ఆశే శ్వాసగా సాగాలి...

చలిలో, వేడిలో, కష్టంలో, సుఖంలో, ఏకాంతంలో, సమూహంలో నిరంతరం ఊపిరి పీలుస్తూనే ఉంటాం. శ్వాస సంకేతమే అది.. దేనికీ పొంగిపోవద్దు, దేనికీ కుంగిపోవద్దు.. అన్నిటినీ స్వీకరిస్తూ, ఆనక వదిలేస్తూ సమభావంతో, సమాదరణతో, ముందుకు సాగమని చెప్పడం.

Published : 23 Jun 2022 01:26 IST

చలిలో, వేడిలో, కష్టంలో, సుఖంలో, ఏకాంతంలో, సమూహంలో నిరంతరం ఊపిరి పీలుస్తూనే ఉంటాం. శ్వాస సంకేతమే అది.. దేనికీ పొంగిపోవద్దు, దేనికీ కుంగిపోవద్దు.. అన్నిటినీ స్వీకరిస్తూ, ఆనక వదిలేస్తూ సమభావంతో, సమాదరణతో, ముందుకు సాగమని చెప్పడం. స్నేహాలూ సౌకుమార్యాలను ఆనందిస్తూ విభేదాలూ విరోధాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి. అప్పుడిక ఆందోళనకు తావేది?! కానీ సుగుణాలూ సంతోషాలను వదిలేసి కడగళ్ల ఎండుపుల్లల్నే తల్చుకుంటే దుఃఖం దిగంతాలకు పాకుతుంది. పర్యవసానం నైరాశ్యం లేదా ప్రాణత్యాగం.

పుట్టింది మొదలు జీవనపర్యంతం ఏదో రూపంలో సమస్యలెదురౌతాయి. మనకే కాదు, చెట్టూపుట్టా, నదీనదాలూ అన్నిటికీ అవరోధాలొస్తూనే ఉంటాయి. అంత మాత్రాన కుంగిపోతే వేదన కారుమేఘమై కమ్ముకుని ఆశలను తుంచేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే అన్నీ అమరుతాయంటూ వేదాలు ఉద్బోధిస్తున్నాయి.

వేదాలనగానే యజ్ఞాలు, దేవతా స్తుతులు, ఆత్మ, పరమాత్మ... లాంటి విషయాలే ఉంటాయనుకుంటారు. నిజానికి వేద వేదాంగాల్లో జీవితం పట్ల అంతులేని ప్రేమకు దారితీసే శుభకామనలెన్నో దర్శనమిస్తాయి. ఈశోపనిషత్తులో ఐహిక జీవనానికి కావలసిన సూచనలెన్నో ఉన్నాయి. సమస్యలను తట్టుకునే నిబ్బరత లేక కలవరపడటం, బయటపడే ఆలోచన లేక నిరాశకు లోనవడం, ఆ దశ కూడా దాటి ఆత్మహత్యకు పూనుకోవడం.. లాంటివి కూడదని వేదాలూ ఉపనిషత్తులూ ప్రబోధిస్తున్నాయి. దేన్నయినా చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఆశావాదికి అడుగడుగునా జీవన నాదాలు వినిపించగా నిరాఘాటంగా పయనం సాగుతుంది. నిరాశావాదికి అతి చిన్న అవరోధం కూడా ప్రకంపనాలు పుట్టిస్తుంది. పరిష్కార దిశగా కనుక ఆలోచిస్తే ఎలాంటి సమస్యలైనా దూదిపింజల్లా తేలిపోతాయి. పారిపోయేకొద్దీ ప్రభంజనాలై భీతిల్లచేస్తాయి.

దేవతలకి హితుడైన సూర్యుణ్ణి వందేళ్లపాటు చూస్తాం, జీవిస్తాం, సంతోషిస్తాం, ఉంటాం, వింటాం, పొగుడుతాం- అని యజుర్వేద మాధ్యాహ్నిక సంధ్యావందనం సంకల్పంలోని ఈ మంత్రానికి అర్థం. ఇందులో జీవితం పట్ల అనురాగం, హర్షం, బతుకు పట్ల ఆశ, ఆకాంక్ష, నూరేళ్లు జీవిస్తామనే ఆశావాదం కనిపిస్తున్నాయి.

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః
ఏవం త్వయి నాన్యథేతో స్తి న కర్మ లిప్యతే నరే

కర్మాచరణతో నూరేళ్లు బతకాలనేది ఈశోపనిషత్తులోని ఈ శ్లోక భావం. ఇక్కడ కర్మలంటే దైవికమైనవి కాదు, చుట్టూ ఉన్న సంఘం, కుటుంబం తనకి నిర్దేశించిన పనులని. వీటిని మమకారం లేకుండా చేయాలంటున్నారు. అప్పుడే వాటి తాలూకు మంచి చెడులు వ్యక్తులకు అంటవని చెప్పడం. ‘జిజీవిషేచ్ఛత సమాః’ అనడంలో ప్రతి వ్యక్తీ తాను నూరేళ్లు బతకాలనే ఆశ ఉండాలన్నదే అంతరార్థం. మనిషి ఆయుర్దాయం నూరు శరత్తులు. అంతకాలం ఆనందంగా ఉండాలి. పిల్లలకి పిల్లలు పుట్టే వరకూ ఆరోగ్యంగా ఉండాలి- అనడంలో, అందుకు తగ్గట్టుగా ఆచారవ్యవహారాలను ఏర్పాటు చేసుకోవాలనడంలో వేదాల్లో బతుకు పట్ల ఆశావహ దృక్పథం అర్థమవుతుంది.

జీవితాంతం మంచి మాటలే వినాలి, మాట్లాడాలి, మంచే చూడాలి. ఇంద్రియాలను మంచి పనులకే వినియోగించాలన్న ఈ వేదోక్తి గాంధీజీని ఎంతగానో ప్రభావితం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ‘మంచి వినడం, చూడటం, మాట్లాడటం కుదరనప్పుడు కళ్లు, నోరు, చెవులను బంధించి ఉంచాలనే’ మూడు కోతుల బోధ మనకందించారు.

ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌
తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్య స్విద్ధనం

ఈశోపనిషత్‌లోని ఈ శ్లోకానికి ‘అంతా ఈశ్వరమయం. ఇందులో ఉన్నవి నాకు మాత్రమే సొంతం కాదు, అందరివీ. మనకు కలిగే సుఖదుఃఖాలను మానసిక సన్యాసంతో అనుభవించాలి. మంచి పనులే చెయ్యాలి. ధనం కానీ మరేదైనా సరే.. నీది కాని వస్తువును ఆశించకు, పరుల సొమ్మును పొందాలని చూడకు, అనుభవించకు. నీకు ప్రాప్తించినదాన్నే అనుభవించు. అందులో కొంత దానం చెయ్యి’ అంటోంది పై శ్లోకం. ఇందులో గొప్పతనం ఏమంటే జ్ఞాన, కర్మ, నీతియోగాలు ముప్పేట గొలుసులా అమరి ఉండటం.

సమస్యను ఎదిరించే శక్తి లేక ప్రాణం తీసుకోవడం ఎంత పిరికితనం?! ఆత్మస్థైర్యం లేకపోవడమే అందుక్కారణం. ఉమ్మడి కుటుంబాలు లుప్తమవుతున్న ప్రస్తుత సమయంలో వేదోపనిషత్తుల్లో దాగిన జీవన సారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మహత్య గురించి ఈశోపనిషత్తులో ఇలా ఉంది...

అసుర్యా నామ తే లోకా అంధేన తమసావృతాః
తాస్తే ప్రేత్యాభిగచ్ఛంతి యే కే చాత్మహనో జనాః

నూరేళ్ల జీవితాన్ని నిరాశతో, పిరికితనంతో, అర్థం లేని కారణాలతో అర్ధాంతరంగా ముగించేవారి ఆత్మ చీకటి లోకాలకు పయనిస్తుందట. ఆత్మ గురించిన జ్ఞానం లేనివారే బలవన్మరణానికి పూనుకుంటారట. ఉపనిషత్తులు ఆత్మహత్యను ఆత్మహననం అన్నాయి. మహాపాతకాల్లో ఒకటిగా చేర్చాయి.

లక్షల వత్సరాల నాటి వేదాలు, ఉపనిషత్తుల్లో మానవాళికి ఉపయుక్తమైన ప్రబోధలు నిక్షిప్తమై ఉన్నాయి. సాంప్రదాయక అర్థాలతో మాత్రమే వీటిని వ్యాఖ్యానిస్తే విలువైన జీవన జ్ఞానాన్ని కోల్పోతాం. నిరాశావాదంలో పయనించే యువతరానికి వీటిలో దాగిన సత్యాలను సమకాలీన నవీన దృష్టితో బోధించగలిగితే మన ప్రాచీన గ్రంథాల్లోని అద్భుత అంశాలను వారికి తెలియచేసినవారం అవుతాం. యువశక్తిని ఆశ అనే కొత్త శ్వాసతో నింపి దేశ సంపదగా తీర్చిదిద్దుకోగలుగుతాం.

ఓం తచ్చక్షుర్ద్దేవహితం పురస్తాచ్ఛుక్రముచ్చరత్‌
పశ్శ్యేమశరదః శతం జీవేమశరదః
శతశృణుయామశరదః శతంప్రబ్బవ్రామ శరదః శతమదీనాః
స్యామ శరదః శతంభూయశ్‌శ్చశరదః శతాత్‌


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా
భద్రం పశ్యేమాక్షభిర్యజ త్రాః
స్థిరైరంగై తుష్టువు స స్తనూభిః
వ్యశే మ దేవహితం యదాయుః

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని