ఆరోగ్యాల చద్ది ఉండ్రాళ్ల తద్ది

ఉండ్రాళ్ల తద్ది రోజున పార్వతీదేవి ముత్తైదువల రూపంలో వాయనం తీసుకోవడం వరకే ఎక్కువ మందికి తెలుసు. నిజానికిది ఆరోగ్యప్రదమైన పండుగ.

Updated : 08 Sep 2022 01:06 IST

సెప్టెంబర్‌ 12  ఉండ్రాళ్ల తద్ది

ఉండ్రాళ్ల తద్ది రోజున పార్వతీదేవి ముత్తైదువల రూపంలో వాయనం తీసుకోవడం వరకే ఎక్కువ మందికి తెలుసు. నిజానికిది ఆరోగ్యప్రదమైన పండుగ. తెల్లవారుజామున లేచి పొగలొచ్చే వేడన్నంలో పొట్లకాయ కూర, వెల్లుల్లి దట్టించిన గోంగూర పచ్చడి, పప్పుచారు, నువ్వుల పొడి ఆధరువులకు ఘుమఘుమలాడే నెయ్యి, ఆఖర్లో పెరుగన్నంలో కంది పచ్చడి నంజుకోవడం.. కాళ్లూ చేతులకు గోరింటాకు అలంకారాలు, ఉండ్రాళ్ల నైవేద్యం, ఉయ్యాలూగడం... వీటి వెనుక శ్రావణ, భాద్రపద మాసాల్లో సంభవించే రుతుపరమైన మార్పుల కారణంగా సంక్రమించే అనేక రకాల అనారోగ్యాలను పారద్రోలే వైద్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
ఇది వర్షరుతువు. వాతావరణంలో ఉండే తేమ గోళ్లలోకి చేరి ఫంగస్‌ వ్యాధులు, పిప్పిగోళ్లు వచ్చే అవకాశముంది. గోరింటాకు దీనికి విరుగుడుగా పనిచేస్తుంది. ఉత్తినే పెట్టుకోమంటే పెట్టుకోరని దానికి ఉండ్రాళ్ల తద్దిని ఒక కారణంగా చూపించారు. గోరింటాకులోని హెనోటానిక్‌ యాసిడ్‌ అనే రసాయనం గోళ్లకు చక్కటి ఎర్రదనాన్ని ఇవ్వడమే గాక తేమలో, వర్షపు నీళ్లలో ఉన్న ఫంగస్‌ విత్తనాలను చంపేస్తుంది. పగటి పూజ అయిన తర్వాత తినే బియ్యపు పిండి ఉండ్రాళ్లు అజీర్ణం, తేమ వలన వచ్చే పైత్యం, జలుబు, వాతం వంటి జబ్బులకు దివ్య ఔషధం. ఇక పెరుగన్నంలో వెల్లుల్లి వేసిన కందిపప్పు లేదా గోంగూర పచ్చడి నంజుకోవడం ఎందుకంటే, తేమ వాతావరణం వలన దేహ ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది. కనుక దానిని సమతుల్యం చేయడానికే ఇవి. ఇవన్నీ తిన్న తరువాత కొంచం సేపు ఉయ్యాల ఎందుకు ఊగుతారంటే, వానాకాలంలో చేసే అజీర్ణం వల్ల కడుపులో గ్యాస్‌ అనే వాయు ప్రకోపం ఏదైనా ఉంటే అది ఈ ఉయ్యాల వూగే ఆట వలన సర్దుకుంటుంది.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని