బ్రతికి యుండిన శుభములు...

చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలనేది సామెత. ఆరోగ్యం, సంపద, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు- అన్నీ జీవితంలో ముఖ్యమైనవే. వీటి కంటే ముఖ్యమైనది ఆయుష్షు.

Updated : 08 Sep 2022 00:36 IST

సెప్టెంబర్‌ 10 ప్రపంచ ఆత్మహత్యా నిరోధ దినం

చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలనేది సామెత. ఆరోగ్యం, సంపద, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు- అన్నీ జీవితంలో ముఖ్యమైనవే. వీటి కంటే ముఖ్యమైనది ఆయుష్షు. అందుకే  ‘ఆయు రారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు! భోగభాగ్యాది ఫల సిద్ధిరస్తు!’ అంటూ పండితుల ఆశీర్వచనం ఆయుష్షుతో ప్రారంభమవుతుంది.  సముద్రంలో అలలెంత సహజమో జీవితంలో సమస్యలూ అంతే. వాస్తవానికి సముద్రంలో నీళ్లే అలలు. వాటిని ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడటం పిరికిచేష్ట.

జీవితంలో సంఘటనలే ఉంటాయి, సమస్యలుండవు. వాటినెదుర్కోగలిగితే సన్నివేశం అవుతుంది. అందుకు కష్టపడాల్సి వస్తే సమస్య అవుతుంది. అందుకే ‘సమస్యల తోరణమే జీవితం, సమస్యలతో రణమే జీవితం’ అంటారు జిల్లెళ్లమూడి అమ్మ. చావు ఎన్నడూ పరిష్కారం కాదు. ఎదుటివారి సమస్య మనకు చిన్నదిగానే కనిపిస్తుంది. అందుకని సమస్యను ఎదుర్కోవడానికి మనం అందులో భాగం కాకుండా, బయటుండి పరిష్కారమార్గాన్ని ఆలోచించాలి. సృష్టిలో ఏ ప్రాణీ ఆత్మహత్య చేసుకోదు. అన్నిటికంటే తెలివైన మనుషులే తెలివితక్కువతనంతో బలవన్మరణానికి పూనుకోవడం శోచనీయం. సీత కష్టాలు సీతవైతే పీత కష్టాలు పీతవి. ఎవరి స్థాయిలో వారికి కష్టాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో చావు ఆలోచనలు రానీయక వివేచన పని చేయాలి. అదే వివేకానికి గీటురాయి. మన పురాణేతిహాసాల్లో క్లిష్ట సమయాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన పెద్దలూ ఉన్నారు. కానీ ఆ అవివేకపుటాలోచనకు కార్యరూపం ఇవ్వకుండా బయటపడి అత్యున్నత స్థానాన్ని పొందారు. బలమైన ఆ బలహీన క్షణాన్ని అధిగమించగలిగితే అంతా అభ్యుదయమే. అందుకే తిక్కన మహాకవి ‘బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు..’ అన్నాడు మహాభారతం కర్ణ పర్వంలో.

రామాయణంలో సీత, రాముడు, భరతుడు, అంగదుడు, ఆంజనేయాదులు ఈ రకమైన చిత్త చాంచల్యానికి గురైనవారే. కానీ విజ్ఞతతో ఆ పరిస్థితిని అధిగమించారు. అంతపురం నుండి అంతఃపురంలోకి అడుగుపెట్టిన రాచబిడ్డ సీతమ్మ అరణ్యాలపాలైంది. పైగా ప్రాణప్రదమైన భర్తృ వియోగం, బిడ్డలాంటి మరిదిని నిందించిన ఆత్మన్యూనత, కాముకుడైన రాక్షసునిచెర, చుట్టూ అహర్నిశమూ బెదిరించే రాక్షస మూక, మానవ మాత్రులు చేరుకోలేని లంకాద్వీప నివాసం. ఇసుమంతైనా ఆశావాహంగా లేని సన్నివేశంలో ‘ఉద్బధ్య వేణ్యుద్గథ్రనేన శీఘ్రమ్‌ అహం గమిష్యామి యమస్య సదనం’ అంటూ ఆత్మహత్య చేసుకోవా లనుకున్న సీతమ్మకు హనుమంతుడి రామనామ కీర్తనతో తన అవివేకం నుంచి బయటపడి త్వరలోనే భర్తృసాన్నిధ్యాన్ని పొందింది. అంటే భాగవన్నామ స్మరణ అవివేకపుటాలోచనల్ని అంతమొందిస్తుందనేది ఇందులోని అంతరార్థం.

ప్రాణసఖి సీతావియోగ దుఃఖం, అతి బలవంతుడైన శత్రువు, అతణ్ణి చేరడానికి అడ్డుగా ఉన్న సముద్రం.. వెరసి రామచంద్రుడు అంతటివాడిలోనూ ఆత్మహత్య భావన తొంగిచూసింది. కానీ రాముడు సముద్రునిపై ప్రసరింపజేసిన కోపాగ్ని వెలుగులో ఆ చీకటి భావన పటాపంచలై శత్రువుపై అఖండ విజయం సాధించి పెట్టింది. రాజ్యంపట్ల ఏమాత్రం వ్యామోహం లేని భరతుడు తల్లి చేష్టకు అపరాధ భావనతో కుంగి పోతూ రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు. రాముడు అంగీకరించకపోయేసరికి ప్రాయోపవేశానికి పాల్పడగా ‘చిత్వయిత దారుణం వ్రతం’ అంటూ భరతుణ్ణి వారించాడు శ్రీరాముడు. ‘రామోవిగ్రహ వాన్ధర్మః’ అన్నారు. శ్రీరామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మ స్వరూపం. అలాంటి ధర్మ స్వరూపుడైన రాముడి దృష్టిలో ఆత్మహత్య అత్యంత దారుణ విషయంగా తెలుస్తుంది.

వాలి వధానంతరం సుగ్రీవుడిలోనూ పశ్చాత్తాపంతో ఆత్మహత్య ఆలోచనలు పొడచూపాయి. సీతాన్వేషణలో ఉన్న అంగద జాంబవంతాది వానరవీరులు సమయం మించి పోవడంతో సుగ్రీవుడికి భయపడి సామూహిక ఆత్మహత్యకు పూనుకున్నారు. ‘ఇహైవ ప్రాణమాశిష్యే శ్రేయో మరణమేవ మే’ అంటూ అంగదుడు ఆత్మ హత్యకు పూనుకోగానే తక్కిన వానరులు అతన్ని అనుసరించారు. జాంబవంతుడు, హనుమంతుడు మొదలైనవారు అంగదుని నిలువరించారు. సీతమ్మను, సుగ్రీవుని, అంగదుని, భరతుని ఆత్మహత్య నుంచి తప్పించిన హనుమ లంకలో సీతమ్మ జాడ తెలియక ఆత్మహత్యాభావనకు లోనయ్యాడు. కానీ వారంతా ఆ చాంచల్యం నుంచి బయటపడి అభ్యుదయం పొందారు.
ఈ రకమైన ఘటనలు మనకు శివపురాణంలో, విష్ణు పురాణంలో కూడా కనిపిస్తాయి. విశ్వామిత్రుడు కల్మాషపాదునిలో రాక్షసత్వాన్ని ప్రేరేపించి వశిష్టుడి వందమంది కుమారులను సంహరించాడు. అలాంటి తరుణంలో స్వయంవశుడైన వశిష్ఠుడు సైతం ఆత్మ హత్యకు యత్నించినప్పటికీ.. పంచభూతాల అనుగ్రహంతో దాన్నుంచి తప్పించుకొని స్థిరంగా నిలబడ్డాడు. మహా భారత యుద్ధంలో 17వ నాటి మధ్యాహ్నం కొన్ని కారణాలవల్ల ధర్మరాజును నిందించిన అర్జునుడు ఆత్మహత్యకు సిద్ధపడినా.. కృష్ణుడి సూచనతో ఆత్మహత్యా సదృశమైన గురునిందా, ఆత్మస్తుతి చేసుకుని దాన్నుంచి బయటపడతాడు. ఘోషయాత్రాసందర్భంలో గంధర్వుల చేతిలో ఓడి భీమార్జునుల సహాయంతో ప్రాణభిక్ష పొందిన దుర్యోధనుడు అవమానభారంతో ప్రాయోపవేశానికి పాల్పడి కర్ణ శకునుల అనునయంతో విరమించాడు.

ఆత్మహత్యను ప్రపంచంలోని అన్ని మతాలూ, ధర్మాలూ మహాపాపంగానే పరిగణించాయి. హిందూ ధర్మం ఆత్మహత్యను మహాపాపంగా పరిగణిస్తుంది. ‘దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః’ అన్నారు. అంటే దేహం దేవాలయం, జీవుడే దేవుడు. దేవాలయ సదృశ దేహాన్ని బలవంతంగా నాశనం చేసే హక్కు మనకు లేదన్నమాట.

విషమ పరిస్థితులు, ఆశాభంగం, అధికారుల ఒత్తిడి, అనుకున్నది సాధించలేక పోవడం లేదా సాధించిన దానితో సంతృప్తి లేక తక్కువనుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఇష్టపడిన వారి తిరస్కారం లాంటి చిన్నా పెద్దా కారణాలు ఏవైనా కావచ్చు వాటికి పరిష్కారం ఆత్మహత్య మాత్రం కాదు. బతికి సాధించని పనిని చచ్చి సాధించినవాడు లేడు.

సృష్టి, స్థితి, లయల్లో మొదటిది, చివరిది మనవి కావు. స్థితి మాత్రమే మనది. ఆ కర్తవ్యపాలనే దైవారాధన. జీవితం వ్యక్తిగతం, కౌటుంబికం, సామాజికం, ఆధ్యాత్మికం అని నాలుగు రకాలు, ఈ ఆత్మహత్య భావన వ్యక్తిగతంగా కర్తవ్యం నుంచి పారిపోయే పలాయనవాదం. కుటుంబానికి దుఃఖం, సమాజానికి నష్టం, ఆధ్యాత్మికపరంగా మహాపాపం. ఏ రకంగా చూసినా శ్రేయోదాయకం కాదు.

- డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని