Updated : 21 Apr 2022 03:39 IST

ధ్యానం.. జీవన యానం

దైనందిన జీవితంలో ఇంటా బయటా ఎన్నో బంధాలూ, బాధ్యతలూ... మనుగడకి ఇవన్నీ అవసరమే. కానీ అవి ఒత్తిడి పెంచకూడదు. అలాగే నా ఉనికి.. నా శరీరం.. నా మనసు.. నాలో పొంగే జీవచైతన్యం- ఇలా ‘నేను’ గురించిన తపనతో, తాపత్రయంతో ఆందోళన చెందుతుంటాం. ఆవేదన, ఆక్రోశం కూడా కలుగుతుంటాయి. వాటికి  విరుగుడు ధ్యానమేనన్నారు నాటి  మహర్షుల దగ్గరి నుంచి నేటి మేధావుల వరకూ..

మనమంతా ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ, రోజువారీ పనుల్లో మునిగిపోతాం. లోకంలో దేన్నయినా సాధించడానికి ఉపయోగపడే పనిముట్లుగానే మనసు, శరీరాలను చూస్తాం. ఏదైనా జబ్బుచేస్తే తప్ప వాటిని పట్టించుకోం. అవంటే లెక్కేలేదు. అలా మనం జీవిత కేంద్రం నుంచి దూరంగా జరిగిపోయి, ప్రాపంచిక కార్యకలాపాల్లో మునిగిపోతున్నాం. ‘నేనేదో సాధించాను, నేను గొప్ప’ అని ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతాం. 

దేన్నయినా అనుభూతించాలంటే మొదట దాన్ని గమనించాలి! అలా గమనించాలంటే మనకీ, ఆ అంశానికీ భేదం, దూరం ఉండాలి! అప్పుడు మనకి మనమే ఒక సాక్షిగా మారి మన అస్తిత్వాన్ని నిశితంగా గమనిస్తాం. అదే ధ్యాన ప్రక్రియ. మన శరీర స్పందనలూ, మనసులో మెదిలే ఆలోచనలూ, మనసూ శరీరాలను కలిపే వారధి లాంటి శ్వాసనీ, ఎరుకతో గమనించడమే ధ్యానం. అలా మన సన్నిధిలో మనం ఉండటమే ధ్యాన స్థితి. మంచీచెడుల చీటీలు, ప్రియం అప్రియం అనే ఎంపికలు లేకుండా జరిగే సాక్షీమాత్రపు పరిశీలనే ధ్యానంలో కీలకం. ఒక్కమాటలో చెప్పాలంటే ఎంచకుండా గమనించడమే ధ్యానం. 

ధ్యాన సాధనతో ఒరిగేదేమిటని చటుక్కున ప్రశ్నిస్తుంది మనసు. డబ్బు, కీర్తి, హోదా, అధికారం లాంటివేమైనా వస్తాయేమో అనే ఆరాటం ఉంటుంది- ఆ ప్రశ్న వెనుక. నిజానికి, ధ్యాన సాధన వలన కలిగే ఫలితాలను మనకు తెలిసిన, ప్రాపంచిక కొలమానాలతో అంచనా వేయలేం. ధ్యానం వల్ల మన అస్తిత్వానికి సంబంధించిన ఎరుక మెరుగవుతుంది. దైనందిన హడావుడి నుంచి ఆశించిన కేంద్రం వైపుకు మనల్ని మళ్లించే ప్రక్రియ మొదలవుతుంది. గతం ఒక జ్ఞాపకం. భవిష్యత్తు ఒక ఊహ. ఏదీ వాస్తవం కాదు. ఈ అవగాహన గనుక ఉంటే గడుస్తున్న క్షణం మాత్రమే వాస్తవమనీ, అసలు జీవితమంటే ప్రస్తుత క్షణమనీ ఇట్టే బోధపడుతుంది. అలా మనల్ని ప్రస్తుతంలో ఉంచటమే ధ్యాన సాధన వల్ల ప్రయోజనం.

ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే గుణాన్ని మనలో చాలామందిమి కోల్పోయాం. ఒక వ్యక్తిని సహచర జీవిగా చూడటానికి బదులు వారి పేరు, ప్రాంతం, జాతీయత, హోదా, వారి వల్ల కలిగే ప్రయోజనం- ఇన్ని చీటీలు తగిలించి చూస్తాం. ఆఖరికి మనల్ని మనం కూడా భార్య లేదా భర్తగా, తల్లి లేదా తండ్రిగా, అధికారిగా, వ్యాపారిగా.. ఇలా ఆయా పాత్రల్లోనే చూస్తాం, అలాంటి గుర్తింపే పొందుతాం. ఇక దేవుడి విషయానికొస్తే అసలైన దైవత్వభావన మాయమై, భిన్న రూపాల్ని కల్పించి, విభిన్న పేర్లు పెట్టుకున్నాం. మానవాళినే మతాల వారీగా విభజించేశాం. ఒక వస్తువులోని నిజమైన విలువను గుర్తించడం, ఆస్వాదించడం మర్చిపోయాం. ప్రతిదాన్నీ ధన రూపంలో బేరీజు వేస్తూ, సమాజ సౌకర్యంగా సృష్టించుకున్న కాగితపు డబ్బుపై మమకారం పెంచుకున్నాం. ప్రాణాధారమైన భూమిని సైతం భూమిగా గాక దేశాలు, విభజన రేఖల చిత్రపటంగానే చూస్తాం. 

ధ్యానం వల్ల ఈ పాత్ర పోషణలూ, గుర్తింపు చీటీల చట్రం నుంచి మనల్ని తప్పించి, ఉన్న దాన్ని ఉన్నట్టుగా చూడగలుగుతాం. ఇవన్నీ మాటలుగా అర్థమవడం ఒక స్థాయి. ఆ అవగాహన మన స్వభావంలో ఇంకడం రెండో స్థాయి. ఆ అనుభవం మన దైనందిన జీవితంలో ప్రతిఫలించడం అసలైన అంతిమ స్థాయి. ధ్యానంతో అది సాధ్యమై జీవితంలో ఒక కొత్త కోణం ఆవిష్కృతమౌతుంది. అనవసర భయాలు, ఆందోళనలూ మాయమవుతాయి. అతిగా మాట్లాడటానికి అలవాటుపడిన మనసు తేలికపడుతుంది. మానసిక ప్రశాంతత ధ్యానసాధనకు తక్షణ ఫలితమైతే, మానవ సంబంధాలు మెరుగవడం, రోజువారి పనుల్లో నాణ్యత, ఉద్యోగంలో సమర్థత- ఇవన్నీ నెమ్మదిగా వాటంతట అవే ఒనగూరుతాయి. ఇప్పటివరకూ మనల్ని శాసించిన మనసు మన అధీనంలోకి వస్తుంది. నిజంగా ‘నేను’ ఎవరో అర్థమౌతుంది. ఫలితంగా అహం నశిస్తుంది. అసలైన ఏకాంతం, నిశ్శబ్దం సిద్ధిస్తాయి. అలాగే విశ్వజనీన ప్రేమ, కరుణ, సృజనాత్మకత లాంటివి వృద్ధిచెందుతాయి. జంతువులూ, చెట్లలానే- జీవించడం తప్ప జీవితానికి మరో లక్ష్యం లేదనే కీలక విషయం తెలుస్తుంది. ప్రకృతికి అనుగుణంగా, అతి సరళంగా జీవించడమే అత్యున్నత జీవితమని అర్థమౌతుంది. చేసే ప్రతి పనిలో ఎరుక తోడవటాన మనమేం చేసినా అది ధ్యానమే అవుతుంది.    

నిజానికి ధ్యానం అనే విత్తును నాటడమే మనం చేయాల్సింది. అది మొలకెత్తడం, పెరిగి పెద్దవడం, దానికి ప్రేమ, కరుణ లాంటి అందాల పూలు పూయడం మన చేతుల్లో లేనివీ, వాటంతటవే జరిగే అద్భుతాలు. ఈ విధంగా ఆలోచించినప్పుడు మన జీవన సహజస్థితి ధ్యాన స్థితే అనీ, దీనికి మతవిశ్వాసాలతో, దేవుడితో సంబంధం లేదనీ స్పష్టమవుతుంది. ‘జీవన యానమే ధ్యానం’ అన్న సిసలైన సత్యం బోధపడుతుంది.

- ఈదర రవికిరణ్‌  


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని