Published : 30 Jun 2022 09:07 IST

మహా జ్వాలాయ విద్మహే

గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం- ఈ పంచభూతాల్లో ఏది లేకున్నా మనుగడే లేదు. ముఖ్యంగా నిప్పు కనుక లేకపోతే వంటావార్పూ దగ్గర్నుంచి ప్రయాణాల వరకూ అన్నీ ఆగిపోతాయి. జీవనమే స్తంభించి పోతుంది. వేద వేదాంగాలూ పురాణ ఇతిహాసాలూ అగ్నిని ఎంతగానో కీర్తించాయి.

అగ్నిదేవుడు పరమాత్మ నోటినుండి ఉద్భవించాడని రుగ్వేదం, బ్రహ్మదేవుని జ్యేష్ఠ పుత్రుడని విష్ణుపురాణం వర్ణించాయి. అగ్ని, బ్రహ్మ, బ్రహ్మాండ, స్కాంద, తదితర పురాణాల్లో అగ్ని గురించి ఎన్నో వివరణలున్నాయి. అనలుడు, పావకుఁడు, వైశ్వానరుడు, వహ్ని, శుచి, హుతభుక్కు, సప్తజిహ్వుడు అంటూ అనేక పేర్లున్నాయి. నిప్పు, చిచ్చు, అగ్గి లాంటి వాడుక పదాలు తెలిసినవే.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌

సర్వేశ్వరుడనైన నేను ప్రాణుల శరీరాల్లో జఠరాగ్నిగా చేరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన- వాయువులతో కలిసి భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలను జీర్ణింప చేస్తున్నాను- అనేది భగవద్గీతలోని ఈ శ్లోకానికి అర్థం.
అగ్నిర్‌ హోతా కవిక్రతుః సత్యశ్చిత్ర శ్రవస్తమః
దేవో దేవేభి రాగమత్‌

సృజనాత్మక శక్తితో, సాధన క్రియలను నిర్వర్తిస్తూ, కంటికి కాంతిశక్తినీ, చెవికి నాదశక్తినీ అందిస్తూ వైవిధ్యమైన చిత్రధ్వని చిత్రాలు రూపొందిస్తాడు అంటూ అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్నారిందులో.
భవభూతి ఉత్తరరామచరితంలో...

ఉత్పత్తి పరిపూతాయాః కిమస్యాః పావనాంతరైః
తీర్థోదకం చ వహ్నిశ్చ నాన్యతః శుద్ధి మర్హతి

పుట్టుకతోనే పవిత్రురాలైన ఈమెను మరి వేటితోనూ పునీతం చేయనవసరం లేదు. అపవిత్రమైనవాటిని అగ్ని, తీర్థోదకాలతో శుద్ధిచేస్తామే గానీ వాటిని శుద్ధి చేయం కదా అంటూ సీతమ్మను అగ్నితో పోల్చాడు.
రుగ్వేదం అగ్నిసూక్తంలోని మంత్రాలిలా సాగాయి...

అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్‌
హోతారం రత్నధాతమమ్‌

అందరికన్నా ముందుండి జనులకు హితంచేసే అగ్నిని స్తుతిస్తున్నాను.
యదఙ్గ దాశుషే త్వ మగ్నే భద్రం కరిష్యసి
తవేత్తత్‌ సత్యమఙ్గరః

తాను చేసే కర్మలను భగవత్సమర్పణం చేసేవారికి అగ్ని శుభం చేకూరుస్తాడు.
బడబాగ్ని, జఠరాగ్ని, దావాగ్ని అంటూ అగ్ని మూడు రకాలు. బడబం అంటే ఆడగుర్రం. సముద్రంలో ఆ రూపంలో ఉండి అందులోకి చేరిన నీటిని తగినంత మాత్రమే ఉంచుతూ, మిగిలిన నీటిని ఎప్పటికప్పుడు దహించేస్తుంటుంది. కనుకనే నదులన్నింటి నీరు వచ్చిచేరినా సముద్ర నీటిమట్టం స్థిరంగానే ఉంటుంది. జీవుల ఉదరంలో ఉండి ఆహారాన్ని దహింప(జీర్ణిం)చేసేది జఠరాగ్ని. ఆహారం దహనమైతేనే శరీరానికి శక్తి, సమయానుకూలంగా ఆకలి కలుగుతాయి. చెట్ల రాపిడితో పుట్టి అరణ్యాలను దహించేది దావాగ్ని.
కర్రల రాపిడితో నిప్పును పుట్టించి యజ్ఞయాగాలు చేస్తారు. అదే బ్రహ్మాగ్ని. శమీ వృక్షాన్ని అగ్నిగర్భ అంటారు. దీనిలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందట. దీన్ని రావికట్టెతో మథించి అగ్గిని రాజేస్తారు. ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని గార్హపత్యం అనేవి త్రేతాగ్నులు. ఇవి గృహస్థులు నిత్యం అగ్ని ఆరాధనకు ఉపయోగించేవి. అగ్ని దేవతల పురోహితుడని వేదాల్లో ఉన్నందున వివాహాది వైదిక కర్మల్లో అగ్నిని సాక్షిగా చేశారు. తనలో వేసిన అన్నింటినీ దహించేస్తుందని అగ్నిని సర్వభక్షకుడు అన్నారు. యజ్ఞ భాగాలను హవిర్భాగాలంటారు. వీటిని అగ్ని ముఖంగానే సమర్పిస్తారు. ఆయన వాటిని హవనం చేసి ఆయా దేవతలకు అందిస్తాడు కనుక హవ్యవహనుడని, అన్నింటినీ పవిత్రపరుస్తాడని పావకుడని అన్నారు.
మనం నిత్యం చూసేది తైజసాగ్ని. తేజస్సుతో ఉంటుందని అర్థం. మెరుపుల్లో దాగి, వాటి ఘర్షణవల్ల పుట్టేది తటిత్‌. సూర్యునిలో దాగి లోకాన్ని ప్రకాశింప చేసేది దివ్యాగ్ని. ప్రాణుల్లో ఆహారాన్ని జీర్ణింపచేసేది వైశ్వానరం. పుత్రపౌత్రులను అనుగ్రహించేది ప్రాజాపత్యాగ్ని. గృహస్థాశ్రమ నియమాల్లో తొలి నైవేద్యాన్ని సమర్పించాల్సింది పత్యాగ్ని. శ్మశానంలో శరీరాన్ని దహించేది కవ్యాదాగ్ని. వేదాలు అగ్నిని దేవతగా పేర్కొంటే, పురాణాలు అష్టదిక్పాలకుల్లో ఒకటిగా చేర్చాయి. తూర్పు, దక్షిణ దిక్కుల సంగమ స్థలమైన ఆగ్నేయం అగ్నిది. కశ్యపుని కుమార్తె స్వాహాదేవి అగ్నిభార్య.

అగ్ని నా రయిమశ్నవత్‌ పోషమేవ దివే దివే
యశసం వీర వత్తమమ్‌

అగ్ని ఆరాధకులకు పుష్టిని, వికాసాన్ని, సర్వ శక్తులను, కీర్తిని, యశోరూప ధనాన్ని.. ఇలా సర్వం కలుగజేస్తుందని చెబుతున్నారు.
ఓం మహాజ్వాలాయ విద్మహే
అగ్ని మధ్యాయ ధీమహీ
తన్నో అగ్నిః ప్రచోదయాత్‌

‘అగ్నిదేవా! మమ్మల్ని మేధస్సుతో ప్రకాశింపచేయి’ అని ప్రార్థించడమే ఇందులో ఉన్న అర్థం పరమార్థం.

- రమా శ్రీనివాస్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని