Published : 26 May 2022 01:10 IST

ఆనందో బ్రహ్మ

ఒకరికి భక్తిలో ఆనందం. ఇంకొకరికి సేవలో ఆనందం. మరొకరికి కర్తవ్య నిర్వహణలో ఆనందం. వేరొకరికి ఇహంలో ఆనందం. మరొకరికి మరోదాంట్లో ఆనందం. మొత్తానికది అపురూపం. ఆనందాన్వేషణ మార్గాలు వేరైతేనేం..  అదే జీవన పరమార్థం..

ఆకలితో గుక్కపట్టిన శిశువు తల్లి స్తన్యం నుంచి పాలచుక్కలు గొంతులో పడగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. కారుచీకట్లు కమ్మిన వేళ కాంతిరేఖను చూసి మనమంతా హర్షిస్తాం. వానజల్లు లక్షలాది చినుకులుగా భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి సారవంతం చేసినట్లు అనేక మార్గాల్లో మన మనసుని తన్మయత్వానికి గురిచేస్తుంది ఆనందం. జీవితం ఫలప్రదం కావాలంటే నిరంతరం ఆనంద రసాస్వాదన చేయాల్సిందే. 

ఒకసారి భృగు మహర్షికి పరమాత్మ ఎవరో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఘోర తపస్సు చేసి ఆనందమే పరబ్రహ్మమనీ, ప్రాణులన్నీ ఆనందంలోనే పుట్టి పెరిగి లయమవుతున్నాయనే సత్యాన్ని తెలుసు కున్నాడు. ఇది తైత్తిరీయ ఉపనిషత్‌ కథనం.

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌ 

ఆనందాద్ధ్యేవ ఖల్విమాని భూతాని జాయన్తే

ఆనందేన జాతాని జీవన్తి

బుద్ధి, ప్రాణం, అన్నం మొదలైన వాటిని కూడా భృగువు పరబ్రహ్మగా గుర్తించాడు. ఆత్మకు ఐదు రూపాలున్నాయి- అవి స్థూల, ప్రాణ, మానసిక, బుద్ధి, ఆనంద.. పేర్లతో ప్రసిద్ధి చెందాయి.

సర్వవ్యాపకుడైన శ్రీమహావిష్ణువు ఆనంద కారకుడని విష్ణు సహస్రనామాల ద్వారా తెలుస్తుంది. కనుకనే విష్ణుమూర్తికి ప్రమోదనుడు, ఆనందుడు, నందనుడు, సురానందుడు, నందుడు, ఆనంది, నంది- అనే పేర్లున్నాయని భీష్ముడు ధర్మరాజుకి తెలియజేశాడు. 

జగదానంద కారకుడు

శ్రీరాముడు పుత్రుడిగా, సోదరుడిగా, భర్తగా, పాలకుడిగా, స్నేహితుడిగా ప్రజల మెప్పు పొందాడు. అందరినీ రమింపజేసేవాడు. కనుకనే త్యాగరాజు ‘జగదానందకారకా.. జయ జానకీ ప్రాణ నాయకా..’ అంటూ శ్రీరాముణ్ణి కీర్తించాడు. భక్తులకు ఇష్టప్రదమైంది శ్రీరామనామం. రామబంటు హనుమంతునికైతే అది ప్రాణతుల్యమే. 

యత్ర యత్ర రఘునాథ కీర్తనం 

తత్ర తత్ర కృత మస్తకాంజలిం

బాష్పవారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం

రామ నామ సంకీర్తన జరుగుతున్న ప్రదేశంలో అంజనీసుతుడు ఆనందాశ్రువులు కారుతుండగా తన్మయత్వంతో రామ భజన చేస్తుంటాడని ప్రతీతి.

మోక్షమే అసలు ఆనందం 

జనన మరణ రహితుడైన భగవంతుడు అందించే మోక్షమే నిజమైన ఆనందం. మోక్షానికి బీజ రూపంగా ఉండి అన్ని దిక్కులను దేశ కాలాదులను అతడు తన చేతుల్లో ఉంచుకున్నాడు.

నిత్యం నిరావృతి నిజానుభవైక మానందం

ఆనందధామ జగదంకుర బీజమేకమ్‌

దిగ్దేశకాల కలనాది సమస్త హస్త

మర్దాసహమ్‌ దిశతు శర్మ మహన్మహోవః

మనిషి సాధించే ఘనకార్యాలన్నింటికీ తన ప్రతిభే కారణమనుకుంటాడు. కానీ జగత్తంతా పరంధాముడి లీలా విలాసంలో భాగమంటారు పండితులు. మన సనాతన సంస్కృతి స్త్రీలకు సమున్నత స్థానాన్నిచ్చింది. మహిళల్ని అవమానించవద్దని చెబుతూ ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్నారు. ఎక్కడైతే నారీమణులు ఆనందంగా కాలం గడుపుతూ పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది దీని భావం. 

 పరమాత్మ లక్షణం

అగోచరుడైన దేవుడు ఎలా ఉంటాడోనన్న సందేహం మనకి కలుగుతుంటుంది. రుషులు తెలియజేసిన పరమాత్ముడి లక్షణాల్లో ఆనందం ఒకటి.

త్వం బ్రహ్మ పూర్ణమమృతం విశోకం నిర్గుణం పరమ్‌

ఆనందమాత్ర మవ్యగ్ర మవికార  మనాత్మకమ్‌

భగవంతుడు పూర్ణస్వరూపుడు, అమృతాత్మకుడు, శోకరహితుడు, నిర్గుణుడు, ఆనందమయుడు, తొందరపాటు లేనివాడు, అవికారుడు. ఆ సర్వవ్యాపకుడు ఆనందమయుడైనందున ధర్మమార్గంలో మనం పొందే శారీరక, మానసికానందాలు భగవత్‌ ప్రసాదాలుగా భావించవచ్చు. పరమాత్ముణ్ణి సచ్చిదానంద స్వరూపుడంటారు. 

సమానోదితానేకసూర్యేన్దుకోటి 

ప్రభాపూరతుల్యద్యుతిం దుర్నిరీక్షమ్‌

న శీతం న చోష్ణం సువర్ణావదాత 

ప్రసన్నం సదానందసంవిత్స్వరూపమ్‌ 

కలకాలం నిలిచుండేది సచ్చిదానందం. కోట్లాది సూర్యచంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్లు దేదీప్యమానంగా ఉంటుందా ఆనందం. అలాగే అతి శీతలం, అత్యుష్ణం- రెండూ కాక మధ్యస్థమై బంగారు వర్ణంలో ప్రసన్నతను కలిగుంటుంది.

జీవులన్నిటికీ ప్రాణాధారమైంది ఆహారం. ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా గౌరవించుకుంటాం. శంకరాచార్యులవారు ఆహారానికి అధిదేవత అయిన అన్నపూర్ణాదేవిని కీర్తిస్తూ ‘అన్నపూర్ణాష్టకం’ రచించారు. అందులో ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ’ అంటూ అన్నంతోనే ప్రాణులకు నిత్యానందం కలుగుతుందన్నారు. 

నిరంతర భగవన్నామ సంకీర్తన చేసేవారే ఈ లోకంలో నిత్య సంతోషులని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. నారదమహర్షి తన మహతి వీణను మీటుతూ నారాయణ నామస్మరణ చేస్తుంటాడు. తాను సంతుష్టుడవ్వడమే కాకుండా జగత్తును ఆనందడోలికల్లో ఊయలలూపుతున్నాడని భాగవత వర్ణన.

అహో దేవర్షిః ధన్యో యం 

యత్కీర్తిం శార్‌ఙ్గధన్వనః 

గాయన్మాద్యన్నిదం తంత్య్రా 

రమయాత్యాతురం జగత్‌

మనందరం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఆనందాన్ని అన్వేషించవచ్చు. భగవంతుడి నామ సంకీర్తనల ద్వారా నిరంతర ఆనంద రసాస్వాదన చేయవచ్చు.

ఎవరి ఆనందం వాళ్లది..

ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణలో ఆనందాన్ని అనుభవించాడు. తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని శిక్షలు విధించినా ఆనంద కారకమైన విష్ణునామాన్ని వదలలేదు. అదే అతనికి రక్షాకవచమైంది.

బలి చక్రవర్తి రాక్షసుడైనప్పటికీ దానప్రవృత్తితో ఆనందించాడు. అది అతడికి అలంకారమైంది. వామనుడి రూపంలో తన ప్రాణాలు పోతాయని తెలిసినా వెనుకంజ వేయలేదు. అదే పాతాళానికి ఆధిపత్యం వహించే అవకాశం కలిగించింది. సాక్షాత్తూ విష్ణుమూర్తే కావలి ఉంటూ అతణ్ణి కాపాడాడు.

హరిశ్చంద్రుడికి సత్య వాక్పాలనలో ఆనందం కనిపించింది. ఎన్ని కష్టాలెదురైనా అసత్యాన్ని పలకలేదు, తన ఆనందానుభూతిని దూరం చేసుకోలేదు. నిజాయితీకి నిలువుటద్దమై నిలిచి సత్యహరిశ్చంద్రుడిగా ఖ్యాతి పొందాడు. ధృవుడికి బాల్యంలోనే నారద మహర్షి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని బోధించాడు. ఆ మంత్రోచ్చారణలో ఆనందాన్ని అనుభవించాడు. ధృవతారగా మారి శాశ్వతానందాన్ని పొందాడు.

- రామచంద్ర కనగాల 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని