Published : 07 Jul 2022 00:59 IST

పదకొండో ఇంద్రియంతో పావన పూజ

పారాడే పసిపాపకు తల్లి ఒడే గర్భగుడి. అవసరాలు తీర్చే అమ్మే దేవత. వయసు పెరుగుతున్న కొద్దీ అదే బిడ్డ వివేకం పెరిగి తల్లితో పాటు తండ్రి కష్టాన్నీ గుర్తిస్తాడు. విద్యార్థిగా ఆచార్యులను పూజిస్తాడు. భవితకు దారి చూపే చుక్కానిగా గురువును ఆశ్రయించి జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు. తన వికాసానికి, పెరుగుదలకూ తోడ్పడిన పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధిస్తాడు. ఆ ప్రకృతికి సాకార రూపమైన భగవంతుడు అక్కడ చేరువవుతాడు. అలా విగ్రహారాధనతో ఆధ్యాత్మిక ఉన్నతికి ఓనమాలు దిద్దుతాడు. పెద్దల ద్వారా విన్నవాటిని బట్టి, తాను నమ్మిన రీతిలో తన మనసుకు నచ్చిన రూపంలో చిదానంద రూపాన్ని కొలుస్తూ తాపత్రయాల నుంచి విముక్తుడవటానికి ప్రయత్నిస్తాడు. ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికమనే తాపత్రయాల్లో భౌతిక ప్రపంచం వల్లనో, ప్రకృతి వైపరీత్యాల వల్లనో సగటు మనిషికి ఏర్పడే ఇబ్బందులు మొదటి రెండు కోవలకు చెందినవి. అరిషడ్వర్గాల వల్ల తనకు తాను ఏర్పరచుకున్న ఈతి బాధలు ఆధ్యాత్మిక తాపం కిందికి వస్తాయి. ఈ తాపమే సగటు మనిషిని తన బాధల నుంచి బయటపడే దారుల కోసమో, శాంతి కోసమో దేవుణ్ణి పూజించటానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అందుకేనేమో.. అలనాడు కుంతి నిరంతర కష్టాల్లో మునిగిపోయే వరమివ్వమని కోరింది. అలా కృష్ణస్వామిని సదా తలచుకునే భాగ్యశాలిని అవుతానని తలపోసింది.

ర్చనలకు ఆకర్షితమైన మనసు... విగ్రహ సౌందర్యంపై లగ్నమవటం సహజం. ఆ ధ్యాసలో మునిగిపోవటం మంచి పరిణామం కూడా. ఆ దివ్యమైన అనుభూతిని పదేపదే ఆస్వాదించడానికేనేమో మనసు ఆ వైపు పరుగులు పెడుతుంది. కలియుగంలో నామ స్మరణను మించిన ధన్యోపాయం లేదంటారు. గజిబిజి ఉరుకు పరుగుల యాంత్రిక జీవితాల్లో ఆ దేవదేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా తలచు కుంటే చాలు, వెన్నంటి ఉంటాడని నొక్కి చెబుతున్నాయి పురాణాలు.

ఎందరో రుషులు తమ తపోఫలాన్ని తమ తర్వాతి తరాలకు సులభంగా అందించే ప్రయత్నంలో రాసిన పూజలు, స్తోత్రాలు కోకొల్లలు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ సమాధి- అనే ఈ అష్టాంగ మార్గం ఆ భగవంతుణ్ణి చేరే సోపానక్రమం. వీటిలో కనులారా చూసుకున్న భగవద్రూపాన్ని మనసారా నింపుకోవటం ధ్యానానికి సంబంధించింది కాగా.. ఆ దైవానికి స్థాయీ భేదాలతో నిమిత్తం లేకుండా హృదయ పంజరంలో అర్చన చేసుకోగలగటం అనేది ధారణకు చెందుతుంది. మనసును దేవుని మీద లగ్నం చేయటమే కాదు, ఆ కొండంత మూర్తికి నిండైన భక్తితో మనసులో చేసే పూజే మానసిక పూజ.

అపూర్వ వస్తువుల మేలు కలయిక సృష్టి.

తీర్థోదకైః కాంచనకుంభసంస్థైః
సువాసితైర్దేవకృపారసార్ద్రైః

అంటూ బంగారు బిందెలతో ఆకాశగంగను తెచ్చి అభిషేకించినా.. గంగలోని చేపకప్పలు ఎంగిలంటున్నాయంటూ.. వెతలు వెళ్లబోసు కున్నా అది మానసిక పూజకే చెల్లుతుంది. పంచోపచారాల నుంచి చతుష్షష్టి ఉపచారాల వరకు విస్తరించిన ఈ మానసిక పూజ నిజంగా మన మనసును ఆ నిరాకారుడికి చేరువ చేయగలదు.

ఆత్మాత్వం గిరిజా మతిస్సహచరా
ప్రాణాశ్శరీరం గృహం

అంటూ జీవాత్మ చేసే ప్రతి పనిలో దాగి ఉన్న పరమాత్మ అర్చనా రహస్యాన్ని అందించారు శంకర భగవత్పాదులు. సర్వ కాలాల్లో సంతోష చిత్తంతో, ఏకాగ్రతతో భగవానుడికి మనసు అర్పించిన వాడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుని వచనం. అందుకే బాహ్య ఆడంబరాలు లేని ప్రశాంత చిత్తంతో భగవద్రూపాన్ని ధారణ చేసేందుకు సాధన చేయాలని శంకర భగవానుల వారి ఉద్బోధ.

స్నేహాత్వమంగీకురు, సశివే సుఖ
శయనం కురు తత్ర మాం స్మరంతీ

అంటూ శ్రీదేవీ మానసిక పూజలో ఆయన సాగించిన శ్లోకరచన, సాధనతో దేవుడిపై భక్తే కాదు సఖ్యతనూ పెంచగలదని పలువురి నమ్మిక.

‘తత్వమసి, సోహం, అహం బ్రహ్మాస్మి’ వంటి అద్భుత ఉపనిషద్‌ వాక్యాలకు మార్గమే ఈ మానసిక పూజ. జీవాత్మ పరమాత్మల నడుమ గల అద్వైత భావన లకు బలం చేకూర్చగలదీ మానసికపూజ. ‘ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్‌’ అంటూ బ్రహ్మానంద స్వరూపాన్ని దర్శనం చేయించ గలదీ మానసిక పూజ. ‘ఆత్మవత్‌ సర్వ భూతాని’ అంటూ తన లోపలున్న దైవాన్ని సమస్త ప్రపంచంలో చూస్తూ ఆధ్యాత్మిక శాంతిని పొందటంలో చేయూతనివ్వగలదు.

శబ్ద, రస, రూప, స్పర్శ, గంధాలనే తన్మాత్రలకు లోబడి.. జీవులకు ఆయా అంశాలపట్ల ఆసక్తీ, అనురక్తీ కలగడం సహజం. దానికనుగుణంగా కర్మేంద్రియాల సహకారమూ కలుగుతుంది. అయితే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆ జీవి మనసు అధీనంలో ఉంటాయన్నది నిర్వివాదాంశం. అందుకే పదకొండో ఇంద్రియంగా చెప్పుకునే మనసును అదుపులో ఉంచగలిగే ఉపాయాలు ఎన్నో సూచించారు పెద్దలు. వాటిలో ముఖ్యమైందీ మానసిక పూజ. ఏదేమైనా ఆధ్యాత్మిక చింతన అనేది ఎవరికి వారే ఎన్నుకుని ఆ మార్గంలో పయనించాల్సిన ప్రక్రియ. ‘నదీనాం సాగరో గతిః’ అన్నట్టు మార్గం ఏదైనా దేవుడిపై సంపూర్ణ విశ్వాసంతో చేసే మంచి పని ఏదైనా పూజే కాగలదు!

 - పార్నంది అపర్ణ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని