ముక్తిమార్గానికి నాలుగు సూత్రాలు

బ్రహ్మ సాక్షాత్కారం పొందిన సాధువు వచ్చాడని తెలిసింది ఆ దేశపు రాజుకు. అనేక కానుకలతో వెళ్లి ‘నాకు ముక్తిమార్గం ప్రసాదించండి స్వామీ!’ అన్నాడు. ‘నేనో నాలుగు సూత్రాలు చెబుతాను. వాటిని పాటిస్తే నీ కోరిక ఫలిస్తుంది నాయనా’

Updated : 27 May 2022 17:16 IST

బ్రహ్మ సాక్షాత్కారం పొందిన సాధువు వచ్చాడని తెలిసింది ఆ దేశపు రాజుకు. అనేక కానుకలతో వెళ్లి ‘నాకు ముక్తిమార్గం ప్రసాదించండి స్వామీ!’ అన్నాడు. ‘నేనో నాలుగు సూత్రాలు చెబుతాను. వాటిని పాటిస్తే నీ కోరిక ఫలిస్తుంది నాయనా’ అన్నాడు సాధువు. సరేనన్నాడు రాజు. ‘అమృతతుల్యమైన భోజనమే తినాలి. పువ్వులు పరచిన పక్క మీదే పడుకోవాలి. ఇనుపకోటలోనే జీవించాలి. సౌందర్యవతి అయిన భార్యతోనే కాలం గడపాలి’ అన్నాడు సాధువు.

‘ఇవన్నీ నేను అనుభవిస్తున్నవే కదా! మా వంటవాడు గొప్పగా వండుతాడు. నేను నిద్రించేది పరిమళాలు వెదజల్లే పూలపాన్పు మీదే. నివసిస్తున్నది దుర్భేద్యమైన ఇనుపకోట. ఇక నా పట్టపురాణి గురించి చెప్పాల్సిందేముంది.. చాలా అందమైంది. మీరు చెప్పిన ప్రకారం నాకు తప్పక ముక్తి లభిస్తుందన్నమాట’ అన్నాడు రాజు.

సాధువు నవ్వి ‘ఈ భోగభాగ్యాల గురించి కాదు నాయనా నేను చెప్పింది! కరకరలాడే ఆకలి వేసేవరకూ ఆగి అప్పుడు ఏది తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది. కఠోర శ్రమ తర్వాత రాతి మీద పడుకున్నా పూలపాన్పులా ఆనందాన్నిస్తుంది. యోగపురుషులతో సత్సంగం వల్ల వైరాగ్యం అలవడుతుంది. అదే నీ జీవితానికి పెట్టని ఇనుపకోట అవుతుంది. ధ్యానం చేయగా చేయగా సౌందర్యవతి అయిన ముక్తికాంత లభిస్తుంది. ఆ ఆనందానుభవం ఇక దేనితోనూ సరిపోలదు’ అన్నాడు సాధువు. రాజుకు జ్ఞానోదయం అయ్యింది. మర్నాడే పుత్రుడికి పట్టాభిషేకం చేసి తపోనిష్టలో మునిగిపోయాడు.

- బాల కౌసల్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని