అగస్త్యుడి చాతుర్యం

ఒకప్పుడు దండకారణ్య సమీపంలో వాతాపి, ఇల్వలుడు అనే రాక్షస సోదరులు బ్రాహ్మణుల మాంసం రుచిగా ఉంటుందని వారిని చంపి తినేవారు.

Updated : 25 Aug 2022 04:16 IST

కప్పుడు దండకారణ్య సమీపంలో వాతాపి, ఇల్వలుడు అనే రాక్షస సోదరులు బ్రాహ్మణుల మాంసం రుచిగా ఉంటుందని వారిని చంపి తినేవారు. అందుగ్గానూ ఇల్వలుడు తమ ప్రాంతానికి ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చాడని తెలియగానే అతడి వద్దకు వెళ్లి తన తండ్రి ఆబ్దికమని చెప్పి, భోక్తగా రమ్మని కోరేవాడు. ఇల్వలుడికి చనిపోయినవారిని బతికించే మృతసంజీవని విద్య తెలుసు. వాతాపిని మేకగా మార్చి, ఆ మేకమాంసంతో వండిన వంటకాలను అతిథులకు వడ్డించే వాడు. వారు తృప్తిగా తిన్న తర్వాత ‘వాతాపీ! రా’ అని పిలిచేవాడు. ఆ బ్రహ్మణుడి పొట్ట చీల్చుకుని మేకరూపంలో బయటకు వచ్చిన వాతాపి తన సహజరూపం పొందేవాడు. ఇక అన్నదమ్ములిద్దరూ ఆ బ్రాహ్మణుణ్ణి ఆరగించేవారు. 

వింధ్యపర్వత గర్వాన్ని అణచాలని ఆ ప్రాంతానికి వచ్చి అక్కడి వారికి సాయం చేస్తున్నాడు అగస్త్యుడు. అందుకే దక్షిణ దిక్కును అగస్త్యదిక్కు అని కూడా అంటారు. దేవతలు అగస్త్యుడి వద్దకు వెళ్లి వాతాపి సోదరుల దారుణాన్ని ఆపమని కోరారు. రుషులకు క్షేమం కలిగించే దేవకార్యం కనుక అంగీకరించాడు. అగస్త్యుడు ఆ పరిసరాలకు రాగానే ఇల్వలుడు యథాప్రకారం అగస్త్యుణ్ణి ఆబ్దికానికి భోక్తగా ఆహ్వానించాడు. వచ్చిన తర్వాత మేకమాంసంతో వండిన వంటకాలను పెట్టాడు. భోజనం చేసిన అగస్త్యమహర్షి ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అన్నాడు, పొట్ట నిమురుకుంటూ. ఇల్వలుడు ఎప్పట్లాగే ‘వాతాపీ! రా!’ అని పిలిచాడు. అగస్త్యుడు నవ్వుతూ ‘ఇంకెక్కడి వాతాపి? ఎప్పుడో జీర్ణమై పోయాడు. యమసదనానికి అతిథిగా వెళ్లాడు’ అన్నాడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుణ్ణి చంపాలని దూసుకొచ్చాడు. కానీ అగస్త్యుడి ఉగ్రదృష్టికి భస్మమై పోయాడు. విప్రులకు, మునులకు వాతాపి, ఇల్వలుల బాధ తొలగింది. అప్పటి నుంచి బ్రాహ్మణులు మాంసం తినరాదని అగస్త్యుడు శాసనం చేశాడు. ఇప్పటికీ చిన్నపిల్లలు పాలు తాగిన తర్వాత, అన్నం తిన్న తర్వాత ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అనడం అలవాటుగా మారింది. అరణ్యవాసంలో రాముడు అగస్త్యుడి గురించి లక్ష్మణుడికి చెప్పిన కథ ఇది. 

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని