అయిదు గదుల ఇల్లు... ఆనంద హరివిల్లు

ఆ ఇల్లు బహు చక్కనైనది. ఇంట్లో ఒక్కో గదినీ ఒక్కోపనికి వినియోగిస్తాం. ఏ గది ప్రత్యేకత దానిదే. అన్నీ కలిస్తేనే ఆ ఇల్లు బాగున్నట్టు. ఈ ఐదు గదుల ఇల్లు కూడా అంతే. సునిశితంగా పరిశీలిస్తే తప్ప ఆ గదుల ప్రత్యేకతలు తెలియవు. తెలుసుకున్నప్పుడే ఏ గదిని ఎంతలా శుభ్రంగా ఉంచుకోవాలో అర్థమవుతుంది. మన దేహమే ఆ ఇల్లు...

Published : 21 Jul 2022 00:16 IST

ఆ ఇల్లు బహు చక్కనైనది. ఇంట్లో ఒక్కో గదినీ ఒక్కోపనికి వినియోగిస్తాం. ఏ గది ప్రత్యేకత దానిదే. అన్నీ కలిస్తేనే ఆ ఇల్లు బాగున్నట్టు. ఈ ఐదు గదుల ఇల్లు కూడా అంతే. సునిశితంగా పరిశీలిస్తే తప్ప ఆ గదుల ప్రత్యేకతలు తెలియవు. తెలుసుకున్నప్పుడే ఏ గదిని ఎంతలా శుభ్రంగా ఉంచుకోవాలో అర్థమవుతుంది. మన దేహమే ఆ ఇల్లు...

రీరం అయిదు కోశాలుగా ఉంటుందని ప్రశ్నోపనిషత్‌ లాంటి ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. మొదటిది అన్నమయ కోశం. దీన్నే శరీరం, స్థూల శరీరం అంటాం. ఇది పైకి కనిపిస్తుంది. గింజపై పైపొట్టులా, గర్భస్త పిండాన్ని మాయ కప్పి ఉన్నట్టుగా ఉంటుంది.

అన్నాద్భవన్తి భూతాని వర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః

అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఆహారం వల్ల ఏర్పడిన శరీరం ప్రకాశవంతమైన ఆత్మకు కవచంలా ఉంటుంది. అందువల్ల స్థూల భౌతిక శరీరాన్నే అన్నమయకోశం అంటారు.

ప్రాణమయ కోశం రెండోది. ప్రాణం శరీరంలో అంతర్లీనంగా ప్రవహించే జీవశక్తి. దీన్ని ఓజస్సు అని కూడా అంటారు. మన శరీరంలో 72000 నాడులుంటాయి. వీటిలో 14 ముఖ్యమైనవి. అందులో ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు మరీ ముఖ్యమైనవి. వాటి ద్వారా ఈ ప్రాణశక్తి శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే పంచ వాయువులు పంచ ప్రాణాలుగా మన శరీరంలో తిరుగుతుంటాయి.

మనోమయ కోశం మూడోది. ఇది మానసిక శరీరం. మనసులో ఏం జరుగుతుందో అది శరీరంపైన కనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మనసనేది మరెక్కడో ఉండదు. దేహంలోనే ఉంటుంది. శరీరంలోని ప్రతీ అణువుతో దానికి సంబంధం ఉంటుంది. అలా ఒక సంపూర్ణ మానసిక శరీరం కూడా మనిషిలో ఉంటుంది. మానసిక శరీరంలో ఏం జరిగినా అది భౌతిక శరీరం మీద ప్రతిఫలించి తీరుతుంది. ముఖం లేదా శరీర చలనాలను చూసి మనసులో మాట గ్రహించడానికి ఇదే కారణం. భౌతిక శరీరంలో ఏం జరిగినా అది మానసిక శరీరంలోనూ జరుగుతుంది. శరీరానికి సంబంధించిన కష్టసుఖాలు, అనుభవాలు, అనుభూతులు, ఉల్లాసాలు, ఉద్వేగాలు ఇవన్నీ ఆ ప్రభావమే! అలాగే మనసు స్థాయిలో ఎటువంటి హెచ్చు తగ్గులున్నా దానికో రసాయనిక ప్రతిచర్య కూడా ఉంటుంది. అందుకే మానసిక వ్యాధులు, పరివర్తనలు కలుగుతుంటాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో చివరి మూడూ మానసిక స్థితులకు సంబంధించినవి. శమ, దమ, భక్తి, తితిక్షలు... ఆనందమయ కోశ పరిధిలో ఉంటాయి. న్యాయం, ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, వివేకం, ధైర్యం విజ్ఞానమయ కోశ పరిధిలోనివి. సద్బుద్ధి, స్వచ్ఛత, నిశ్చలత్వం మనోమయ కోశ పరిధిలోకి రాగా.. కామ, క్రోధ, లోభ, మోహాలు ప్రాణమయ కోశ పరిధిలోకి వస్తాయి. ఇక ఈర్ష్యాసూయలు, అసత్య, అధర్మాలకు సంబంధించిన కార్యాలు అన్నమయ కోశ పరిధిలో ఉంటాయి.

ఒకటి సాఫ్ట్‌వేర్‌.. మరొకటి హార్డ్‌వేర్‌..
ప్రస్తుత కాలానికి తగ్గట్టు చెప్పుకుంటే భౌతిక, మానసిక శరీరాలు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ లాంటివి. వీటిని పవర్‌కు అనుసంధానం చేయనంత వరకూ అవి ఏమీ చేయలేవు. అలాగే భౌతిక, మానసిక శరీరాలకు పవర్‌ లాంటిది మూడో శరీరం. దీన్నే ప్రాణమయ కోశం లేదా శక్తి శరీరం అంటారు. శక్తి శరీరాన్ని సమతుల్యతతో ఉంచుకుంటే భౌతిక మానసిక శరీరాల్లో జబ్బులకు తావుండదు. వ్యాధి అంటే అంటు వ్యాధులని కాకుండా, దీర్ఘకాల వ్యాధులనే అర్థం తీసుకోవాలి. అంటువ్యాధులు బయటి జీవుల వల్ల కలుగుతాయి. కానీ మనం నిత్యం రోగాలను సృష్టించుకుంటున్నాం. దీనికి కారణం పెద్దలు అనాదిగా చెబుతున్న అంతశ్శత్రువులైన అరిషడ్వర్గమే. కామ క్రోధ మద మాత్సర్యాది ఆరు శత్రువులను జయించగలగాలి. శక్తి శరీరం పూర్తి స్థాయిలో, సరైన సమతుల్యతతో పనిచేస్తుంటే, భౌతిక శరీరంలో వ్యాధి నిలవదు. ఏదైనా వ్యాధి ఉందంటే దానికి కారణం శక్తి. అది సవ్యంగా పనిచేయనప్పుడే జబ్బు సోకుతుంది. కొన్ని సులువైన యోగ సాధనలతో భౌతిక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. శక్తి శరీరాన్ని పూర్తి స్థాయిలో, సమతుల్యతతో పనిచేసేలా చూసుకోవచ్చు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ కోశాలు మూడూ భౌతిక అస్తిత్వం కలిగుంటాయి.

కంటిచూపు లాంటిది...
విజ్ఞానాన్ని విద్యుద్దీపంతో పోల్చి చెప్పొచ్చు. అది వెలుగులు చిమ్ముతూ భౌతికంగా కనిపిస్తుంది. విద్యుత్తు సూక్ష్మమైంది, కనిపించదు. కానీ తీగను తాకితే విద్యుత్‌ ప్రవహిస్తోందని అర్థమవుతుంది. దీపపు వెలుగు భౌతికమైందే! కానీ దాన్ని తెలుసుకోవాలంటే కంటిచూపు ఉండాలి. ఈ చూపు లాంటిదే విజ్ఞానమయ కోశం. ఇదొక అనుసంధాన స్థితి. భౌతికం కాదు, భౌతికాతీతం కూడా కాదు. రెంటికీ మధ్య ఉండే లంకె లాంటిది. ఇది పంచేంద్రియాతీతం.

ఆనందమయ కోశం
ఇది భౌతికాతీతమైంది, అనుభూతి పరమైంది. జీవితానుభవాల దొంతరే ఈ గది. అనుభవిస్తే కానీ అదేంటో తెలిసి రాదు. ఇంట్లో గదులన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ ఇంటివారికి ఆనందానుభూతులు దక్కుతాయి. మరో ముఖ్య సంగతేమంటే... శరీరంలోని మొదటి నాలుగు కోశాలను పద్ధతి ప్రకారం ఉంచుకోగలిగితే ఐదోదైన ఆనందమయ కోశం అందుబాటులోకి వచ్చి బ్రహ్మానంద రసానుభూతి కలుగుతుంది. ఎందరో సద్గురువులు ఈ విషయాన్ని పదేపదే వివరించారు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని