అంతా నీదే!

నానక్‌ సోదరి నానకి. పెళ్లయ్యాక ఆమె సుల్తాన్‌పూర్‌లో నివాసం ఉండేది. తమ్ముడి కోసం ఒక వధువును చూస్తున్నానని తండ్రికి కబురుచేసింది. ఆయన వెంటనే కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు. నానక్‌కు చిన్నతనం నుంచి దైవనామస్మరణతో తాదాత్మ్యం చెందడం అలవాటు.

Published : 15 Sep 2022 00:43 IST

నానక్‌ సోదరి నానకి. పెళ్లయ్యాక ఆమె సుల్తాన్‌పూర్‌లో నివాసం ఉండేది. తమ్ముడి కోసం ఒక వధువును చూస్తున్నానని తండ్రికి కబురుచేసింది. ఆయన వెంటనే కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు. నానక్‌కు చిన్నతనం నుంచి దైవనామస్మరణతో తాదాత్మ్యం చెందడం అలవాటు. ఇది సుల్తాన్‌పూర్‌ వాసులకు కొత్తగా అనిపించేది. నానక్‌ జీవిక కోసం గోధుమలు కొలిచే ఉద్యోగంలో చేరాడు. నానక్‌ నీతీ, నిజాయితీ, పనిలో శ్రద్ధ యజమానిని, వినియోగదారులను మురిపించేవి. నానక్‌ పని చేసు కుంటూనే దేవుణ్ణి ధ్యానిస్తూ, భక్తి పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఓరోజు ఒక వ్యక్తి 13కుంచాల గోధుమలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. నానక్‌ అతనికి ఏక్‌..దో..తీన్‌.. అంటూ గోధుమలు కొలుస్తూ 13వద్దకు వచ్చేసరికి ‘తేరా’ అంటూ ఆపకుండా కుంచంతో గోధుమలు కొలుస్తున్నాడు. ‘తేరా’ అంటే నీదేనని అర్థం ఉంది. ఆయన లెక్కించేటపుడు వచ్చిన ఆ పదాన్ని ‘స్వామీ! ఈ సృష్టి అంతా నీదే’ అన్న భావనలో మునిగి ‘తేరా.. తేరా’ అంటూ మరిన్ని గోధుమలు కొలిచాడు. వినియోగదారుడు వెళ్తూ వెళ్తూ యజమానితో ‘నీ పనివాడు మంచివాడే కానీ, బొత్తిగా లెక్కలు రావు. అతనందరికీ ఇవ్వాల్సిన కంటే అధికంగా గోధుమలు కొలుస్తున్నాడు, జాగ్రత్త’ అంటూ చెప్పి వెళ్లాడు. యజమానికి నానక్‌పై విపరీతమైన నమ్మకం. అయినా ఒకసారి పరీక్షించి చూద్దామనుకుని దుకాణంలో మిగిలి ఉన్న గోధుమలు, అమ్మిన గోధుమలను లెక్కించి చూశాడు. ఆశ్చర్యంగా ఉండాల్సిన కంటే గోధుమలు ఎక్కువగా ఉన్నాయి. అతడు తన దుకాణానికి వచ్చినవారిని పిలిచి నానక్‌ కొలత తీరు ఎలా ఉందని విచారించాడు. వారంతా తాము కొన్న వాటి కంటే ఎక్కువ గోధుమలను నానక్‌ కొలిచి ఇచ్చినట్లు చెప్పారు. దాంతో యజమానికి నానక్‌ గొప్పతనం అర్థమైంది. ‘ఇదంతా దైవమహిమ, నానక్‌ ఏ పని చేసినా దైవిక భావనలో మునిగి చేస్తున్నాడు. అందుకే ఆయన ఖాతాదారులకు కొలుస్తున్న అధిక మొత్తాన్ని దైవం భర్తీ చేస్తున్నాడు’ అనుకుని నానక్‌కు శిరస్సు వంచి ప్రణమిల్లాడు దుకాణ యజమాని.

- గొడవర్తి శ్రీనివాస్‌, ఆలమూరు, న్యూస్‌టుడే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని