నవరసభరితం రాముని చరితం

సవతి తల్లి అడవికి పంపితే ఒక్క క్షణం దుఃఖించలేదు, ఒక్క మాట అనలేదు. ఒక్కపెట్టున శివధనుస్సును విరిచి సీతమ్మను సొంతం చేసుకున్నాడు. పర స్త్రీవంక కన్నెత్తి చూడలేదు, ఇంకో పెళ్లి ఊసెత్తలేదు. గురి చూసి వేసే బాణం గమ్యం చేరాల్సిందే. ఒకటే బాణం.. ఒకటే భార్య.. ఒకటే లక్ష్యం..

Updated : 07 Apr 2022 00:35 IST

ఏప్రిల్‌ 10 శ్రీరామనవమి

సవతి తల్లి అడవికి పంపితే ఒక్క క్షణం దుఃఖించలేదు, ఒక్క మాట అనలేదు. ఒక్కపెట్టున శివధనుస్సును విరిచి సీతమ్మను సొంతం చేసుకున్నాడు. పర స్త్రీవంక కన్నెత్తి చూడలేదు, ఇంకో పెళ్లి ఊసెత్తలేదు. గురి చూసి వేసే బాణం గమ్యం చేరాల్సిందే. ఒకటే బాణం.. ఒకటే భార్య.. ఒకటే లక్ష్యం.. కనుకనే రాముడు దేవుడయ్యాడు. రామనామం పవిత్రమైంది. కొండను చిటికెనవేలు మీద మోయగల ఆంజనేయుడు నమ్మిన బంటయ్యాడు.
సర్వం రసమయం జగత్‌. జగత్తులోని సర్వ ప్రాణులూ రసమయ జీవితాన్ని ఆశిస్తాయి. అప్పుడే జీవించినట్లు.. లేదంటే కాలం గడిచినట్లు. ధర్మబద్ధమైన ఆదర్శ జీవనానికి నాటికీ నేటికీ ఎన్నటికీ మార్గదర్శి శ్రీరాముడు. జీవితంలోని ప్రతి క్షణాన్నీ.. అది విచారమైనా విషాదమైనా, సుఖమైనా కష్టమైనా, కంటికింపైనా కంటగింపైనా అనుభవించగలగాలి. అలాంటి జీవితం గడిపిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి.

శృంగార రామం నమో!
రామచంద్రమూర్తి వివాహానంతరం పన్నెండేళ్లు అయోధ్యలో సీతాసమేతంగా కాలం గడిపాడు. ఆ సందర్భాల్ని పండితులు సీతారామ సుఖజీవన సర్గగా భావించారు. స్కాందపురాణంలోనూ దీని ప్రస్తావన ఉంది. వారి సాన్నిహిత్యాన్ని వాల్మీకి సంస్కార వంతంగా అభివర్ణించారు. కాకాసుర ఘట్టంలో శిలాఫలకంపై సీతారాములు ఒకరి తొడపై ఒకరు తల పెట్టుకున్న రసమయ సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే సీతారాముల జీవితంలో సంభోగ శృంగారమే గాక వియోగ శృంగారమూ కనిపిస్తుంది. కొన్నిసార్లు దగ్గరగా, కుదరనప్పుడు విడిగా ఉన్నారు. ధర్మబద్ధ శృంగార జీవితాన్ని గడిపిన ఆదర్శ దంపతులు సీతారాములు.
హాస్యరామం నమో!
ఒకసారి సీతమ్మ ‘మీ రాజ్యంలో పాయసం తాగితే పిల్లలు పుడతారట కదా’ అని హాస్యమాడింది. ‘అదేమో గానీ, కొన్ని రాజ్యాల్లో పొలం దున్నుతుంటే కూడా పిల్లలు దొరుకుతారట తెలుసా’ అంటూ నవ్వాడు అందాల రామయ్య.

కరుణ రామం నమో!
దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవాః
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః
రామచంద్రమూర్తి కరుణకు పరాకాష్ఠ. ఈ మాటలు కాళ్ల పారాణి అయినా ఆరకుండా, భార్యను కూడా కాదనుకుని, తనకు సేవ చెయ్యడానికి వచ్చిన లక్ష్మణస్వామి రావణుని శక్తి ఆయుధానికి బలైపోయినప్పుడు, కరుణాసముద్రుడైన ఆ రామయ్య గుండెలోతుల్లోంచి తన్నుకువచ్చిన మాటలివి. ‘ఎవరికైనా భార్య తేలిగ్గానే దొరుకుతుంది. బంధువులు చాలామందే ఉంటారు. కానీ నీలాంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు?’ అంటూ గుండెలు అవిసేలా దుఃఖించిన కరుణరసమూర్తి మన రామయ్య.

రౌద్ర రామం నమో!
అరిషడ్వర్గాలు అదుపులో ఉంచుకున్న రామయ్య తండ్రికి కోపం రాదట! అవసరమైనప్పుడు తనే కోపాన్ని ఆహ్వానిస్తాడట! సీతను అపహరించిన, రావణునితో పోరాడుతున్న ఘట్టాల్లో స్వామి కోపాన్ని ఆహ్వానించాడట! రావణుడు తనతో తలపడలేక తనను భుజాలపై ఎక్కించుకుని, హనుమంతుణ్ణి తన బాణాలతో బాధించినప్పుడు రామయ్య కోపం ద్విగుణీకృతమైందట! తనకు జరిగిన హాని కంటే, ఆశ్రయించిన వారికి హాని జరిగితే సహించని ఆశ్రిత జనరక్షకుడు రామయ్య.

వీర రామం నమో!
రాముని వింటినారిని తెంచగలిగిన ఖరునివంటి 14 వేలమంది రాక్షసుల్ని అతి స్వల్ప కాలంలో సంహరించిన పరాక్రముడు రామచంద్రమూర్తి. ఇంద్రాది సకల దేవతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రావణుడు స్వామి శౌర్యానికి తట్టుకోలేక దీనంగా చూస్తే...
గచ్ఛానుజానామి రణార్థితస్త్వం
ప్రవిశ్య రాత్రించరరాజ! లంకాం
ఆశ్వాస్య నిర్యాహి రథీ చ ధన్వీ
తదా బలం ద్రక్ష్యసి మే రథస్థః
‘ఫో! రాక్షసరాజా! అలసట తీర్చుకో! కొత్త రథం, కొత్త ఆయుధాలు తీసుకురా ఫో!’ అంటూ శత్రువుకు కూడా ప్రాణభిక్ష పెట్టిన అత్యంత పరాక్రమవంతుడైన వీరుడు రాముడు.

భయానక రామం నమో!
భయానక రాముడంటే రామయ్యలో భయం, రామయ్య వలన భయం. రాముడు తనకోసం కాక తనవారి కోసం భయపడిన ఘటనలు లేకపోలేదు. సీతాపహరణంలో, యుద్ధ రంగంలో ఇంద్రజిత్తు మాయాసీతను జుట్టుపట్టుకు లాక్కొచ్చి నరికినప్పుడు, సీత పట్ల రామునికున్న అనురాగం భయంగా వ్యక్తమైంది. ఇక యుద్ధరంగంలో రాముని పరాక్రమం చూసి గడగడలాడిన రావణుడికి భయప్రదాత (భయం కలిగించినవాడు)గా, తనను శరణు వేడిన దుష్ట కాకాసురుడికి భయత్రాత (భయం నుంచి రక్షించినవాడు)గా నిలిచాడు శ్రీరాముడు.
బీభత్స రామం నమో!
గగనం గగనాకారం సాగర స్సాగరోపమః
రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ
భయానక సమరంలో రామచంద్రుడు తన పరాక్రమంతో రాక్షసుల్ని సంహరించిన తర్వాత అక్కడ తెగిపడిప తలలు, కాళ్లు, చేతులు, చెల్లాచెదురుగా పడి ఉన్న మాంసఖండాలు, ఏరులై పారిన రక్తంతో బీభత్సావహంగా మారిపోయింది. రామయ్య ధర్మాగ్రహం యుద్ధరంగంలో ప్రతిఫలించింది.

అద్భుత రామం నమో!
తే తు రామ సహస్రాణి రణే పశ్యంతిరాక్షసాః
పునఃపశ్యంతికాకస్త్వం ఏకమేవ మహావహే
రావణుడు తన సైన్యాన్ని మూకుమ్మడిగా పంపినప్పుడు రాముడు అద్భుత గంధర్వాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావంతో ప్రతి రాక్షసుడి ముందు ఒక్కో రాముడిగా ప్రత్యక్షమయ్యాడు. అలానే తనకు దారి ఇవ్వని సముద్రుడిపై కోపాన్ని తెచ్చుకుని
చాపమానయ సౌమిత్రే సముద్రం శోషయిష్యామి
అనగానే అంతటి సముద్రుడూ రాముని ముందు మోకరిల్లాడు.

శాంతరామం నమో!
దండకారణ్యంలోని ముని గణం ‘నీ సోదరుడితో కలిసి మమ్మల్ని ఆ రాక్షసుల బారినుంచి రక్షించు రామయ్యా’ అనగానే ‘నేనే వచ్చి మిమ్మల్ని రక్షించాల్సిందిపోయి మీరు వచ్చి అడిగేంతవరకూ ఆలస్యం చేసినందుకు సిగ్గుపడుతున్నాను’ అంటూ కార్యమగ్నుడైన శాంతమూర్తి రామయ్య. రేపు ఉదయం పట్టాభిషేకం అని చెప్పి అర్ధరాత్రి పిలిచి అరణ్యవాసానికి వెళ్లమన్నాఉద్వేగాలకు లోనవని స్థితప్రజ్ఞుడు. అలాంటి రసస్వరూపుడైన సీతారామచంద్రమూర్తి మనల్ని అనుగ్రహించుగాక!

- డా.కె.కరుణశ్రీ

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని