అన్నీ బ్రహ్మమే

‘అరుణాచలం ఒక కొండ. దాన్ని మీరు శివుడు అంటారేంటి?’ అని రమణులను ఒకరడిగారు. ‘నువ్వు ఎవరు? నీ లోపల ఉన్నదెవరు?’ అని ఎదురు ప్రశ్నించారు రమణ మహర్షి. దానికి అతను ‘నేను దేహాన్ని, నాలో ఉన్నది దానికి భిన్నమైన ఆత్మ’ అన్నాడు. ‘అయితే మీరిద్దరూ వేరు వేరు అంశాలు అయినపుడు

Published : 07 Apr 2022 01:07 IST

‘అరుణాచలం ఒక కొండ. దాన్ని మీరు శివుడు అంటారేంటి?’ అని రమణులను ఒకరడిగారు. ‘నువ్వు ఎవరు? నీ లోపల ఉన్నదెవరు?’ అని ఎదురు ప్రశ్నించారు రమణ మహర్షి. దానికి అతను ‘నేను దేహాన్ని, నాలో ఉన్నది దానికి భిన్నమైన ఆత్మ’ అన్నాడు. ‘అయితే మీరిద్దరూ వేరు వేరు అంశాలు అయినపుడు అరుణాచలం కొండ శివుని దేహం, అందులో ఉన్నది శివుని ఆత్మే అని ఎందుకు అర్థం చేసుకోవు?’ అన్నారు. ‘అలాగైతే ప్రతి కొండా దేవుడే అవ్వాలి. కానీ కేవలం అరుణాచలం కొండే శివుడని ఎలా చెబుతారు?’ అన్నాడతడు. ‘అరుణాచలమంటే అర్థం నీలో ఆత్మ రూపంలో ప్రకాశిస్తున్న ప్రాణ జ్యోతి. కనుక జీవులన్నీ అరుణాచల రూపాలే, బ్రహ్మ స్వరూపాలే. అలాగే నీకు నిజమైన శక్తి ఉంటే ప్రతి కొండనూ అరుణగిరిగా చూడగలవు. ఈ శక్తినే ఉపనిషత్తులు ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్నాయి. అంతేకాదు, ఆకారం ఉన్నవీ లేనివీ కూడా బ్రహ్మ పదార్థాలే. అందుకే మనం మామూలు రాయిని విగ్రహంగా మలచి పూజిస్తున్నాం. దేవుడు మన కంటే వేరు కాదు. మనం ఆయన కంటే భిన్నులం కాదు. నువ్వు-దైవం వేరు అనే ద్వైత భావన వదిలి అద్వైతంలోకి మళ్లడం వల్ల ఆయన శక్తి, దయ మనలోకి ప్రవేశిస్తాయి. బ్రహ్మం-ఆత్మ-నువ్వు మూడు భిన్నమైన రూపాలు కానే కాదు. అన్నీ ఒక్కటే. బాహ్య ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్లో దాగిన దైవ శక్తిని గమనించడం అలవాటైతే అన్నీ-అంతా బ్రహ్మమనే అద్భుత భావన కలుగుతుంది. ఈ ముగ్గురూ ఒకటి కాదు అని ఎప్పుడు భావిస్తామో అప్పుడు దేవుణ్ణి చూడలేకపోతున్నామనే నిరాశలోకి జారిపోతుంటాం’ అంటూ వివరించారు మహర్షి.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని