లక్ష్మిని కాదన్న తుకారాం

ఒకసారి తుకారాం భార్య నది నుంచి నీరు తెస్తోంది. ఇంతలో ఒక స్త్రీ ఎదురుగా వస్తోంది. ఆపాదమస్తకం మేలిమి బంగారు నగలు ధరించిన ఆమెను చూడగానే కళ్లు మిరిమిట్లు గొల్పగా ‘అమ్మా! మీరెవరు?’ అనడిగింది తుకారాం భార్య. ‘అష్టలక్ష్మిని’ అందామె. ‘అంటే?’ స్పష్టత కోసం అడిగింది తుకారాం భార్య.

Published : 15 Sep 2022 00:43 IST

ఒకసారి తుకారాం భార్య నది నుంచి నీరు తెస్తోంది. ఇంతలో ఒక స్త్రీ ఎదురుగా వస్తోంది. ఆపాదమస్తకం మేలిమి బంగారు నగలు ధరించిన ఆమెను చూడగానే కళ్లు మిరిమిట్లు గొల్పగా ‘అమ్మా! మీరెవరు?’ అనడిగింది తుకారాం భార్య. ‘అష్టలక్ష్మిని’ అందామె. ‘అంటే?’ స్పష్టత కోసం అడిగింది తుకారాం భార్య. ‘సకల సంపదలను ఇచ్చే మహా లక్ష్మిని. నేను నివాసమున్న చోట ధనధాన్యాలతో పాటు సర్వ సుఖాలూ ఉంటాయి’ అంది దేవత. ‘నువ్వు లేకపోవడం వల్లే మేం అష్ట కష్టాలూ పడుతున్నాం! మా ఇంటికి కూడా రావచ్చు కదమ్మా?!’ అంది తుకారాం భార్య ఆశగా. ‘సరే! రేపు ఉదయం మీ ఇంటికి తప్పక వస్తాను’ అంటూ అక్కణ్ణించి మాయమైంది లక్ష్మీదేవి. తుకారాం భార్య ఆనందంగా ఇంటికి వెళ్లింది.
మర్నాడు అష్టలక్ష్మి తుకారాం ఇంటికి వచ్చి తలుపు తట్టింది. పరుగున వచ్చి తుకారాం భార్య ఆనందంగా తలుపులు తీసింది. ‘అమ్మా! నీకోసమే ఎదురు చూస్తున్నాను’ అంది. కానీ అష్టలక్ష్మి ఇంట్లో ప్రవేశించలేదు. గుమ్మానికి బయటే నిలుచుంది.
తుకారాం భార్య ఎంత ప్రార్థించినా.. ‘నన్ను ఆహ్వానించాల్సింది నువ్వొక్కదానివే కాదు. నా భక్తుడు తుకారాం కూడా వచ్చి పిలిస్తే గానీ లోనికి రాలేను’ అంది. లోపల ఉన్న తుకారాంకు ఆ మాటలు వినిపించాయి. పరుగున వచ్చి సాష్టాంగపడి ‘అమ్మా! నేనెన్నడూ నిన్ను రమ్మని కోరలేదు. నువ్వు గనుక ఇంట్లో నివాసం ఉంటే.. ఆ సంపదల వ్యామోహంలో పడి, దేవునిపై సరిగా ధ్యాస నిలవదు. స్వామిని స్మరించని నా జీవితానికి ధన్యత లేదు కదా! కనుక మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లమ్మా! అంతే చాలు’ అంటూ ప్రార్థించాడు. జీవిత పరమార్థం బోధపడిన తుకారాం భార్య కూడా అష్టలక్ష్మికి మౌనంగా నమస్కరించింది.

- బెహరా ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని