పెద్దావిడకి పరీక్షలు!

కాంచిపురంలో ఓ వృద్ధురాలు ఉన్నంతలో ఇతరులకు సాయం చేసేది. మూగజీవులకు ఆహారం పెట్టేది. గుడిని శుభ్రంచేసేది. ఆవిడ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భక్తురాలు. ఆయన ఏమి చెప్పినా తక్షణం

Updated : 27 May 2022 17:17 IST

కాంచిపురంలో ఓ వృద్ధురాలు ఉన్నంతలో ఇతరులకు సాయం చేసేది. మూగజీవులకు ఆహారం పెట్టేది. గుడిని శుభ్రంచేసేది. ఆవిడ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భక్తురాలు. ఆయన ఏమి చెప్పినా తక్షణం చేసేది. నిత్యం ఆయన్ను దర్శించుకునేది. స్వామి కూడా ఆవిణ్ణి ప్రత్యేకంగా చూసేవారు.

ఒకరోజు పరమాచార్య ఆవిడకు బెల్లం, బియ్యం ఇచ్చి చీమల పుట్టలు ఉన్నదగ్గరల్లా కాస్త వెయ్యమన్నారు. ఆమె ఊరంతా గాలిస్తూ పుట్ట కనిపించిన ప్రతిచోట బెల్లం, బియ్యం వేసి వచ్చింది. ఆయన నవ్వి ఆశీర్వదించారు. మరోసారి ఆమెని పిలిచి చుట్టుపక్కల దేవాలయాల్లో కొండెక్కిన దీపాలు వెలిగించి రమ్మన్నారు. ఆమె వెంటనే ఆ పని చేసింది. పెద్దావిడని స్వామి ఎందుకలా కష్టపెడుతున్నారో  అర్థం కాలేదు అక్కడి శిష్యులకు.

రెండురోజుల తర్వాత పరమాచార్య వద్దకు ఓ కోటీశ్వరుడు వచ్చాడు. శిష్యులు స్వామిని కలవడానికి కొంత సమయం పడుతుందని చెప్పి వేచి ఉండమన్నారు. అందుకాయన ‘నేనెవరనుకున్నారు? ఊళ్లో పెద్ద సంపన్నుడిని. నన్నే ఆపుతారా? నా గొప్పతనం తెలుసా మీకు? వేలమందికి అన్నదానం చేశాను. లక్షదీపోత్సవాలు నిర్వహించాను’ అంటూ కోపగించుకున్నాడు.

ఆ గొడవకు స్వామి బయటకు వచ్చి ‘నీకు కోట్లు ఉండి వేలమందికి భోజనాలు పెట్టించడం గొప్పకాదు. ఇక్కడో పేద వృద్ధురాలు లక్షల ప్రాణుల ఆకలి తీర్చింది’ అన్నారు. ఆ మాటలు  నమ్మని ధనికుడు పెద్దావిడ ఇంటికి వెళ్లాడు. ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. కేవలం రెండు చీరలున్నాయి. వండుకోవడానికి సరైన పాత్రలు కూడా లేవు. అయినా తన అన్నంలోంచి కొంత తీసి కుక్కలకు ప్రేమగా పెడుతోంది. అది చూసిన ధనికుడికి కనువిప్పు కలిగింది.

వెంటనే స్వామి వద్దకు వచ్చి క్షమించమన్నాడు. అప్పుడాయన ‘ఆకలి అన్ని ప్రాణులకూ ఒక్కటే. ఆ ఆకలి తీర్చే అవకాశం రావటమే నిజమైన ధనం. హృదయపూర్వకంగా ఒక్కరి ఆకలి తీర్చినా పుణ్యమే’ అని ప్రబోధించారు.

- జూపూడి శ్రీలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని