మోదక ప్రియా ప్రమోద క్రియా

భగవదారాధనలో షణ్మతాలున్నాయి. అందులో గాణాపత్యం ఒకటి. గణపతి ఆరాధన మహా శక్తివంతమైనది. పురుషుడు శివుడు, ప్రకృతి పార్వతిల కలయికాస్వరూపమే వినాయకుడిగా భక్తుల పూజలందు కుంటున్నాడు. గణపతిని ఆరాధిస్తే సమస్త విశ్వాన్ని ఆరాధించినట్లే.

Updated : 31 Aug 2022 08:04 IST

(నేడు వినాయక చవితి)

దేవుళ్లలో ప్రథముడు, ప్రధానుడు వినాయకుడు. దేవతలు సైతం ఆరాధించిన విఘ్నేశ్వరుణ్ణి ఆటంకాలూ అవరోధాలూ కలిగించొద్దంటూ అనునిత్యం ప్రార్థిస్తాం. భండాసుణ్ణి సంహరించి జగన్మాతకు, త్రిపురాసురుణ్ణి వధించి మహాశివుడికి తోడ్పడిన ఘననాయకుడికి నీరాజనాలు! 

భగవదారాధనలో షణ్మతాలున్నాయి. అందులో గాణాపత్యం ఒకటి. గణపతి ఆరాధన మహా శక్తివంతమైనది. పురుషుడు శివుడు, ప్రకృతి పార్వతిల కలయికాస్వరూపమే వినాయకుడిగా భక్తుల పూజలందు కుంటున్నాడు. గణపతిని ఆరాధిస్తే సమస్త విశ్వాన్ని ఆరాధించినట్లే. ‘గణ్యంతే సంఖ్యాయంతే ఇతి గణాః తేషాం పతిః గణపతిః’ అన్నారు. అంటే లెక్కకు అందేవి గణాలు, వాటిని నడిపించేవాడు గణపతి అని అర్థం. గణాలు అనేకం, పతి ఒక్కడే. అనేకానికి ఏకం అనే మరో అర్థముంది. ముద్గల పురాణాన్ని అనుసరించి 32మంది గణపతులున్నారు. క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, అరుణ గణపతి, వల్లభ గణపతి, శక్తి గణపతి, నాట్య గణపతి, లక్ష్మీ గణపతి... ఇలా అనేకానేక నామరూపాలతో గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. 

ఏనుగు ముఖం.. ఆంతర్యం.. 

గజం బలానికి, ఐశ్వర్యానికి, ఏకాగ్రతకీ సంకేతం. యోగ పరంగా చూస్తే సంగీతంలోని సప్తస్వరాలను మన శరీరంలో ఉండే షట్చక్రాలు, సహస్రారములకు ప్రతీకగా చెబుతారు. ‘స, రి, గ, మ, ప, ద, ని’ స్వరాల్లో ఏడో స్వరం ‘ని’ నిషాధం. ఇది ఏనుగు ఘీంకారంలో ప్రతిధ్వనిస్తుంది. అది పరబ్రహ్మస్థానమైన సహస్రారాన్ని సూచిస్తుంది. అంటే పరమపదప్రాప్తికి వినాయకుని ఏనుగు ముఖం సంకేతం. 

గణనాథుడు భక్త సులభుడు 

గణపతిని ప్రసన్నం చేసుకోవడం ఎంతో సులభం అనడానికి దూర్వార్చన ఒక ఉదాహరణ. మాటలకందని మహా గణనాథుడు చిన్న గరిక ముక్కకు ప్రసన్నుడు అవుతాడు. తనకు పెద్ద పెట్టున ఉత్సవాలు చేయకున్నా... త్రికరణ శుద్ధితో అర్చిస్తే చాలు ఆనందిస్తాడు. కుడుములు, ఉండ్రాళ్లు, లడ్డూలంటే బొజ్జగణపయ్యకు మహా ప్రీతి. కానీ చిటికెడు బెల్లం సమర్పించినా ఆ కొండంత దేవుడు నిండైన మనసుతో స్వీకరిస్తాడని ఆర్యోక్తి. వినాయక చతుర్థిలోని 4 సంఖ్య ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంకేతం. ఈ నాలుగు పురుషార్థాలు గణేశుని స్మరించడంతోనే కలుగుతాయి. 

విఘ్న హర్తగా గణపతి 

సృష్టి సమయంలో బ్రహ్మదేవుడికి విఘ్నాలు ఎదురవడంతో గణపతిని స్మరించాడు. తక్షణం ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం చూసి...

శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే

అంటూ స్తుతించాడు బ్రహ్మ. ‘తెల్లని వస్త్రం ధరించిన వాడిని, అంతటా వ్యాపించినవాడిని, చంద్రుడిలా తెల్లనైనవాడిని, నాలుగు భుజాలు కలవాడిని, ప్రశాంత వదనం కలవాడిని, విఘ్నాలన్నిటినీ తొలగించమని ధ్యానిస్తున్నాను’ అనేది శ్లోక భావం.
విఘ్నాధిపతిని బ్రహ్మ దర్శించిన రోజు మాఘ కృష్ణ చవితి. అదే సంకష్టహర చతుర్థి. ఈ వినాయకుడు కష్టాలు తొలగిస్తే, భాద్రపద శుద్ధ చవితి నాటి గణపతి ఇష్టకామ్యాలు కలిగిస్తాడు.

గణపతికి సింధూరం ఎందుకు... 

పూర్వం సింధురాసురుడనే రాక్షసుడు దేవతలను పీడించడంతో, గణపతి యుద్ధానికి తలపడ్డాడు. ఆ రూపం చూస్తే రాక్షసునికి ముద్దొచ్చింది, నవ్వు కూడా వచ్చింది. ‘చిటికెన వేలంత లేవు.. నాతో యుద్ధం చేయాలని వచ్చావా? వెళ్లు.. వెళ్లి మీ అమ్మతో ఆడుకో’ అంటూ గేలిచేశాడు. ‘చిరుదీపం పెను చీకటిని పోగొడుతుంది. అలాగే నేను చిన్నగానే ఉన్నా.. నిన్ను చంపేది నేనే’ అని బదులిచ్చాడు. ఆ వెంటనే సింధురాసురుణ్ణి ఒక ఉండగా చేసి ఒంటికి పూసుకున్నాడు. అందుకే నాటి నుంచి గణపతికి సింధూరంతో అర్చనలు చేస్తున్నారు. 

చోరుడు రుషి అయ్యాడు
ఒక చోరుడికి గణపతి పట్ల భక్తి కలిగింది. నిరంతర జపధ్యాన తత్పరుడై, లలాటం వద్ద స్వామిని ధ్యానించాడు. భృకుటి వద్దే తొండం గోచరించి భృశుండి మహర్షిగా, గణనాథునికి ప్రియమైన భక్తునిగా మారిపోయాడు. ఇలాంటి లీలలెన్నో గణపతి వైభవాన్ని తెలియజేస్తున్నాయి. 

అమ్మ కష్టం తీర్చిన కుమారుడు 

లోక కంటకమైన భండాసుర సంహారంలో జగన్మాతకే విఘ్నం ఏర్పడింది. అప్పుడు అమ్మ సేనలకు తానే వెన్నుదన్నుగా నిలిచాడు పార్వతీనందనుడు. మనం నిత్యం స్మరించే లలితా సహస్రనామ స్తోత్రంలో ‘కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా.. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా’ అనే నామాలు వినాయకుని ఘనతను స్పష్టం చేస్తాయి. అలాగే మహాశివుడికి కూడా త్రిపురాసుర సంహారంలో సహాయపడ్డాడు. 

గణేశుడు శివపార్వతుల తనయుడు కాదు... 

మనమంతా అనుకుంటున్నట్టు గణపతి శివపార్వతుల పుత్రుడు కాదని చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరులు వారి వివాహ సమయంలో గణపతి పూజ చేశారని చెప్పిన పురాణ కథ ఒకటుంది. అంటే గణపతికి అనేక రూపాలు, అనేక నామాలు ఉన్నాయన్నమాట. ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం ఉమామహేశ్వరుల పెళ్లి సమయంలో ‘ఈ తల్లికి బిడ్డగా పుట్టాలి’ అనుకున్నాడట శ్రీహరి. ఆ సంగతి గ్రహించిన పార్వతీదేవి అందుకు సమ్మతి తెలియజేసింది. ఫలితమే లక్ష్మీగణపతి రూపం. 

గణపతి సహస్ర నామాలు 

‘భ్రూమధ్యధ్యానగోచరాః, స్వలావణ్య సుధాపూరజిత మన్మథ విగ్రహాః, శంభుకోపఘ్నః, శంభుహాస్యభూః’ వంటి గణేశ సహస్ర నామాలు మన జన్మను చరితార్థం చేస్తాయి. నమ్మి ఆరాధించేవారిని గణపతి సదా కనిపెట్టుకుని ఉంటాడు. అందుకే... 

లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్లకే చెయ్యి సాచు
వలిదంబు పట్టుదువ్వలువలే పనిలేదు

పసుపు గోచీకె సంబ్రాలు పడును 

అన్నారు కరుణశ్రీ. అంతటి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిద్దాం, శాంతిసౌఖ్యాలతో విరాజిల్లుదాం. 

- పుల్లాభట్ల నాగశాంతి స్వరూప, శతావధాని, ఆధ్యాత్మికవేత్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని