిన జటాయువు తట్టుకోలేకపోయింది. శక్తికొద్దీ పోరాడి రెక్కలు పోగొట్టుకుని కూర్మ పర్వతంపై పడిపోయింది. సీతను అన్వేషిస్తూ వచ్చిన రాముడు జటాయువు స్థితి చూసి బాధపడ్డాడు. అది సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడిచింది. ఆ పక్షి త్యాగానికి చలించిన రాముడు స్వయంగా దహన సంస్కారాలు చేశాడు. నిస్సహాయంగా పడివున్న జటాయువును రాముడు లేపుతూ ‘లే.. పక్షీ..’ అనడం వలే ఆ ప్రాంతం లేపాక్షి అయ్యిందనే కథనం ప్రచారంలో ఉంది. సీతారాములకు తన వంతు సాయంచేసి, రాముడి కరుణకు పాత్రమైన జటాయువుకు భద్రాచలానికి దగ్గరలో ఉన్న ఏటపాడులో మందిరం నిర్మించారు.
సింహ గర్జన విని జింక భయపడటం ప్రకృతి సహజం. కానీ విజ్ఞులమైన మనం కారుణ్యానికి బదులు కాఠిన్యం చూపడం ఆటవికం. జీవులను హింసించడమంటే భగవంతుణ్ణి బాధించడమే. సర్వేశ్వరుడి దృష్టిలో సకల ప్రాణులూ సమానమే. జీవుల పట్ల కారుణ్యం ప్రదర్శించమని భగవద్గీత భాష్యం చెబుతుంటే, సర్వజీవులూ సమానమేనని బౌద్ధం బోధిస్తోంది. క్రీస్తు, ఇస్లాం, సిక్కు, జైనం.. అన్ని మతాలూ ప్రబోధించేది ప్రేమ, దయ అలవరచుకోమనే. అప్పుడు మనో ప్రక్షాళనతో ప్రశాంతత చేకూరడమే కాదు, పర్యావరణమూ సురక్షితమే. ప్రకృతిమాత అందరిదీ.. బతికే స్వేచ్ఛ అన్నిటిదీ. మేధస్సు దయాగుణాన్ని పెంచి ఉన్నత శిఖరాలకు చేర్చాలే గానీ హింసను ప్రబలం చేసి దిగజార్చకూడదు కదా! మూగజీవాలతో అనుబంధం.. అదెంత ఆహ్లాదకరం! అదే ఆదర్శనీయం.. అదే ఆనందదాయకం.      

- ఎం.మహతీ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని