మరీ అంత శాంతమా!

తమిళకవి తిరువళ్లువర్‌ మహాజ్ఞాని, అహింసామూర్తి. గాంధీజీ వళ్లువర్‌ జీవితంలో ఒక యదార్థ సంఘటన చదివిన తర్వాతే అహింసా సిద్ధాంతాన్ని తన పోరాటానికి మూలసూత్రంగా మార్చుకున్నారంటారు. ఆ కథేమిటంటే తిరువళ్లువర్‌ కష్టజీవి. ఎందరో రాజులు

Published : 31 Mar 2022 05:10 IST

మిళకవి తిరువళ్లువర్‌ మహాజ్ఞాని, అహింసామూర్తి. గాంధీజీ వళ్లువర్‌ జీవితంలో ఒక యదార్థ సంఘటన చదివిన తర్వాతే అహింసా సిద్ధాంతాన్ని తన పోరాటానికి మూలసూత్రంగా మార్చుకున్నారంటారు. ఆ కథేమిటంటే తిరువళ్లువర్‌ కష్టజీవి. ఎందరో రాజులు ఆయనను తమ కొలువులో చేరమని కోరినా కాదని కులవృత్తి అయిన నేతపనినే నమ్ముకుని జీవిక సాగించాడు. అతను పరమశాంతమూర్తి అని తెలిసిన ఓ ధనిక యువకుడు ఆయనకు ఏదో రకంగా కోపం తెప్పించాలనుకున్నాడు. వళ్లువర్‌ను ఓ చీర ఖరీదు అడగ్గా ఆయన ఇరవై రూకలన్నాడు. యువకుడు చీరను రెండుగా చించి, ఒక ముక్క ధర చెప్పమన్నాడు. వళ్లువర్‌ కోపం తెచ్చుకోకుండా పది రూకలని బదులిచ్చాడు. యువకుడు అంతటితో ఆగక మరిన్ని ముక్కలుగా చేసి ఒకదాని ధర అడిగాడు. వళ్లువర్‌ శాంతంగా బదులిచ్చాడు. దాంతో యువకుడికి మతిపోయింది. పశ్చాత్తాపం చెంది ‘స్వామీ! మీరు నేసిన చీరను చింపి పోగులు చేసినా కోపం రాలేదేంటి?’ అనడిగాడు. ‘నాయనా! శాంతం నా స్వభావం, అసహనం నీ గుణం. ఎవరి లక్షణాన్ని వారు పాటించడమే కదా న్యాయం’ అన్నారాయన. యువకుడు విచలితుడై ‘మీలో ఇంతటి క్షమాగుణం ఎందుకు స్వామీ!? దీని వల్ల ఏం ప్రయోజనం?’ అన్నాడు. ‘సహనమే సత్యం. క్షమ, శాంతి జ్ఞానదీపాలు. ఆనందానికి హేతువులు. అవే అహంకారం, అసూయ వంటి అంధకారాలను తొలగించే దారిదీపాలు. లోకంలో సహనం కంటే గొప్పదేదీ లేదు. ద్వేషం అన్ని విధాలా నష్టమే చేస్తుంది. సహనశీలి నిర్మాణంపై దృష్టి పెడతాడు, అందుకు భిన్నమైన వాళ్లు విధ్వంసాన్ని సృష్టిస్తారు’ అంటూ చెప్పారు. యువకుడు సిగ్గుపడ్డాడు. సహనం గొప్పతనం ఎంతటిదో అర్థమై జ్ఞానోదయమైంది.

- గొడవర్తి శ్రీనివాసు, ఆలమూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని