భక్తిబంధం..స్నేహతరంగం

ఎందరెందరో దేవుళ్లు. ఎన్నెన్నో భక్తిమార్గాలు. కులం, ప్రాంతం, వర్గం, వ్యక్తిత్వాలను బట్టి రకరకాల పూజలు. భిన్నవిభిన్న ఆరాధనల్లో సఖ్యభక్తి ప్రత్యేకం. దైవాన్ని ఎక్కడో అందనంత దూరాన అట్టిపెట్టి అంటీముట్టనట్టు పూజించడంలో తృప్తిలేక ఆప్తమిత్రునిలా తలచి సర్వస్వంగా కొలవడం.

Updated : 04 Aug 2022 03:45 IST

ఆగస్టు 7 స్నేహ దినోత్సవం

ఎందరెందరో దేవుళ్లు. ఎన్నెన్నో భక్తిమార్గాలు. కులం, ప్రాంతం, వర్గం, వ్యక్తిత్వాలను బట్టి రకరకాల పూజలు. భిన్నవిభిన్న ఆరాధనల్లో సఖ్యభక్తి ప్రత్యేకం. దైవాన్ని ఎక్కడో అందనంత దూరాన అట్టిపెట్టి అంటీముట్టనట్టు పూజించడంలో తృప్తిలేక ఆప్తమిత్రునిలా తలచి సర్వస్వంగా కొలవడం.

స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం, చెలిమే కలిమి- అంటూ మైత్రీబంధాన్ని కొనియాడుతుంటారు. స్నేహానికి ఇంతటి ప్రాధాన్యత, పవిత్రత ఎలా వచ్చాయో పురాణ ఇతిహాసాలు వివరిస్తున్నాయి. చెలిమి అద్భుతమని దైవాన్నే నేస్తంగా భావించారు కొందరు. సఖ్యభక్తి మోక్షానికి రాజ మార్గమని ఆ దిశగా అడుగులేశారు. దేవుడితో ఆటలు, అలకలు, కేరింతలు, పలవరింతలతో ఆరాధించడమే సఖ్యభక్తి.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం

ఈ తొమ్మిది భక్తిమార్గాల వరుసలో ఎనిమిదోది సఖ్యభక్తి. ఇక్కడ భక్తులు భగవంతుడితో ఆటలాడతారు. అలిగినప్పుడు నేస్తాల వలెనే దైవంతో తగవుపడతారు. కోపమొస్తే తట్టి నిలదీయటమూ కనిపిస్తుంది. దేవుణ్ణే చెలికాడిగా తలచే ఈ మోక్ష మార్గాన్ని ‘సఖ్యభక్తి’ అన్నారు. దీనికి ప్రతీకగా నిలిచిన గురువుల్లో చైతన్య మహాప్రభువు ఆదర్శనీయుడు. ఆ మార్గాన్ని అనుసరించినవారు చాలామందే ఉన్నారు.
వీళ్లకి దేవుడు చెలికాడు...
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరునితో హాథీరామ్‌ బాబా పాచికలాట ఆడేవాడు. ఇప్పటికీ ఈ స్నేహ బంధానికి గుర్తుగా తిరుమలలో హాథీరాంబావాజీ ఆశ్రమం ఉంది. ఆయన అసలు పేరు ఆశారామ్‌ బల్జోత్‌. ఆ ఆశ్రమానికి ఏనుగు రావడం వల్ల, బావాజీ తరచు రామనామ స్మరణ చేసినందు వల్ల ఆయనకు హాథీరామ్‌ బావాజీ పేరు స్థిరపడింది. వల్లభాచార్యుల శిష్యరికంలో సూరదాసు సఖ్యభక్తితో రాధాకృష్ణులపై వేలాది కీర్తనలు రచించి, గానం చేసేవాడు. అప్పుడు రాధాకృష్ణులు స్వయంగా వచ్చి, ఆ గానానికి పరవశులయ్యేవారని ప్రతీతి. రాముడి ఆలయాన్ని పునరుద్ధరించి జైలు పాలవడాన్ని జీర్ణించుకోలేక ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా’ అంటూ నిలదీశాడు భద్రాచల రామదాసు. కానీ తర్వాత ‘ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను, ఏమనుకోకు’ అంటూ మిత్రుడిలానే బతిమాలాడు.
నేస్తం కోసం ఆగిన జగన్నాథ రథం
మనందరికీ తెలిసిన జగన్నాథ రథయాత్ర వెనుక పవిత్ర స్నేహబంధ కథ ఒకటుంది. సాలబేగ్‌ జగన్నాథస్వామికి పరమ భక్తుడు. ఆయన అనుసరించింది ఈ సఖ్యభక్తి మార్గాన్నే. రథయాత్రలో బలభద్ర, సుభద్రలతో కలసి జగన్నాథుడు పూరీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా భక్తులందరికీ దర్శనం లభిస్తుంది. జగన్నాథుడిపై సఖ్యభక్తితో కీర్తనలు రచించిన సాలబేగ్‌కు రథయాత్రలో ఎలాగైనా జగన్నాథుణ్ణి తనివితీరా చూడాలనే కోరిక ఉండేది. సాలబేగ్‌ తండ్రి మొఘల్‌ చక్రవర్తుల దగ్గర సుబేదారు. యువకుడైన సాలబేగ్‌ తండ్రితో కలసి మొగల్‌ సేనల తరపున యుద్ధాల్లో పాల్గొనేవాడు. ఒకసారి యుద్ధంలో గాయపడి, ప్రాణాలు దక్కవేమో అనే స్థితి వచ్చింది. జగన్నాథుణ్ణి వేడుకుంటే అతడే అన్నీ చూసుకుంటాడని తల్లి చెప్పడంతో ఆయన్ను స్మరిస్తూ ఆశువుగా కీర్తనలు రచించాడు. కొద్దిరోజులకే ఆశ్చర్యకరంగా దెబ్బలు నయమయ్యాయి. రథయాత్ర రోజున జగన్నాథుణ్ణి చూడాలనుకున్నాడు. కానీ ఆ వేడుకకు కొద్దిరోజుల ముందే మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. బయటకు రాలేని స్థితి. అప్పుడే సాలబేగ్‌ సఖ్యభక్తి భావనతో తాను వచ్చేంత వరకు రథం ముందుకు సాగిపోకూడదని జగన్నాథుణ్ణి మనసులోనే ప్రార్థించాడు. యథావిధిగా రథయాత్ర ఆరంభమైంది. జగన్నాథుడు తన భక్త మిత్రుడైన సాలబేగ్‌ మాట ఆలకించినట్టు అతడి ఇంటి ముందు రథం ఆగిపోయింది. ఎందరు భక్తులు ఎంత బలంగా నెట్టినా రథం కదల్లేదు. పూజారులు పిలవడంతో అతడు నెమ్మదిగా వచ్చి, జగన్నాథుణ్ణి తనివితీరా చూసిన తర్వాతే రథం కదిలింది. ఒక ఆప్తమిత్రుడిలా జగన్నాథుడు సాలబేగ్‌ వద్దకొచ్చి దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వయసు మళ్లి సాలబేగ్‌ కన్నుమూశాక అతడి సమాధిని జగన్నాథ ఆలయ సమీపంలోనే నిర్మించారు. శ్రీకృష్ణ కుచేలుల స్నేహం పురాణ స్నేహాలన్నింటిలో తలమానికం.
అశోకవనంలో సీతమ్మకు కాపలాగా ఉన్న త్రిజట స్నేహానికి ప్రతీక. వేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతను వారించింది. తన స్వప్నం గురించి సీతమ్మకు చెప్పి, రావణుడి అంతం తప్పదు, రామలక్ష్మణులు లంకను జయిస్తారంటూ ధైర్యం చెప్పింది. ఇది అసలైన మిత్ర లక్షణం.
దశరథ మహారాజుతో ఉన్న మైత్రి వల్లనే జటాయువు సీతామాత రక్షణకోసం రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కృష్ణార్జునులు, రాముడు, సుగ్రీవుడు, విభీషణుడు తదితరుల మధ్యనున్న చెలిమి ఈ కోవదే. కర్ణ, దుర్యోధనుల మైత్రి కొంత వరకే ఆదర్శంగా కనిపిస్తుంది. స్నేహధర్మానికి కట్టుబడ్డ నిబద్ధత కర్ణుడిదైతే, కర్ణుడి అండతో అర్జునుణ్ణి ఎదుర్కోవాలనే స్వార్థం దుర్యోధనుడిది. ఇలా ఎందరో సఖ్యభక్తి రూపంలోని స్నేహబంధంతో తమ తమ లక్ష్యాలవైపు జీవితాలను నడిపించుకోగలిగారు. ఈ సారాన్ని పరిశీలిన్తే స్నేహమయమైన ఆదర్శ జీవితాన్ని తీర్చిదిద్దుకోమని తెలియచెప్పటమే మన భారతీయ సంస్కృతిలోని సఖ్యభక్తి లక్ష్యమని అర్థమవుతుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని