Published : 05 May 2022 01:06 IST

సర్వాతీతం అమ్మ

మే 8 మాతృ దినోత్సవం

అమ్మకు నిర్వచనం అమ్మ. అమ్మకు ప్రతీక అమ్మ. అమ్మ ఒడిలో బ్రహ్మ సైతం ఆటలాడిన వాడే. అమ్మ ఆకాశం. అమ్మ ధరణి. అమ్మ చిన్మయ స్వరూపం. అమ్మ ఆనంద నందన వనం. అమ్మ ప్రేమ అనంతం. అమ్మ సన్నిధి ఎల్లలు లేని సంతోషాల పెన్నిధి.

రెండు బీజాక్షరాలు కలిసి అమ్మ పదం ప్రభవించింది. అణువులో దాగిన శక్తి అమ్మ స్వరూపమే. బ్రహ్మాండంగా ఎదిగిన శక్తి అమ్మే. పరీక్షించబోయి బోల్తాపడిన సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు, అమ్మదనాన్ని కమ్మగా అనసూయ మాత రూపంలో అనుభవించిన వారే. అమ్మ తర్వాత మరో ముగ్గురు మాతలున్నారు మనకు... భూమాత, దేశమాత, గోమాత.

అమ్మ వేదం. సుస్వర నాదం. అమ్మ దిక్పాలకులను తలదన్నే దిక్సూచి. అమ్మ మహాసముద్రంలో తీరానికి చేరుకునే ఒంటరి నావ. అమ్మ జగత్తు. అమ్మ ప్రకృతి. విశ్వ పాలనా, పోషణా చూసే దివ్య దైవ ప్రతినిధి.
‘అమ్మ పరబ్రహ్మ స్వరూపం. ఆమె రుణం ఎన్నటికీ తీర్చుకోలేవు’ అంటోంది వేదం. అమ్మను శక్తి స్వరూపిణిగా వర్ణించింది రుగ్వేదం. అన్నం పెట్టే అన్నపూర్ణ తత్వాన్ని విశ్వమాత అయిన పార్వతికే విడిచిపెట్టేశాడు శివుడు.

అమ్మ దగ్గర సేదతీరినట్లుగా మరెక్కడా కుదరదు. అమ్మ అనే పదంలోనే అంతులేని సౌందర్యం ఉంది. అందుకే ఆదిశంకరులు ‘సౌందర్య లహరి’ పేరుతో అమ్మ శక్తియుక్తులను అక్షరబద్ధం చేశారు.

మన ప్రాచీన కవి పండితులు అమ్మ గొప్పతనాన్ని ఆయా సందర్భాల్లో వేనోళ్ల పొగిడారు.

సర్వతీర్థమయీ మాతా సర్వదేవమయః పితా

మాతరం పితరం తస్మాత్‌ సర్వయత్నేన పూజ్యేత్‌

                        - పద్మపురాణం

అమ్మ సర్వ పుణ్య తీర్థాలకూ ప్రతీక, నాన్న సకల దేవతల అవతార రూపం. కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రాణప్రదంగా పూజించుకోవాలనేది ఈ శ్లోక భావం.

నాస్తి మాతృసమా ఛాయా నాస్తి మాతృసమా గతిః

నాస్తి మాతృసమం త్రాణం నాస్తి మాతృసమా ప్రాపా

                      - స్కంద పురాణం

అమ్మను మించిన నీడ ఎక్కడా లేదు, అమ్మను మించిన రక్షణ మరెక్కడా దొరకదు. అమ్మ కంటే ఆదరించేవారు, జవజీవాలనిచ్చేవారు ఈ లోకంలో ఇంకొకరు ఉండరని ఈ శ్లోకానికి అర్థం.

శ్రీరాముణ్ణి కన్న కౌసల్యాదేవి మాతృత్వానికి ప్రతీక. ఆమె తన కొడుకులకు, కోడళ్లకు సమానమైన ప్రేమ పంచి ఇచ్చింది. రాముణ్ణి అడవికి పంపడానికి కారణమై, కుటుంబ బంధాలు విచ్ఛిన్నం చేసిన కైకేయిని కూడా క్షమించింది. బాధలో ఉన్న భరతుణ్ణి ఓదార్చింది. తన అన్న నిర్దేశించిన మార్గంలో ప్రజలను జనరంజకంగా పాలించాలని చెప్పింది. క్షమా గుణంలో కౌసల్యాదేవిని మించిన తల్లి లేనే లేదు. పార్వతి, సుమిత్ర, సీత, శకుంతల, దేవకి, యశోద, కుంతి తదితర మాతృమూర్తులు ఆ కోవలోకి వచ్చే వారే.

అమ్మ అంటే ఓ అనుభూతి. ఓ అనుబంధం. ఓ ఆప్యాయత. ఓ ఆత్మీయత. మాధుర్యంలో అమ్మ లాలిపాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా ప్రేమగా ఆలపించి నిద్రపుచ్చగలడు?

‘మనం ప్రేమ లోంచి పుట్టాం. ఆ ప్రేమే తల్లి’ అంటాడు ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త జలాలుద్దీన్‌ రూమీ. ‘మనం ఎలా బతకాలో తెలిపే జీవన గ్రంథం మన దగ్గర లేదు. ఫర్వాలేదు. భయం లేదు. అమ్మ ఉంది’ అంటాడు మరో తత్వవేత్త. తల్లి ఎవరి స్థానాన్ని అయినా భర్తీ చెయ్యగలదు. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చెయ్యడం అసాధ్యం.

పురాణాల ప్రకారం... మాతృ స్వరూపమే ఆదిశక్తి. అంటే ‘మొదటి శక్తి’ అని అర్థం. ఇది ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండే ఆదిమ శక్తి. ఈ శక్తి కారకం స్త్రీ రూపంలో ఉంది. శక్తి అనేది ఒక భావన లేదా విశ్వంలో అన్ని జీవులకు ఊపిరినిచ్చే దివ్య సృజనాత్మక స్త్రీ లింగరూపధారిణి. సృష్టి అంతటికీ బాధ్యత వహించేది. విశ్వంలో జరిగే అన్ని మార్పులకూ ప్రతినిధిలా ఉంటుంది. సమస్త జీవకోటిలో కుండలిని శక్తి రూపంలో ఉంది. ఇది నిగూఢ ఆత్మస్వరూపత్వం గల శక్తి. ఈ శక్తి స్వతంత్రురాలు అయినప్పటికీ విశ్వంతో పరస్పరాధీనత గలది. ఆదిశక్తి రూపంలో ఉన్నది అమ్మే! మహిళలందరూ ఆ పరాశక్తి ప్రతిరూపాలే. అది మహామాతృత్వం! ఎందుకంటే మహిళల్లో సృష్టించగల శక్తి ఉంది. స్త్రీలు లేకుండా సృష్టి కొనసాగదు. జీవకోటి అంతా ఆమె నుంచే ఉద్భవిస్తుంది, తిరిగి ఆమెలోనే లీనమవుతుంది. అమ్మకు వందనం.

- జియో లక్ష్మణ్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని