బండెడు అన్నం తినమన్నాడు...

షిరిడి గ్రామపెద్ద వైద్యుడు కూడా. ఆయన సాయికి ఎవరూ బిక్ష వేయకూడదనే షరతు విధించాడు. కానీ అప్పాపాటిల్‌ భార్య బాయిజా అతని ఆజ్ఞను ధిక్కరించడంతో గ్రామాధికారి ఆగ్రహించాడు. ఆమె భర్తను ఇంటికి పిలిచి ‘నీ భార్య తీరు నాకు నచ్చలేదు.

Updated : 27 May 2022 17:15 IST

షిరిడి గ్రామపెద్ద వైద్యుడు కూడా. ఆయన సాయికి ఎవరూ బిక్ష వేయకూడదనే షరతు విధించాడు. కానీ అప్పాపాటిల్‌ భార్య బాయిజా అతని ఆజ్ఞను ధిక్కరించడంతో గ్రామాధికారి ఆగ్రహించాడు. ఆమె భర్తను ఇంటికి పిలిచి ‘నీ భార్య తీరు నాకు నచ్చలేదు. ఆమెకు సర్దిచెప్పుకుంటావో లేక నేను వడ్డించే షడ్రుచుల భోజనం తింటావో నిర్ణయించుకో! భోజనం మధ్యలో గనుక లేస్తే నువ్వు సాయిని గ్రామం నుంచి పంపించేయాలి’ అన్నాడు. సాయిని అమితంగా గౌరవించే పాటిల్‌ భోజనానికి కూర్చున్నాడు. బాయిజాకు బుద్ధి చెప్పడానికి గ్రామ పెద్ద పాటిల్‌కి 50 మంది తినేంత భోజనం వడ్డిస్తున్నాడు. పదార్థాలు వస్తూనే ఉన్నాయి. ఒక స్థాయిలో పాటిల్‌ తినలేకపోతుంటే అధికారి భార్య ఈ సంగతి బాయిజాకి చెప్పింది. ఆమె అదంతా సాయికి తెలియజేయగానే సాయి గ్రామంలో పిల్లలందరినీ పిలిచి తన జోలె నుంచి అనేక ఆహార పదార్థాలు తీసి పంచిపెట్టాడు. సాయి అలా చేయగానే అధికారి ఇంట్లో పాటిల్‌ వడ్డించినవన్నీ తినగలిగాడు. అతిగా తినడం వల్ల ఆ రాత్రి పాటిల్‌కు భరించలేని కడుపు నొప్పి వచ్చింది. బాయిజా వైద్యుడు కూడా అయిన అధికారి వద్దకు వెళ్లి ఔషధం ఇవ్వమని అడిగితే మర్నాడు రమ్మని కసిరి పంపేశాడు. దివ్యశక్తితో అధికారి మాటలు విన్నాడు సాయి. భర్తకు ఔషధం ఇవ్వమంటూ బాయిజా మరిది కాశీరాంను వెంటబెట్టుకుని సాయి దగ్గరకు వెళ్లింది. ‘ఔషధాలను మించిన శక్తి మంత్రాలకు ఉంది. ఆధునికులు కొందరికి నేను చెప్పేది అంధవిశ్వాసంగా కనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. రోగికి ప్రాణం మీదకు వచ్చినపుడు వైద్యుడు మందు లేదని, ఇవ్వనని, మర్నాడు రమ్మని చెప్పకూడదు. జాతి, మత, కుల, ఆర్థిక వివక్షతలు వైద్యంలో కూడదు’ అన్నాడు. తర్వాత రాత్రంతా జ్ఞానేశ్వరి మంత్రం చదవమని, ఔషధంతో పనిలేదని చెప్పాడు. ఆమె అలాగే చేసి భర్తకు స్వస్థతను చేకూర్చింది. 

           - పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని