కలుగు జయములు నిను శరణన్న
మే 25 హనుమజ్జయంతి
కొండను ఎత్తిన మహా బలశాలి రాముడి బంటయ్యాడు. సీతమ్మ జాడ కనిపెట్టేందుకు సముద్రాన్ని అవలీలగా దాటేశాడు. కోపంతో లంకని దహించాడు. గుండెను చీల్చి రామభక్తిని నిరూపించాడు. శక్తి, యుక్తి, ఆసక్తి, అనురక్తి అన్నీ ఉన్న పవన సుతుడు యుగ యుగాలుగా ఆరాధనలందుకుంటున్నాడు. ఆ సామర్థ్యాలను అలవరచుకుంటే ఆశించినవన్నీ సుసాధ్యమే!
బలమైన వ్యక్తి గుండె ధైర్యంతో ముందుకు సాగిపోతాడని హనుమ ఉదంతాలు స్పష్టం చేశాయి. స్థిరచిత్తత, సమర్థతలను హనుమ నుంచి నేర్చుకోవాలి. రామభక్తిలో సంపూర్ణత సాధించడం ఆదర్శమైతే స్వామిసేవలో నిమగ్నమవడం లక్ష్యం. హనుమలా శక్తిని కవచంగా యుక్తిని ఆయుధంగా ధరిస్తే ఎవరికైనా విజయం తథ్యం.
లంకను భయంతో వణికించి, అక్ష కుమారుని చంపి, సీతను కనుగొన్న హనుమను వాల్మీకి కర్మయోగిగా, కార్య శూరునిగా, మహావీరుడిగా వర్ణించాడు. ఈ మూడు లక్షణాలను మనం అలవర్చుకోవాలన్నది కవి సందేశం. శత్రు సోదరుడైన విభీషణుడి పట్ల సానుభూతి చూపాడు. ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తే మరిన్ని గురుతర బాధ్యతలు వెతుక్కుంటూ వస్తాయనడానికి హనుమకు ప్రాప్తించిన ‘భవిష్యబ్రహ్మ’ పదవే నిదర్శనం. తన కార్యశూరత్వంతో సీతారాముల తర్వాత అంతటి స్థానం పొందాడు.
కిష్కింద, సుందర, యుద్ధ కాండాలను లోతుగా అర్థం చేసుకుంటే ఎవరితో, ఎక్కడ, ఎలా మాట్లాడాలనే కళ వంటపడుతుంది. మాటలో మన్నన, చేతలో నిజాయితీ చూపిన హనుమ రామ ప్రేమకు పాత్రుడయ్యాడు. మాటలూ చేతలతోనే అభ్యున్నతి సాధ్యం కనుక మారుతి మనకు ఆదర్శం.
శక్తి - యుక్తి
నూరు యోజనాల సముద్రాన్ని దాటడం అగ్ని పరీక్షే. భీకర కెరటాలనో, భయానక లోతునో చూసి వెరవక దాన్ని అలవోకగా దాటాడంటే గడ్డు సమస్యలను అధిగమించాడని. పరీక్షలు రాసే విద్యార్థులకు, భవసాగరాన్ని ఈదే పెద్దలకూ రామబంటు ఆదర్శం. అంతేనా.. మైనాకుడి ఆతిథ్యాన్ని సున్నితంగా వద్దనడం, సరమను తెలివిగా తప్పించుకోవడం, సింహికను ఓడించడం అనేవి సీతాన్వేషణలో మారుతి ఎదుర్కొన్న పెను పరీక్షలే.
ముందుచూపు
అప్పగించిన పనితోబాటు అనుబంధంగా ఇతర పనులూ చక్కబెట్టడం సమర్థుల లక్షణం. అక్షయ కుమారుని, ఇతర సేనానులను, మంత్రులను హనుమ చంపడం. యుద్ధం చేసేముందు హనుమ శత్రువుల యుద్ధ నైపుణ్యాన్ని, శైలిని, వారి ఆయుధాలను పరిశీలించడం ఎంతగానో ఉపకరించింది. ఆ ముందుచూపు ఉంటేనే పురోగతి సాధ్యం.
మారుతి నిజాయితీ
శత్రువులైన అక్ష కుమారుడు, ఇంద్రజిత్తుల యుద్ధ కౌశలాన్ని పొగడటం, రావణుడి అందాన్ని మెచ్చుకోవడం హనుమ నిరహంకారానికి మచ్చుతునకలు. అలాగే తన పొరబాట్లను నిర్భయంగా ఒప్పుకోవడం నిజాయితీకి సూచన. క్షణికావేశంతో లంకను తగులబెట్టినపుడు హనుమ తన తప్పును గుర్తించి తక్షణం కోపాన్ని అదుపు చేసుకున్నాడు. ధర్మబద్ధమైన ఆగ్రహం కూడా నష్టాన్నే కలిగిస్తుందనేది సూచన.
వానర సామర్థ్యం గురించి సీతమ్మ అడిగితే ‘అమ్మా సైన్యంలో శక్తిహీనులను ముందుగా కార్యంలోకి దించుతారు. తక్కువ శక్తి కలిగిన నేనే మహా సముద్రాన్ని దాటానంటే.. మిగిలిన వీరుల శక్తిని మీరే ఊహించండి’ అంటూ తనగురించి తక్కువగా చెప్పి, ఇతరులను పొగిడాడు. ఈ వినయాన్ని మనం అలవర్చుకోవాలి.
బాధ్యతను నిర్వర్తించడం, వినయవిధేయతలు, శాంతీసహనం, మాట నిలబెట్టుకోవడం, శక్తిసామర్థ్యాలను గుర్తుచేసుకుంటూ ఎదురైన పరీక్షను తట్టుకోవడం, నిరాశానిస్పృహలను మొగ్గలోనే తుంచేసి లక్ష్యం దిశగా సాగిపోవడం, ఎదుటివారి గొప్పతనాన్ని గుర్తిస్తూనే చొరవ తీసుకుని పనిచేయడం, మనసెరిగి మాట్లాడటం, ఆత్మస్తుతి పరనిందలు లేకపోవడం, సమస్యలు పరిష్కరించే నేర్పు, పరోపకారం, తప్పుచేస్తే ఒప్పుకోవడం- ఇదీ హనుమ వ్యక్తిత్వం. మనం అనుసరించి తరించాల్సిన మార్గం.
మిత్రులకిచ్చిన మాట
పదవీ మోహంలో ఉన్న సుగ్రీవుడు రాముడికిచ్చిన సీతాన్వేషణ మాటను మరిచాడు. అది గమనించిన హనుమ ‘ప్రభూ! రాముడి వల్ల మీకు రాజ్యం లభించింది. మిత్ర ద్రోహం తగదు. రాముడు వచ్చి అడగక ముందే సీత జాడ కనిపెట్టేందుకు బయల్దేరండి. రాజు ధనాగారాన్ని కాపాడుకున్నట్టుగా మిత్రులకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ హితబోధ చేశాడు.
లక్ష్యసాధనే ధ్యేయం
సీత జాడ తెలియని తరుణంలో ఆమె లంకలో ఉండి ఉంటుందని హనుమకు చెప్పాడు సంపాతి. అకుంఠిత దీక్షతో సాగితే ఎదురుచూడని సాయం అందుతుందని నిరూపిస్తుందీ ఉదంతం. సముద్ర లఘన సమయంలో జాంబవంతుడు ‘మారుతీ! నువ్వు దేశకాలాలు ఎరిగినవాడివి’ అన్నాడు. భౌగోళిక విజ్ఞానం, వాతావరణ స్థితిగతుల పరిజ్ఞానం ఉంటే లక్ష్యసాధన సులువవుతుందనే పరోక్ష సందేశమది.
హనుమ బ్రహ్మచారేనా?
ఇది పలువురి సందేహం. సూర్య పుత్రిక సువర్చల హనుమ అర్ధాంగి అని అగస్త్య సంహిత పేర్కొంది. సువర్చల అనేది సూర్యుని ఉపరితల తేజస్సని, తేజమంటే జ్ఞానం కనుక సూర్యుని గురువుగా భావించే హనుమ ఆ జ్ఞానాన్నే భార్యగా పొందాడని పరాశర సంహిత వివరించింది.
శక్తివంతమైన ఆయుధం
హనుమ గదాయుధం పేరు ‘గజ్జము’. దీన్ని కుబేరుడు హనుమకు ఇవ్వగా దానిలో వరుణుడు తన శక్తిని నింపాడు. సాధారణ స్థితిలో బరువే ఉండని ఈ గద శత్రు సంహార సమయంలో వరుణ శక్తి వలన బరువును సంతరించుకుంటుంది. విసరకుండానే 150 అడుగుల దూరంలో ఉన్న శత్రువును తాకగలదు.
- డాక్టర్ జయదేవ్ చల్లా
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
Movies News
Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
-
World News
Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
-
India News
Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
- CWG 2022: రసవత్తర ఫైనల్ పోరు.. వెండితో సరిపెట్టుకున్న భారత్
- US: భారతీయ మహిళ బలవన్మరణం.. స్పందించిన న్యూయార్క్ కాన్సులేట్ జనరల్
- Chidambaram: ‘ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది’
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ