తన కోపమె...!

కొందరు చిన్న విషయానికే చిరాకుపడుతుంటారు. ఇంకొందరు ఆవేశంతో అరిచేస్తుంటారు. ఎందుకని? స్థిరచిత్తులుగా శాంతమూర్తులుగా ఉండలేమా? కోపాన్ని పురాణేతిహాసాలు ఏమని నిర్వచించాయి?

Updated : 14 Jul 2022 09:28 IST

కొందరు చిన్న విషయానికే చిరాకుపడుతుంటారు. ఇంకొందరు ఆవేశంతో అరిచేస్తుంటారు. ఎందుకని? స్థిరచిత్తులుగా శాంతమూర్తులుగా ఉండలేమా? కోపాన్ని పురాణేతిహాసాలు ఏమని నిర్వచించాయి? ఎలాంటి ఉపదేశాన్నిచ్చాయి...

ఆవేశం మితిమీరినప్పుడు ‘కోపం వస్తే నేను మనిషిని కాను’ అనడం చూస్తుంటాం. నిజానికిది ఎదుటివారిని బెదర గొట్టడం కంటే తానే బెదిరిపోవాల్సిన స్థితి. అంటే కోపంలో తన సహజ స్వభావాన్నే కోల్పోయి దిగజారుతాడన్నమాట. కోపం మానవత్వాన్ని హరిస్తుంది. ఇంతకూ కోపం చర్యా, ప్రతిచర్యా- అంటే ముమ్మాటికీ ప్రతిచర్యే. అనుకున్నది నెరవేరకపోవడమే కోప కారణం. దాంతో విచక్షణ పోతుంది. బుద్ధి పనిచేయదు. అప్పుడిక పశుప్రాయుడే కదా! ఒకసారి పై నానుడి మళ్లీ చదువుదాం! ఈసారి కోపం కాదు భయం కలుగుతుంది. ఈ అంశాన్నే భగవద్గీతలోని సాంఖ్యయోగం...

ధ్యాయతో విషయాన్పుంసః సంగస్తేషూపజాయతే

సంగాత్సంజాయతే కామఃకామాత్కోధ్రోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాస్మృతి విభ్రమః

స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి 

అని వివరిస్తూ, అంతిమ పరిణామం ప్రణశ్యతి అంది. నశ్యతి అంటే నశించిపోవడం, పతనమైపోవడం. ప్రణశ్యతి అంటే కోలుకోలేనంతగా పతనమవుతారని అరం. అయితే మనిషికి కోపమే రాకూడదా? వస్తే ఏం చేయాలి? దీనికి మన ప్రాచీన గ్రంథాల్లో కొల్లలుగా సమాధానాలున్నాయి.

ఇంతకూ కోపం, క్రోధం, ఆగ్రహం అన్నీ ఒకటేనా? కాదు. కోపం తాటాకు మంటలా క్షణికం, క్రోధం చింతనిప్పులా తీవ్రతరం, దీర్ఘకాలికం. ఆగ్రహం లోకహితమైన ధర్మాగ్రహం, సత్యాగ్రహం అని రెండు విధాలు. కోపం రావచ్చు, కానీ క్రోధంగా పరిణమించకూడదు. అది ఎదుటివాళ్లని ఎంతవరకు కాలుస్తుందో గానీ తనను మాత్రం తక్షణం కాలుస్తుంది.

పరమేశ్వరుడు, పరశురాముడు, రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, భీముడు, రావణుడు, దుర్యోధనుడు, సీత, ద్రౌపది, సత్యభామ అందరూ కోపానికి గురైనవారే.. చివరికి ధర్మరాజు కూడా దానికి మినహాయింపు కాదు. అయితే కోపాన్ని అణచినవారు కొందరైతే, క్రోధంగా మార్చుకుని స్వయం వినాశనాన్ని కొనితెచ్చుకున్నవారు మరికొందరు. ఇంకొందరి కోపం ఆగ్రహంగా పరిణామం చెంది ధర్మరక్షణకు దోహదపడింది. 

కోపం

సతీదేవి ఆత్మాహుతితో పొడచూపిన పరమేశ్వరుని కోపం, అహంకారంతో, దైవదూషణతో, దుర్మార్గపు ఆలోచనతో ప్రారంభ మైన దక్షయజ్ఞ వినాశనానికి కారణమైంది. పాండవ వినాశనానికి అన్యాయంగా, మొండిగా ప్రయత్నించిన అశ్వతామపై కృష్ణునికోపం అతణ్ణి జీవచ్ఛవంగా మార్చింది. వ్యాసుని ఆకలికోపం మోక్షనగరం కాశీ నుంచి బహిష్కరణకు కారణమైంది. నిండుసభలో ద్రౌపదిని తన్నిన కీచకుడిపై ఆగ్రహించిన భీముడి ఉగ్రరూపాన్ని ‘కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల..’ అన్నాడు తిక్కనకవి. కళ్ల నుంచి నిప్పులు రాలుతూ, రక్తం శరీరం లోపల గాక పై భాగానే పారుతున్నట్లుగా ఎర్రబడింది. ఒళ్లంతా చెమట బిందువులు కమ్ముకున్నాయి, మద్దెల వాయిస్తున్నట్లుగా పళ్లు పటపట శబ్దం చేస్తున్నాయి. భీముని కోపం చూసి ఒంటిమీది చెమట చుక్కలు కిందికి జారటానికి కూడా భయపడి అలానే నిలిచిపోయాయట! ఆ కోపం కీచకవధగా వ్యక్తమైంది. 

క్రోధం

కార్తవీర్యార్జునునిపై పరశురాముని కోపం క్షత్రియజాతిపై క్రోధంగా మారి ఆ జాతితో పాటు తన తపశ్శక్తినీ బలితీసుకుంది. శ్రీరామ చంద్రునిపై అకారణ క్రోధం రావణుణ్ణి, పాండవులపై అనుచిత క్రోధం దుర్యోధనుణ్ణి సమూలంగా నాశనం చేసింది.

ఆగ్రహం

భీముడు కోపగ్రస్తునిగా కనిపిస్తాడు. కానీ అది ఏనాడూ క్రోధంగా పరిణమించలేదు. లక్ష్మణుడి కోపమూ అంతే. ‘ఉదయం పట్టాభిషేకమని చెప్పి అర్ధరాత్రి నిర్ణయాలు మార్చుకున్న దశరథుణ్ణి, కైకేయినీ, వారి పరివారాన్ని ఊచకోత కోస్తాను, నువ్వు ఊ..! అను!’ అన్నాడు. కానీ ఆ అన్నయ్య ‘ఊహూ’ అన్నాడు. నిండుసభలో కులసతికి జరిగిన అవమానంతో ఆగ్రహోదగ్రుడైన భీమసేనుడు ‘దుష్టచతుష్టయాన్ని, కౌరవవంశాన్ని.. మొత్తాన్నీ మట్టుపెడతాను, నువ్వు ఊ..! అను’ అన్నాడు. ఈ అన్నయ్య కూడా ‘ఊహూ’ అనే అన్నాడు.

ఆగ్రహం నది. అది ప్రవహించకుంటే నిష్ఫలం. లక్ష్మణుడిదీ, భీమసేనుడిదీ ఆగ్రహమే. అయితే వెల్లువలా ప్రవహించే ఆ ఆగ్రహానికి ధర్మమనే ఆనకట్ట వేశారు శ్రీరాముడు, ధర్మజుడు.

కోప అభివ్యక్తి 

‘రామః క్రోధం ఆహరయత్తీవ్రం’ అన్నారు. శ్రీరాముడికి కోపం రాదట! అవసరమైనప్పుడు ఆపాదించుకుంటాడట! దాన్ని అభివ్యక్తీకరించే తీరూ భిన్నమే. ఉపకారం పొంది, ప్రత్యుపకారం మరచి, భోగలాలసలో మునిగిన సుగ్రీవుడికి ‘న చ సంకుచితః పంథా యేన వాలీ హతోగతః’ అంటూ సందేశం పంపాడు రాముడు. ‘వాలి వెళ్లిన మార్గం ఇంకా తెరిచే ఉంది సుగ్రీవా!’ అనేది అరం. అదే సమయంలో లక్ష్మణుడి కోపం కంటిచూపుతో చంపేస్తానన్నట్లుగా ఉందట! ఇక భీముడి కోప సాయిని పైన చూశాం! నిండుసభలో ‘ధారుణి రాజ్యసంపద మదం’తో భరించరాని పరాభవం చేసిన దుర్యోధన, దుశ్శాసనుల్ని కురువృద్ధులు,  వృద్ధ బంధువులు అనేకులు చూస్తుండగా లోకం భయపడేంత భీకరంగా సంహరిస్తానన్న ప్రతిజ్ఞలోనూ ధర్మాన్ని తప్పలేదు. వెంటనే వధిస్తాననక యుద్ధ రంగంలో చంపుతానన్న ధర్మబద్ధుడు. ‘ధర్మోవివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన’ అనేది ఆర్యోక్తి. ధర్మరాజుని గనుక కీర్తిస్తే.. అంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే ధర్మం వృద్ధి చెందుతుందని, భీముని అనుసరిస్తే పాపసంకల్పాలు తొలగిపోతాయని భావం.

సీతమ్మకు రామునిపై వచ్చిన కోపం వనవాసానికి, లక్ష్మణునిపై కోపం లంకావాసానికి, రావణునిపై కోపం రాక్షస వినాశనానికి దారితీశాయి. ద్రౌపది కోపం కౌరవ వినాశనానికి హేతువైంది. ఇక సత్యభామాదుల ప్రణయకోపాలు కావాలనిపించే కష్టాలు, మోయాలనిపించే బరువులు. ఏదేమైనా లోకహితమై అవధులు దాటని ఆగ్రహం ఆహ్వానించదగిందే. ధర్మమార్గానువర్తి అయిన కోపం మన్నించదగింది. స్వ, పర వినాశకారియైన క్రోధాన్ని తక్షణం పరిహరించాల్సిందే!

- డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని