చోళుల శిల్పకళా యశస్సు

కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం తాలూకా కంబదూర్‌లో 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయం శిల్ప కళా వైభవానికి నిలువుటద్దం.

Published : 09 Jun 2022 01:23 IST

దర్శనీయం

ర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం తాలూకా కంబదూర్‌లో 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయం శిల్ప కళా వైభవానికి నిలువుటద్దం. ఇందులో పలు ఉపాలయాలున్నాయి. ఇక్కడి శివలింగం మానవాకృతి రూపంలో ఉంటుంది.

అన్య మతస్థులు దండయాత్రలకు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నోల్లంటేశ్వర రాజులు ఇసుకతో కప్పిపెట్టి కాపాడినందున వారి విగ్రహాలూ ఉన్నాయి. దేశంలోనే అరుదైన గజలక్ష్మి వాకిలి ఆలయ ముఖద్వారం వద్ద ప్రత్యేక ఆకర్షణ. ఈశ్వరుని అభిషేక ప్రతిమగా పూజించే హంపి, లేపాక్షిల్లో ఉండే కమలాకృతి ఇక్కడ దర్శనమిస్తుంది. కమలాకృతికి 101 కడవల నీళ్లు సమర్పిస్తే వాన కురిసి పంటలు పండుతాయని, ఇక్కడి లింగానికి అభిషేకం చేస్తే ఎంతటి కష్టాలైనా సమసి పోతాయని భక్తుల నమ్మకం. కమలనాథుడిగా ఈశ్వరుడు ఇక్కడ కొలువుదీరాడు కనుక ఈ ప్రాంతాన్ని కమలపురి అని, కమలాపురం అని పిలిచేవారు. అదే కాలక్రమేణ కంబదూరుగా మారింది. గణపతి విగ్రహాన్ని తంజావూరు రాయితో చెక్కించారు. ఆలయంలోని వివిధ శిల్పాలూ, స్తంభాలూ చోళుల శిల్పకళా యశస్సును తెలియజేస్తున్నాయి. మాఘమాసంలో శివరాత్రి ఉత్సవాలు, కార్తిక మాసమంతా విశేష పూజలూ జరుగుతాయిక్కడ.

అనంతపురం జిల్లా కేంద్రం నుంచి 89 కి.మీ. దూరంలో ఉన్న కంబదూర్‌కు బస్సు సౌకర్యం ఉంది. కల్యాణదుర్గం నుంచి ప్రతి అరగంటకీ బస్సులుంటాయి. కర్ణాటకలోని పావగడ, మడకశిరకు వెళ్లే బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి.

- దాసరి సుభాష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు