ఆంజనేయుడు సంచరించే గుడి

దుష్టగ్రహ బాధలను తొలగించి.. అభయమిచ్చే హనుమంతుడు.. నెట్టికంటి ఆంజనేయుడిగా కొలువైన ప్రాంతమే అనంతపురం జిల్లా కసాపురం క్షేత్రం. నెట్టికంటి అంటే నేరుగా చూసేవాడు. విగ్రహం ఒక వైపుకు తిరిగి ఉండటంతో స్వామి కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. స్థల పురాణాన్ని అనుసరించి

Updated : 07 Apr 2022 00:37 IST

దుష్టగ్రహ బాధలను తొలగించి.. అభయమిచ్చే హనుమంతుడు.. నెట్టికంటి ఆంజనేయుడిగా కొలువైన ప్రాంతమే అనంతపురం జిల్లా కసాపురం క్షేత్రం. నెట్టికంటి అంటే నేరుగా చూసేవాడు. విగ్రహం ఒక వైపుకు తిరిగి ఉండటంతో స్వామి కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. స్థల పురాణాన్ని అనుసరించి కృష్ణదేవరాయల వారి గురువైన వ్యాస రాయలు దేశ సంచారం చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. ఆయనకు వాయు నందనుడు కలలో కనిపించి ‘నువ్వున్న ప్రదేశం నుంచి దక్షిణ వైపున ఎండిపోయిన వేప చెట్టు కనిపిస్తుంది. నువ్వు వెళ్లగానే అది చిగురిస్తుంది. అక్కడ నాకు ఆలయం కట్టించు’ అన్నాడు. వ్యాస రాయలు అక్కడికి చేరుకుని ఆ చెట్టు కింద తవ్వించగా హనుమంతుడి విగ్రహం బయటపడింది. వెంటనే స్వామి వారికి ఆలయం నిర్మించాడు.
రాత్రి సమయంలో ఈ క్షేత్రంలో ఆంజనేయస్వామి సంచరిస్తాడనే విశ్వాసంతో ఎప్పటికప్పుడు కొత్త పాదరక్షలు ఏర్పాటు చేస్తారు. అది నిజమని నిరూపిస్తూ స్వామివారి పాదరక్షలు అరిగి పోయినట్లుగా, తెగినట్లుగా కనిపిస్తాయి. ఏటా వైశాఖ, శ్రావణ, కార్తిక, మాఘ మాసాల్లో శనివారం నాడు స్వామికి విశేష పూజలు జరుగుతాయి. వేలాదిమంది భక్తులు ఆంజనేయ స్వామి మండల, అర్ధమండల దీక్షలు తీసుకుంటారు. భక్తిశ్రద్ధలతో పూజించి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే బాధలూ పీడలూ తొలగుతాయని నమ్ముతారు. ఏటా రామనవమి, హనుమాన్‌ జయంతి తదితర పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. మన రాష్ట్రం నుంచే కాక.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రామబంటు హనుమంతుని దర్శించుకుంటారు. గుంతకల్లు నుంచి 5 కి.మీ దూరంలో ఉండే కసాపురానికి బస్సు, ఆటోల్లో చేరుకోవచ్చు.

- ఎ.దివ్యజ్యోతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని